about - మోడీ ప్రభుత్వ E20 పెట్రోల్ మీ చెక్కర ను చేదెక్కిస్తోంది

ఉదయమే చాయ్ తాగాలంటే పాలు, చక్కర కావాలి కదా.. కానీ పెరుగుతున్న చక్కర ధరలను చూస్తుంటే తియ్యటి చాయ్ కూడా చేదుగా అనిపిస్తోందా? మన కుటుంబాలలో నిత్యావసారంగా ఉండే చక్కర ధరలు రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నా

 · 4 min read

 ఉదయమే చాయ్ తాగాలంటే పాలు, చక్కర కావాలి  కదా.. కానీ పెరుగుతున్న చక్కర ధరలను చూస్తుంటే తియ్యటి చాయ్ కూడా చేదుగా అనిపిస్తోందా? మన కుటుంబాలలో నిత్యావసారంగా ఉండే చక్కర ధరలు రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నాయి?

కేంద్ర ప్రభుత్వం 2021 లో E 20 పాలసీ క్రింద చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (EBP) ద్వారా పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతున్న పరిమాణం భారీగా పెరిగింది. ఇందుకోసం చెరకు రసం, చక్కర, చక్కర సిరప్, B- హెవీ మొలాసిస్‌ను ఇథనాల్ ఉత్పత్తి కోసం, ఇథనాల్ పరిశ్రమలకు పెద్ద ఎత్తున మళ్లించడమే మార్కెట్‌లో చక్కెర సరఫరా తగ్గడానికి, రోజు  రోజుకూ చక్కర ధరలు పెరగడానికి ప్రధాన కారణం.  బియ్యం, మొక్క జొన్న పంటలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి వాడడం వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలను మళ్ళీ ఒకసారి చర్చిద్దాం.

2023-24 సీజన్ లో సుమారు 38 నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర సామర్థ్యాన్ని (చెరకు రసం/మొలాసిస్ రూపంలో) ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించారు. దీనివల్ల దేశీయంగా చక్కెర ఉత్పత్తి 320-330 లక్షల టన్నులకు పడిపోయింది. కానీ ఆహార ద్రవ్యోల్బణ భయం ప్రభుత్వానికి కాలగడంతో, కేంద్రప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కర, చెరకు రసం వినియోగం పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.

తిరిగి 2024-25 సీజన్ లో ఎల్-నినో కారణంగా దేశమంతా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి చెరకు దిగుబడి తగ్గడంతో, ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కర, చెరకు రసం, B -హెవీ మొలాసిస్ వినియోగాన్ని 23.7 నుండి 25 లక్షల టన్నులకు పరిమితం చేసింది.

2025-26 (ప్రస్తుత సరఫరా సంవత్సరం) లో ఇథనాల్ కోసం సుమారు 31 నుండి 35 లక్షల టన్నుల చక్కెరను మళ్లించారు.  

2023 ప్రారంభంలో కేజీ చక్కెర రిటైల్ ధర 36 నుండీ 38 రూపాయలు ఉండగా, చక్కర సరఫరా కొరత, ఇథనాల్ కు చక్కర, చెరకు రసాన్ని మళ్లించిన కారణంగా బహిరంగ మార్కెట్ లో చక్కర ధర 70 రూపాయల వరకూ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్ చక్కర ధర 3,600 రూపాయల నుంచి ఏకంగా  4,800 రూపాయలకు పెరిగింది.

గతంలో చక్కెర తయారీలో చివరి దశలో వచ్చే 'C-హెవీ మొలాసిస్' నుంచి మాత్రమే ఆల్కహాల్/ఇథనాల్ తీసేవారు. కానీ ప్రభుత్వం చెరకు రసం, షుగర్ సిరప్, B-హెవీ మొలాసిస్ నుండి నేరుగా ఇథనాల్ తయారు చేయడానికి అనుమతించడంతో చక్కెరగా మారాల్సిన ముడిసరుకు నేరుగా E 20 ఇంధనంగా మారిపోయింది.

వినియోగదారుల కోసం చక్కెర అమ్మడం కంటే ఇథనాల్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అమ్మడం వల్ల చక్కెర మిల్లులకు నిధుల ప్రవాహం వేగంగా జరిగింది. దీంతో మిల్లులు చెరకు రసాన్ని భారీగా ఇథనాల్ తయారీకే ప్రాధాన్యత ఇచ్చి, మార్కెట్‌లోకి వచ్చే చక్కెర నిల్వలను తగ్గించేశాయి.

ఇదే సమయంలో వరుసగా రెండేళ్ల పాటు దేశంలో చక్కర వినియోగం కంటే (దాదాపు 28.5 మిలియన్ టన్నులు) చక్కర ఉత్పత్తి తక్కువగా నమోదయింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కర మళ్లింపు కొనసాగడంతో, మిల్లుల వద్ద మిగిలే నిల్వలు  గడచిన మూడు దశాబ్దాలలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి -  4 మిలియన్ టన్నులకు - పడిపోయాయి. ఇది మార్కెట్‌లో చక్కరకు కృత్రిమ కొరతను, ధరల పెరుగుదలకు కారణమైంది.  

ఇథనాల్ కోసం చక్కరను మళ్లించడం వల్లే దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటు తున్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, ధరలను అదుపు చేయడానికి , ఇథనాల్ ఉత్పత్తికి చక్కరను మళ్లించడం ఆపకుండా, భారత్ నుండీ ఇతర దేశాలకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. 2023 చివరిలోనూ, 2024 లోనూ చెరకు రసం నుంచి నేరుగా ఇథనాల్ తయారీపై తాత్కాలిక పరిమితులు విధించింది. ఇప్పుడు తాజాగా చక్కర దిగుమతులకు అనుమతి ఇచ్చింది. చక్కెర ఎగుమతి చేసే ఒక దేశాన్ని, దిగుమతి చేసుకోవలసిన దుస్థితికి తన ఇథనాల్ పాలసీతో కేంద్ర ప్రభుత్వం నెట్టింది.

ఇథనాల్ పాలసీ ప్రారంభ దశలో 2022-23 లో రికార్డు స్థాయిలో దేశ వ్యాపితంగా 49.05 కోట్ల టన్నుల చెరకు ఉత్పత్తి జరిగింది. ఇదే సంవత్సరం ఇథనాల్ కోసం దాదాపు  38-40 లక్షల టన్నుల చక్కెరను మళ్లించిన తర్వాత కూడా చక్కర నికర ఉత్పత్తి 328 లక్షల టన్నులుగా నిలిచింది.

కానీ 2023-24 లో ఎల్-నినో కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడడం వల్ల  చెరకు ఉత్పత్తి కూడా 45.31 కోట్ల టన్నులకు తగ్గింది. ఫలితంగా నికర చక్కెర ఉత్పత్తి 319 లక్షల టన్నులకు పడిపోయింది. 2024-25 లో మెరుగియన వాతావరణ పరిస్థితుల కారణంగా చెరకు ఉత్పత్తి 45.46 కోట్ల టన్నులుగా నమోదైంది. కానీ 2024-25 లో చెరకు ఉత్పత్తికి కీలకమైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరకు దిగుబడి నిలకడగా లేకపోవడంతో చక్కెర ఉత్పత్తి గణనీయంగా తగ్గి కేవలం 280 నుండి 295 లక్షల టన్నుల మధ్య నమోదైంది.

2021-22 లో భారత్ రికార్డు స్థాయిలో 109.8 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. కానీ 2022-23 నాటికి ప్రభుత్వం ఎగుమతులను 63 లక్షల టన్నులకు పరిమితం చేసింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగడం, నిల్వలు తగ్గడం వల్ల 2023-24, 2024-25 సీజన్లలో ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పూర్తిగా ఆంక్షలు/నిషేధం విధించింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.  

భారత్‌లో చెరకు ఆధారిత ఉత్పత్తులలో బెల్లం ఒకటి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చెరకులో దాదాపు  60-65 శాతం  చక్కెర మిల్లులకు (మాన్యుఫాక్చరింగ్) వెళ్తే, మిగిలిన 35-40% బెల్లం, ఖండ్సారీ  తయారీకి, విత్తనాలకు, నేరుగా వినియోగానికి ఉపయోగిస్తారు.

ఇథనాల్ పరిశ్రమ కారణంగా బెల్లం ధరలు కూడా పెరుగుతున్నాయి

బెల్లం ఉత్పత్తి ప్రధానంగా అసంఘటిత మరియు కుటీర పరిశ్రమ (Unorganized/Cottage Sector) పరిధిలోకి వస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ, వాణిజ్య మండళ్ల అంచనా ప్రకారం 2022-2023 లో దేశీయ బెల్లం ఉత్పత్తి 85 నుండీ 90 లక్షల టన్నులు. ఆ సమయంలో సగటు బెల్లం ధరలు 45 నుండీ 52 రూపాయల మధ్య ఉండేది. 2023-2024 లో బెల్లం ఉత్పత్తి 75-80 లక్షల టన్నులకు పడిపోయింది. ఫలితంగా బెల్లం ధరలు 55 నుండీ 65 రూపాయలకు పెరిగిపోయాయి. 2024-2025 లో బెల్లం ఉత్పత్తి 70-75 లక్షల టన్నులకు పడిపోయి, బెల్లం ధరలు  60-70 రూపాయలకు పెరిగిపోయాయి. ఈ సంవత్సర కాలంలో బెల్లం ధరలు మరింత పెరిగాయి.  




చెరకు రసాన్ని, B-హెవీ మొలాసిస్‌ను నేరుగా ఇథనాల్ తయారీకి మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో, బెల్లం తయారీ రంగానికి ఇలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యాయి. ఇథనాల్ సరఫరా ఒప్పందాల వల్ల చక్కెర మిల్లులు రైతులకు చెరకు చెల్లింపులు (FRP/SAP) వేగంగా, ఎక్కువగా చేశాయి. దీంతో రైతులు తమ చెరకును స్థానిక బెల్లం బట్టీలకు అమ్మడం కంటే మిల్లులకే ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా బెల్లం తయారీదారులకు చెరకు కొరత ఏర్పడింది.

ముడిసరుకు కొరత,చెరకు కొనుగోలు ధరలు పెరగడం వల్ల అనేక చిన్నతరహా బెల్లం తయారీ యూనిట్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకున్నాయి లేదా తాత్కాలికంగా మూతపడ్డాయి. దీనితో గడచిన మూడేళ్లలో బెల్లం ఉత్పత్తి దాదాపు 15 శాతం  నుండి 20 శాతం  తగ్గింది.

దేశీయంగా వినియోగం (గృహ అవసరాలు, ఆయుర్వేదం, స్వీట్ల తయారీ) నిలకడగా ఉన్నప్పటికీ, ఉత్పత్తి తగ్గడం వల్ల సప్లై ఛైన్ దెబ్బతింది. మూడేళ్ల క్రితం కేజీ ₹45-50 లభించిన సాధారణ బెల్లం ధర, ప్రస్తుతం మార్కెట్‌లో ₹65 నుండి ₹75 వరకు పెరిగింది.

చక్కెర మిల్లులు చెరకు కోసం ఎక్కువ ధర ఆఫర్ చేయడంతో, బెల్లం యూనిట్లు కూడా రైతులకు పోటీపడి ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చింది. ఇది బెల్లం తయారీదారుల ఉత్పత్తి వ్యయాన్ని పెంచి, వారి లాభాల శాతాన్ని తగ్గించింది. చెరకును ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా చక్కెరతో పాటు బెల్లం ఉత్పత్తి కూడా తగ్గి, మార్కెట్‌లో బెల్లం ధరలు 35-40 శాతం  వరకు పెరగడానికి దారితీసింది.

ఆహార ఉత్పత్తులను ఇథనాల్ పరిశ్రమకు మళ్లించడం ఎప్పుడైనా అనర్ధదాయకమే. ఇథనాల్ దేశ ఇంధన సమస్యలను పరిష్కరించకపోగా, దేశంలో ఆహార ఉత్పత్తుల కొరతకు కారణమవుతున్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ పాలసీని పూర్తిగా సమీక్షించాలి. ఆహార ఉత్పత్తులతో  ఇథనాల్ తయారీకి ఇచ్చిన అనుమతులను రద్ధు చేయాలి.



Kanneganti. Ravi

Writer, 9912928422

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment