about - మన భూమిని , నీటిని , విద్యుత్తును మింగేసి, మన పర్యావరణాన్ని పాడు చేసే 1 గిగావాట్ డేటా సెంటర్ గురించి నిజాలు తెలుసుకోండి

ప్రభుత్వం ద్వారా నీటిని, విద్యుత్ ను, భూమిని రాయితీ ధరలపై పొంది మరిన్ని డాటా సెంటర్ లు కూడా ఈ ప్రాంతానికి రావడానికి క్యూలో నిలబడి ఉన్నాయి.

 · 4 min read

రంగారెడ్డి జిల్లాఫ్యూచర్ సిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం TCS అనుబంధ సంస్థ 'హైపర్ వాల్ట్' భారీ పెట్టుబడితో 1 గిగావాట్ (1 GW లేదా 1,000 మెగావాట్లు) సామర్థ్యం కలిగిన బృహత్తర AI డేటా సెంటర్ ఏర్పాటుకు 264 ఎకరాల భూమిని కేటాయించింది. అంతకుముందే అమెజాన్ (AWS) డేటా సెంటర్ కోసం ఇదే ప్రాంతంలో 202 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

ప్రభుత్వం ద్వారా నీటిని, విద్యుత్ ను, భూమిని రాయితీ ధరలపై పొంది మరిన్ని డాటా సెంటర్ లు కూడా ఈ ప్రాంతానికి రావడానికి  క్యూలో నిలబడి ఉన్నాయి.

"డాటా సెంటర్ ల వల్ల వేలాది ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది" అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం ఎంత? ఈ డేటా సెంటర్లు మన గ్రామీణ జీవనోపాధిపై, వ్యవసాయంపై, భూమి పై, తాగునీటిపై, విద్యుత్ సరఫరాపై, మన ఆరోగ్యాలపై, మొత్తంగా ఆ ప్రాంత పర్యావరణంపై   చూపే దుష్ప్రభావాలు ఏమిటి ? తెలుసుకుందాం.

1 గిగావాట్ AI డేటా సెంటర్ క్యాంపస్ కోసం TCS కంపెనీకి ప్రభుత్వం 264 ఎకరాలు కేటాయించింది (గతంలో అమెజాన్ డాటా ప్రాజెక్టుకు 202 ఎకరాలు ఇచ్చింది), కానీ ఈ భూమి వాళ్ళకు భవిష్యత్తులో సరిపోదు.  డేటా సెంటర్ల నుండి 24 గంటలూ వెలువడే భారీ వేడి, 85 డెసిబెల్స్ దాటే శబ్దాన్ని, పొగను అరికట్టడానికి భవనం చుట్టూ 500 మీటర్ల నుండి 1 కిలోమీటరు వెడల్పుతో దట్టమైన అడవి (Green Buffer Zone) పెంచాల్సి ఉంటుంది.264 ఎకరాల డేటా సెంటర్ చుట్టూ 500 మీటర్ల (అర కిలోమీటరు) వెడల్పుతో అడవి పెంచాలంటే 724 ఎకరాల అదనపు భూమి కావాలి.

ఒకవేళ 1 కిలోమీటరు వెడల్పుతో దట్టమైన అడవి పెంచాలంటే ఏకంగా 1,960 ఎకరాల అదనపు భూమి కేటాయించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే, ఆ డాటా సెంటర్ వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల, రాష్ట ప్రభుత్వం ఇప్పుడు ఏమి చెప్పినా, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటున్న రైతుల నుండి బలవంతంగా మరింత భూమిని సేకరిస్తారు.  రైతులకు తక్కువ నష్టపరిహారం ఇచ్చి గుంజుకున్న ఈ భూములను పర్యావరణాన్ని నాశనం చేసే ఈ డాటా సెంటర్లకు ఇస్తారు.

1 గిగావాట్ డేటా సెంటర్ తన సర్వర్లను చల్లబరచడానికి వాటర్-ఇంటెన్సివ్ పద్ధతిలో రోజుకు 3.6 కోట్ల లీటర్ల నుండి 5 కోట్ల లీటర్లు వాడుతుంది. ఒక డాటా సెంటర్ రోజుకు వాడే ఈ 3.6 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు మళ్లిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది పొడవునా ప్రతిరోజూ 3,60,000 మందికి (సుమారు 90,000 కుటుంబాలకు) పూర్తిగా ఉచితంగా తాగునీరు అందించవచ్చు. మున్సిపాలిటీల్లో,ప్రతిరోజూ 2,66,666 మందికి (66,000 కుటుంబాలకు) మంచి నీరు ఉచితంగా ఇవ్వవచ్చు. నీళ్ళ కొరత తీవ్రంగా ఉండే తెలంగాణ లో డాటా సెంటర్ లకు అనుమతి ఇవ్వడం విచక్షణ లేని నిర్ణయం.

ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తే, 1,400 నుండి 1,750 ఎకరాల్లో సంవత్సరం పొడవునా,  రెండు సీజన్ లలోవరి సాగు చేయవచ్చు. సంవత్సరానికి 2-3 పంటల చొప్పున 3,500 నుండి 4,400 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న సాగు చేయవచ్చు. 5,600 నుండి 7,000 ఎకరాల్లో ఏడాదికి ఒక పంట పత్తి పండించవచ్చు. ఏడాదికి 3-4 పంటల చొప్పున బిందు సేద్యం రూపంలో 5,000 నుండి 6,000 ఎకరాల్లో ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు పండించవచ్చు. ఎల్ నినో లాంటి పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్న స్థితిలో , కొన్ని జిల్లాలకు కనీస సాగు నీరు కూడా అందని పరిస్థితులలో, నీళ్ళను వ్యవసాయానికి మళ్లించకుండా, డాటా సెంటర్ లకు ఇవ్వాలనుకోవడం అన్యాయమే .

ప్రజలు లీటర్ కిన్లే తాగునీటి బాటిల్ కొంటే రూ. 20 అవుతుంది. కానీ, ప్రభుత్వం డేటా సెంటర్లకు బల్క్ వాటర్ సరఫరా కింద 1,000 లీటర్ల నీటిని కేవలం ₹35 నుండి ₹60 లకే ఇస్తోంది. అంటే లీటర్ నీటి ధర కేవలం 3.5 పైసలు (రూపాయికి 28.5 లీటర్లు) ! ప్రజలకు మంచినీరు దొరకకపోయినా, కార్పొరేట్లకు చవకగా ఇచ్చి రాష్ట్ర బడ్జెట్ పై  భారం మోపుతున్నారు.

TSDPS, IMD అధికారిక లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం సెప్టెంబర్ 10 నాటికి 409.5 mm ఉండాలి కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 నాటికి కేవలం 323.2 mm మాత్రమే నమోదై -21 % లోటు వర్షపాతం నమోదైంది. యాచారం (42%), తలకొండపల్లి (45%), మాడ్గుల (41%), ఆమన్ గల్ (39%), కందుకూరు (38%), చౌదరిగూడ (36%), కడ్తాల్ (35%), షాద్ నగర్ (34%) మండలాల్లో 33 శాతం కంటే ఎక్కువ వర్షపాతం లోటుతో, కరువు పరిస్థితులున్నాయి.

జిల్లా లోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్, మహేశ్వరం, చేవెళ్ల, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు మండలాలు ఇప్పటికే భూగర్భ జలాలు ఇంకిపోయి డార్క్ జోన్లుగా మారాయి.

WALTA చట్టం ప్రకారం డార్క్ జోన్ మండలాల్లో వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం కొత్తగా వాణిజ్య బోర్వెల్స్ తవ్వడం, భూగర్భ జలాలు తోడటం తీవ్రమైన నేరం. ఇక్కడ 1 GW డేటా సెంటర్ రోజుకు 3.6 కోట్ల లీటర్ల నీటిని తోడితే, సమీపంలో ఉన్న 4,000 పైగా రైతుల బోరుబావులు, గ్రామాల తాగునీటి బోర్లు ఎండిపోవడం ఖాయం.

1 గిగావాట్ డేటా సెంటర్ నిరంతరం (24x7) 10,00,000 కిలోవాట్ల విద్యుత్ ను లాగుతుంది. అంటే రోజుకు 2.4 కోట్ల యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఇది 7 లక్షల నుండి 10 లక్షల గృహాలకు (3-4 జిల్లాల ఇళ్లకు) సరఫరా చేసే విద్యుత్ తో  సమానం.

ఈ విద్యుత్ కోసం రోజుకు 13,200 టన్నుల బొగ్గును మండించాలి (రోజుకు 3-4 గూడ్స్ రైళ్ల బొగ్గు). ఏడాదికి 50 లక్షల టన్నుల బొగ్గు కావాలి. దీనివల్ల రోజుకు 21,600 టన్నుల CO2 గ్రీన్ హౌజ్  వాయువులు విడుదలవుతాయి (ఏడాదికి 80 లక్షల టన్నులు).

రోజు వారీగా 170 టన్నుల సల్ఫర్ డై ఆక్సైడ్ (ఆమ్ల వర్షాలకు కారణం), 100 టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్లు (స్మాగ్/గాలి కాలుష్యం), 5,000 టన్నుల ఫ్లై యాష్ బూడిద మిగులుతాయి. ఫలితంగా మొత్తం ఆ ప్రాంత వాతావరణం కలుషితమవుతుంది.  డేటా సెంటర్లకు కరెంట్ ఇవ్వడం వల్ల స్థానిక గ్రిడ్లు దెబ్బ తిని లో-వోల్టేజ్, కరెంట్ కోతలు పెరుగుతాయి. ఈ కంపెనీలకు ఇచ్చే విద్యుత్ రాయితీలు, సబ్‌స్టేషన్ల ఖర్చుల భారాన్ని డిస్కంలు 'ఇంధన సర్దుబాటు ఛార్జీల (FSA)' పేరుతో సాధారణ ప్రజల కరెంట్ బిల్లుల్లో పెంచి వసూలు చేస్తాయి.

1 GW డేటా సెంటర్ వినియోగించే విద్యుత్లో 90 % వేడిగా మారుతుంది. ఇది ఏకకాలంలో 30 లక్షల ఎలక్ట్రిక్ హీటర్లు లేదా 8,000 భారీ బాయిలర్లు పనిచేస్తే ఎంత ఉష్ణాన్ని ఇస్తాయో అంత వేడిని (గంటకు 3.41 బిలియన్ BTU) బయటకు విడుదల చేస్తుంది. సర్వర్ల నుండి వెలువడే వేడి గాలి 40°C నుండి 55°C ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దీనివల్ల చుట్టుపక్కల 2 నుండి 5 కిలోమీటర్ల మేర 'అర్బన్ హీట్ ఐలాండ్' ఏర్పడి స్థానిక వాతావరణం మండిపోతుంది.

ఈ రకమైన వాతావరణం వల్ల0 నుండి 500 మీటర్ల పరిధిలో నిరంతరం 85 డెసిబెల్స్ శబ్దం, వేడి వల్ల  ప్రజలకు నిద్రలేమి, రక్తపోటు (BP), గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి, ఆస్తమా, చర్మ వ్యాధులు వస్తాయి. వేడి గాలుల వల్ల మట్టి తేమ ఆవిరై, పంటల ఆకులు మాడిపోతాయి; పూత, పిందె రాలి పోతాయి. తేనెటీగలు, మిత్రపురుగులు రాకపోవడం వల్ల పరాగ సంపర్కం జరగక పత్తి, కూరగాయలు, పండ్ల తోటల దిగుబడి పడిపోతుంది. వేడి (హీట్ స్ట్రెస్) వల్ల గేదెలు, ఆవుల పాల ఉత్పత్తి 20 % నుండి 40 % వరకు పడిపోతుంది. కోళ్ల ఫారాల్లో తీవ్రమైన మరణాలు సంభవిస్తాయి.

ప్రభుత్వాలు "డేటా సెంటర్ల ద్వారా 7,000 నుండి 10,000 ఉద్యోగాలు వస్తాయి" అని ప్రచారం చేస్తున్నాయి. కానీ అమెరికా డాటా సెంటర్ ల అనుభవాలు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 100 MW కి కేవలం 20 నుండి 45 శాశ్వత ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. డేటా సెంటర్ లోని ఐటీ/నెట్వర్కింగ్ పోస్టులకు అంతర్జాతీయ సర్టిఫికేషన్లు ఉన్న నిపుణులనే నియమిస్తారు. భూములు కోల్పోయిన స్థానిక గ్రామీణ యువతకు దక్కేది కేవలం ఫిజికల్ సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, క్లీనింగ్, డ్రైవర్, గార్డెనర్ వంటి అతి తక్కువ వేతనాల తాత్కాలిక/కాంట్రాక్ట్ పనులు మాత్రమే.  ప్రభుత్వం చూపే 7,000 సంఖ్యలో ఎక్కువ భాగం 18-24 నెలల నిర్మాణ దశలో వచ్చిపోయే తాత్కాలిక భవన నిర్మాణ కూలీల సంఖ్య మాత్రమే.

ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణను, డాటా సెంటర్స్ కు రైతుల  భూముల కేటాయింపును తక్షణమే రద్ధు  చేయాలి  కరువు పీడిత రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలను, తాగునీటిని డేటా సెంటర్లకు మళ్లించడాన్ని రద్దుచేయాలి. సమగ్ర సామాజిక, పర్యావరణ ప్రభావ అంచనా ( SIA / EIA) నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచి, పారదర్శకంగా ప్రజాభిప్రాయ సేకరణ  జరపాలి. డేటా సెంటర్ కోసం  నీటి వినియోగం, విద్యుత్ వినియోగం, ఈ డాటా సెంటర్స్ కు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, డాటాసెంటర్స్ లో నిజమైన శాశ్వత ఉద్యోగాల వర్గీకరణపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.  



Kanneganti. Ravi

Writer, 9912928422

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment