about - తెలంగాణా రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు – కారణాలు
తెలంగాణ రాష్ర్టంలో 2025 జులై 1 నుండీ ఆగస్టు 31 వరకు 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 1995 లో తెలంగాణా ప్రాంతంలో ప్రారంభమైన రైతు ఆత్మహత్యలు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు.
తెలంగాణ రాష్ర్టంలో 2025 జులై 1 నుండీ ఆగస్టు 31 వరకు 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 16 మంది కౌలు రైతులు కాగా, 16 మంది స్వంత భూమి కలిగిన రైతులున్నారు. వీరిలో 14 మంది పురుగుల మందు తాగి, 16 మంది ఉరి వేసుకుని, మరో ఐదుగురు 5 గురు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కౌలు రైతుల ఆత్మహత్యలు :
కౌలు రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ ఆత్మహత్యలకు ప్రధానంగా అరుణ భారం కారణంగా ఉన్నప్పటికీ, ఇతర కారణాలు కూడా పని చేస్తున్నాయి.
వ్యాపారి బెదిరింపులతో: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన పరమాత్ముల సమ్మయ్య (58) కొన్నేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి వేమ సురేశ్ (కౌలు భూమి) ఐదేళ్లుగా రైతు సమ్మయ్యకు వ్యవసాయ భూమిని కౌలుకు ఇప్పిస్తున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు విషాలకు తన దుకాణం నుంచి పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చిన అనంతరం లెక్కలు చూసుకునేవారు.
గత మూడేళ్లుగా పంట పెట్టుబడి డబ్బులను సమ్మయ్య వ్యాపారి సురేశ్ కు చెల్లిస్తున్నా, ఆ వ్యాపారి సరైన లెక్కలు వేయడం లేదు. ఈ ఏడాది కూడా వ్యాపారి సురేశ్ ఇప్పించిన 9 ఎకరాల పొలం లోనే రైతు సమ్మయ్య వరి సాగు చేశాడు. ఆగస్ట్ 3న ఇద్దరూ కూర్చుని పంట పెట్టుబడుల లెక్కలు చూసుకున్నారు. ఆ లెక్కల్లో వ్యాపారి సురేశ్ సమ్మయ్యకు రూ.1.4 లక్షలు ఇవ్వాల్సి ఉందని తేలింది. ఈ మేరకు సమ్మయ్య 4వ తేదీన సురేశ్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వమని కోరాడు. కాగా, లెక్కల్లోపొరపాటు జరిగిందని, సమ్మయ్యే తనకు 4,61,750 రూపా యలు ఇవ్వాలని సురేశ్ స్పష్టం చేశాడు. బాకీని 10 రోజుల్లో తీర్చాలని లేదా చావమని సదరు వ్యాపారి హెచ్చరించడంతో మనస్తాపానికి గురైన సమ్మయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణ యాప్ నిర్వాహకుల వేధింపులతో
ఖమ్మం జిల్లాకు చెందిన ముత్యాల హరీశ్ (25) వేంసూరు మండలం దుద్దెపూడిలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన యాప్ ద్వారా 5,411 రూపాయలు అప్పు తీసుకోగా, 9 వేల రూపాయలు చెల్లించాలని నిర్వాహకులు బెదిరించారు. అంతేకాక ఆయన ఫొటో లను మార్ఫింగ్ చేసి ఫోన్ కాంటాక్టుల ఆధారంగా పలువురికి పంపించడంతో మనస్తాపానికి గురై హరీష్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణ భారంతో మనస్తాపం : సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ కు చెందిన రైతు బుదారి నరేందర్ (34) తనకున్న కొద్ది భూమి తో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట ఖర్చులకు రూ.10 లక్షల నుంచి 15 లక్షల దాకా అప్పులు చేశాడు. ఇటీవల ఎనిమిది గుంటల భూమిని అమ్మినా అప్పులు తీరలేదు. కాగా, పంట చిట్టికి సుమారు రూ.60 వేల వరకు కట్టాల్సి ఉండగా ఎవరిని అడిగినా ఋణం దొరకక పోవడంతో, తీవ్ర మనస్తాపం చెందాడు. తన పొలం లోనే వేప చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.
ప్రకృతి వైపరీత్యాలకు గురై పంట నష్టంతో : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) తనకున్న ఎకరన్నర భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయా పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులతో పాటు కుటుంబ అవ సరాల కోసం కొంత అప్పు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట మొత్తం దెబ్బతింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మన స్తాపానికి గురైన లస్మన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయాడు.
దిగుబడి తగ్గింది ,అప్పులు తీరవు: యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం కంచనపల్లికి చెందిన వడ్డెబోయిన మీనయ్య (60) తనకున్న రెండు ఎకరాలతో పాటు మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పంటలో సరైన
దిగుబడి రాకపోవడం వల్ల, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పోవడంతో పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణాలు తీర్చలేననే భయంతో: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామానికి చెందిన గోల్కొండ పోచం (64) తనకున్న రెండెక రాల భూమితో పాటు మూడెకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తున్నాడు. గతేడాది సరైన దిగుబడులు రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలన్న బెంగతో పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు.
తెగుళ్ళు పంటను తినేశాయి, రైతు ప్రాణం తీశాయి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్వర్ మండలం నాచారం గ్రామానికి చెందిన బండారి దేవేందర్ (32) రెండు సంవత్సరాల క్రితం తనకున్న భూమితో పాటు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి సాగు
చేశాడు. 5 ఎకరాలలో మిర్చి సాగుచేస్తే నల్లి పురుగు వచ్చి పెట్టిన పెట్టుబడి కూడా రాక 2,50,000 రూపాయలు అప్పు మిగిలింది. మళ్ళీ గత సంవత్సరం
కూడా 5 ఎకరాల మిర్చి సాగు చేశాడు. 2,50,000 రూపాయల పెట్టుబడి పెడితే 25000 రూపాయలు మాత్రమే వచ్చాయి.
పెట్టుబడి దొరకక, ఈ సంవత్సరం కౌలు వ్యవసాయం చేయడం లేదు. కానీ అప్పులు ఇచ్చిన వారు వొత్తిడి చేయడం తో పురుగు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని పేరుమీద స్వంత భూమి లేనందున రైతు బీమా కూడా రాలేదు. వీరికి ఇల్లుకూడా లేదు గుడిసె ఉంది. ముగ్గురు పిల్లలు. అతని భార్య కూలీ పనులు చేసుకుంటున్నది.
మహబూబాబాద్ జిల్లా లో మరియు ఇతర జిల్లాలో మిర్చి సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం నల్లి వైరస్ వచ్చి మిర్చి దిగుబడులు రాక మిర్చి రైతు ఆత్మహత్యలు ఎక్కువ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతంలో పత్తి రైతు ఆత్మహత్యలు ఎక్కువ గా జరిగేవి ఇప్పుడు మిర్చి రైతు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి.
- కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటల రుణాలు అందించాలి
- పంటల బీమా లేకపోవడం వలన మిర్చి , ఇతర పంటల వలన జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటల బీమా తప్పకుండా ప్రవేశ పెట్టాలి, రైతు బీమా కౌలు రైతులకు కూడా వర్తించే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- పెట్టుబడి సాయం కౌలు రైతులకు కూడా ఇవ్వాలి.
- అప్పులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు జి. ఓ నెంబర్ 194 ప్రకారం ఎక్స్ గ్రెసియా అందించాలి.
రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబం వద్దకు మండల్ త్రీ మెన్ కమిటీ తప్పకుండా వెళ్ళాలి.
రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 35 కిలోల రేషన్ కార్డు ఇవ్వాలి .
Mukka. Ilanna
9848789346
No comments yet. Login to start a new discussion Start a new discussion