about - ఫార్ర్మాసిటీ / ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ నివేదిక
2026 జులై 5న రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, తాటిపర్తి గ్రామంలో మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు (ముచ్చుంతల, మంగలగూడ తండాలతో సహా) రైతుల నుండి భూసేకరణ నేపధ్యంలో జరిగిన పోలీసుల అధిక
2026 జులై 5న రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, తాటిపర్తి గ్రామంలో మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు (ముచ్చుంతల, మంగలగూడ తండాలతో సహా) రైతుల నుండి భూసేకరణ నేపధ్యంలో జరిగిన పోలీసుల అధిక మోహరింపు, బలప్రయోగంపై ప్రజల వాదనలు వినడానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడింది. ఈ బహిరంగ విచారణకు సుమారు 600 మందికి పైగా బాధిత గ్రామాల ప్రజలు హాజరయ్యారు.
బ్రిటిష్ వలస పాలన నాటి 1894 భూసేకరణ చట్టం స్థానంలో నర్మదా బచావో ఆందోళన్, ఆదివాసీల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2013లో 'భూసేకరణ, పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ చట్టం' (LARR Act, 2013) వచ్చి ప్రజాస్వామ్య సూత్రాలను, సామాజిక సమ్మతిని, పారదర్శకతను చట్టబద్ధం చేసింది.
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగార్చగా, రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో సవరణలు తెచ్చి ప్రాజెక్టులకు మినహాయింపులు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని, రైతుల భూములు వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక పేరు మార్చి 'ఫ్యూచర్ సిటీ' పేరిట అదే బలవంతపు భూసేకరణను మరింత తీవ్రంగా కొనసాగిస్తోందని జ్యూరీ గుర్తించింది.
బాధిత గ్రామాల ప్రజల వాంగ్మూలాలు :
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద, నానక్ నగర్ తదితర గ్రామాల నుండి 25 మందికి పైగా రైతులు, కౌలుదారులు, నిరుపేద వ్యవసాయ కూలీలు తమ బాధలను జ్యూరీ ముందు వెల్లడించారు:
ప్రభుత్వాలు లేదా TSIIC/TGIIC అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వందలాది మంది పోలీసులతో వచ్చి జేసీబీలు, హిటాచీల సహాయంతో కోతకు వచ్చిన పంటలను (జొన్న, పత్తి, టమాట, వరి) ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ, భూ యజమానుల పేర్లను ఆన్లైన్ రికార్డుల నుండి తొలగించి, రికార్డులలో TGIIC అని ఎక్కిస్తున్నారు. దీనివల్ల రైతులకు ఎరువులు, యూరియా, బ్యాంక్ రుణాలు అందకుండా పోతున్నాయి.
భూములు పోవడంతో గ్రామాల్లో ఉపాధి లేక, కూలీలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తూ ఆటో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు (ఉదాహరణకు నాలుగు కుటుంబాలు గాయపడిన ఉదంతం).గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా, ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం, సర్వేలు చేస్తున్నారని స్థానిక సర్పంచ్లు (ఉదా: నీలం ఝాన్సి, నీలం శ్రీవిద్య) తెలిపారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని రద్దు చేస్తామని, కోర్టు కేసులను మాన్పిస్తామని చెప్పిన ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు (ఉదా: మల్రెడ్డి రంగారెడ్డి మొదలగువారు) ఇప్పుడు మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
3. జ్యూరీ పరిశీలనలు:
ప్రభుత్వం ఎలాంటి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) సమర్పించకుండా, గ్రామ పంచాయతీలను ధిక్కరించి, గ్రామసభలు నిర్వహించకుండా బలవంతంగా భూములు సేకరిస్తోంది.ఆన్లైన్ రికార్డులను మార్చడం, విద్యుత్ కనెక్షన్లు తొలగించడం, రాత్రికి రాత్రే జేసీబీలతో పంటలను నాశనం చేయడం వంటి తీవ్ర అణచివేత ధోరణులను జ్యూరీ తీవ్రంగా ఖండిస్తోంది.హైకోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి భూములను స్వాధీనం చేసుకోవడం కోర్టు దిక్కారణ (Contempt of Court) కిందకు వస్తుంది.భూమి లేని వ్యవసాయ కూలీలకు, ఇతర ఉపాధి కోల్పోయిన వర్గాలకు ఎలాంటి పునరావాస ప్యాకేజీలు అందకపోవడం అమానుషం.జాతీయ స్థాయిలో 2013 చట్టం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో రైతుల హక్కులను హరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
రైతుల ప్రధాన డిమాండ్లు :
- మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, ముచ్చుంతల మరియు మంగలగూడ తండాలలో భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతుల భూములన్నింటినీ భూసేకరణ నుండి పూర్తిగా మినహాయించాలి.
- భూములు ఇవ్వని రైతుల పేర్లను వెంటనే 'భూ భారతి' ఆన్లైన్ రికార్డులలో పునరుద్ధరించాలి. వారి భూములను నిషేధిత జాబితా (Section 22A) నుండి తొలగించి రిజిస్ట్రేషన్ హక్కులను పునరుద్ధరించాలి.
- కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే సేకరించిన భూములను కూడా స్వాధీనం చేసుకోకూడదు. అన్ని భారీ యంత్రాలను (జేసీబీలు, హిటాచీలు, కంటైనర్లు) గ్రామాల నుండి వెంటనే తొలగించాలి. కుర్మిద్ద పరిధిలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి.
- గ్రామాల్లోకి వచ్చి రైతులను బెదిరిస్తున్న పోలీసు, రెవెన్యూ, TGIIC సిబ్బంది ప్రవేశాన్ని నిషేధించాలి.
- నాలుగు గ్రామాల్లోని వ్యవసాయ కూలీలందరికీ తగిన నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి.
- ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఫార్మా సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక జీవో (G.O.) జారీ చేయాలి. కేవలం మౌఖిక హామీలు సరిపోవు.
- ఫార్మా సిటీ స్థానంలో ఏ కొత్త ప్రాజెక్టు లేదా కంపెనీ తెచ్చినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో గ్రామాల్లో ఉంచాలి. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, స్థానిక నివాసితుల సమ్మతి ఉంటేనే తదుపరి చర్యలు చేపట్టాలి.

Kanneganti. Ravi
Writer, 9912928422
No comments yet. Login to start a new discussion Start a new discussion