about - కౌలు రైతులను గుర్తించాలి.
తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయని నేపథ్యంలో, రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులతో, మేధావులతో విస్తృత రౌ
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు, మేధావులు; 2011 చట్టం అమలు చేసి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పథకాలు వర్తింపజేయాలని డిమాండ్; తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణ
తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయని నేపథ్యంలో, రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులతో, మేధావులతో విస్తృత రౌండ్ టేబుల్ నిర్వహించింది.
తెలంగాణలో 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు , మొత్తం అన్న దాతలలో 36 శాతం - ఉన్నారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందక అత్యంత దుస్థితిలో ఉన్న కౌలు రైతులు అప్పులలో కూరుకుపోతున్నారని, రైతు ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవేనని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సమావేశంలో పాల్గొన్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” పేరుతో ప్రజా సంఘాలు, మేధావులు కౌలు రైతుల గుర్తింపుకై పోరాటం చేస్తామని ప్రకటిస్తూ, ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. ప్రముఖ ఆర్థిక వేత్త, జయతీ ఘోష్ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ డి.నరసింహా రెడ్డి గారు దీనికి అధ్యక్షత వహిస్తారు.
2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి, గ్రామ సభల ద్వారా నిర్ధారణ చేసి గుర్తింపు కార్డులు (ఎల్.ఈ.సి.) ఇచ్చి అన్ని పథకాలకు, పంట ఋణాలకు అర్హత కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు.
కౌలు రైతులను గుర్తించి వారికి అన్ని పథకాలను అందించినప్పుడే తెలంగాణ రైతాంగం పరిస్థితి మెరుగుపడుతుందని, దీని కోసం ఉమ్మడి పోరాటం చేసి ప్రభుత్వం పై వత్తిడి తీసుకు వస్తామని ప్రకటించారు.
సమావేశంలో వివిధ జిల్లాల నుండి క్షేత్ర స్థాయి కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొని వారి సమస్యలను వివరించారు. యూరియా పంపిణీ నుంచి, వివిధ సబ్సిడీ పథకాలు, పంట నష్టపోతే నష్టపరిహారం, చివరికి పంట అమ్మకం వద్ద కూడా భూమి పట్టా పాస్ పుస్తకం, పట్టాదారు హాజరు అవసరం కావడంతో కౌలు రైతులు నష్టపోతున్న విధానాలను వివరించారు. కిసాన్ మిత్ర టీం క్షేత్రస్థాయిలో కౌలు రైతులు
ప్రభుత్వ అధికారుల నుండి, భూయజమానుల నుండి ఎదుర్కొన్న సమస్యలను నాటిక రూపంలో ప్రదర్శించారు.
సమావేశంలో పాల్గొన్న ముఖ్యులు: ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, కొండవీటి సత్యవతి (భూమిక), పి.శంకర్ (దళిత బహుజన ఫ్రంట్), ప్రొ. అరిబండి ప్రసాదరావు (తెలంగాణ రైతు సంఘం), అంబటి నాగయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక), రవిచందర్ (తెలంగాణ పీపుల్స్ JAC), మీరా సంఘమిత్ర (NAPM), ఎం. ఆంజనేయులు (సోషల్ డెమోక్రటిక్ ఫోరం), సోమిడి శ్రీనివాస్ (తెలంగాణ రైతు సంఘం), జక్కుల వెంకటయ్య (తెలంగాణ రైతాంగ సమితి), ఎం.స్వప్న (స్వర భారతి మహిళా సంఘం, యాదాద్రి జిల్లా), ఈశ్వరమ్మ (తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, మహబూబ్ నగర్ జిల్లా), ఎం. జనార్ధన్ (సంగెపు బొర్రన్న (RSV, ఆదిలాబాదు జిల్లా), లక్ష్మి (RSV, సంగారెడ్డి జిల్లా), చుక్కమ్మ (DDS మహిళా రైతుల సంఘం, జహీరాబాద్), శివాజీ (పర్యావరణవేత్త), సదానందం (RSV, కరీంనగర్ జిల్లా).
రైతు స్వరాజ్య వేదిక తరఫున: బి. కొండల్ సమావేశాన్ని నిర్వహించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గం తరఫున కన్నెగంటి రవి, ఎస్.ఆశాలత, విస్సా కిరణ్ కుమార్, శ్రీ హర్ష మాట్లాడారు.
డిమాండ్లు:
- తక్షణం 2026 మే నెల నుండి 2011 చట్టం అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
- 2011 చట్టం అమలు గురించి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసి, కౌలు రైతులను ప్రోత్సాహించాలి. భూ యజమానులకు వారి భూమి హక్కులకు ఎటువంటి సమస్య రాదని రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించాలి.
- గుర్తింపు కార్డు ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలు వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు అందించాలి.
- బ్యాంకర్ల కమిటీ ద్వారా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి ఎల్.ఈ.సి. కార్డు ఆధారంగా పంట రుణాలు ఇచ్చేలా చూడాలి.
- ప్రస్తుత రబీ సీజన్లో పంట అమ్ముకోజూస్తున్న కౌలు రైతులని స్థానిక అధికారులు ధృవీకరించి వాళ్ళ అకౌంటులో డబ్బులు పడే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలి.
ఉమ్మడి కార్యాచరణ: గ్రామ స్థాయిలో కౌలు రైతులతో సమావేశాలు, కౌలు రైతుల సమస్యల పై సర్వే చేయడం, కౌలు రైతులను విస్తృతంగా గ్రూపులుగా జోడించడం, జిల్లా స్థాయిలో సాధన కమిటీ తరఫున సమావేశాలు, మీడియా చర్చలు, రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు.
Kanneganti. Ravi
Writer, 9912928422
No comments yet. Login to start a new discussion Start a new discussion