about - కాలిపోయిన ట్రాన్స్ఫర్మర్ - కిసాన్ మిత్ర సహకారంతో సమస్య పరిష్కారం

కాలిపోయిన ట్రాన్స్ఫర్మర్ - కిసాన్ మిత్ర సహకారం

 · 1 min read

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామం నుండి ఒక విఫలమైన ట్రాన్స్ఫార్మర్ గురించి కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందింది.  ట్రాన్స్ఫార్మర్ నెలరోజుల క్రితమే కాలిపోయింది.రైతులు పదే పదే లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజినీర్ (AE) గారిని సంప్రదించినా ఎటువంటి స్పందన లేకపోవడంతో, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ట్రాన్స్ఫార్మర్ పై బీమన వేణి సంబశివ్, కర్ణివార్ గోపాల్, భీమన వేణి దత్తు, జక్కుల మల్లేష్, జక్కుల ఆడేళ్ళు రైతులు తమ పొలాల సాగు కోసం ఆధారపడుతున్నారు.  

.


వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. రైతుల కథనం ప్రకారం, AE గారు “మీరే ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లండి” అని చెప్పారని తెలిపారు. ఇది న్యాయ సమ్మతమైన సూచన కాకపోయినా, వారు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరంఅదే గద్దె మీద ఉన్న మరో ట్రాన్స్ఫార్మర్ కూడా కాలి పోయినప్పటికీ, అది వేరే రైతులది  కావడం వల్ల అధికారుల స్పందన తక్షణమే వచ్చింది. విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి తిరిగి అమర్చారు. కానీ ఈ  కేసులో మాత్రం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించింది.

పరిస్థితిని తెలుసుకున్న కిసాన్ మిత్ర ప్రతినిధి తంతోలి గ్రామానికి వెళ్లి రైతుల నుండి పూర్తి వివరాలు సేకరించారు. అక్కడినుండే లైన్ మెన్‌కు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. వెంటనే AE గారికి  ఫోన్ చేసి సమస్యను వివరించారు. రైతుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించి రైతులు ట్రాన్స్ఫార్మర్ ఎలా తీసుకెళతారు? అధికారులే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

AE  ఆ సమయంలో తాను  మీటింగ్‌లో ఉన్నానని, సమావేశం ముగిసిన తర్వాత డిపార్ట్‌మెంట్ సిబ్బందిని పంపించి ట్రాన్స్ఫార్మర్ తీసుకురమ్మని చెప్పుతానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే  రంగంలోకి దిగారు. ట్రాన్స్ఫార్మర్‌ను తీసుకెళ్లి మరమ్మతులు చేసి తిరిగి అక్కడే అమర్చారు.

ఈ చర్యతో రైతులు ఎంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం పదిరోజులు కాదు,  నెల రోజులుగా సాగు నిలిచి పోయిన పరిస్థితి నుంచి బయటపడటం వారికి పెద్ద రిలీఫ్‌గా నిలిచింది. పంటకు కొంత నష్టాలు వాటిల్లినప్పటికీ,  విద్యుత్ పునరుద్ధరణ జరగడం వల్ల మిగతా పంటను రక్షించ గలిగారు. తమ సమస్యను వినిపించి పరిష్కారం కోసం కృషి చేసిన కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



A. Rakesh

Kisan Mitra Adilabad Filed Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment