about - ఇందిరమ్మ జీవిత బీమాను జూన్ 2 నుండీ అమలు చేయాలి.

తెలంగాణ లో 2018 నుండీ అమలులోకి వచ్చిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ఒక భరోసాను ఇచ్చింది. ఇది కేవలం స్వంత సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే అమలయినా, ఈ పథకం ఉండడం వల్ల సన్న, చిన్నకారు , మధ్యతరగతి రైతులు

 · 3 min read

ఇందిరమ్మ జీవిత బీమాను జూన్ 2 నుండీ అమలు చేయాలి.

 తెలంగాణ లో 2018 నుండీ అమలులోకి వచ్చిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ఒక భరోసాను ఇచ్చింది. ఇది కేవలం స్వంత సాగు భూమి ఉన్న రైతులకు మాత్రమే  అమలయినా, ఈ పథకం ఉండడం  వల్ల సన్న, చిన్నకారు , మధ్యతరగతి రైతులు  ఎవరైనా 18 నుండీ 59 సంవత్సరాల మధ్య వయస్సులో అకాలంగా మరణించినప్పుడు ఈ పథకం ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంది.

KCR ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ పథకంలో ఉన్న ప్రధాన బలహీనత, ఈ పథకం స్వంత భూమి లేని కౌలు , పోడు, మహిళా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అలాగే గ్రామీణ వ్యవసాయ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషించే వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఈ పథకం ఉపయోగపడలేదు. ఈ విషయం లో రైతు స్వరాజ్య వేదిక, ఇతర రైతు, వ్యవసాయ కూలీ, దళిత బహుజన సంఘాలు ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళినా, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా విస్తరిస్తామని తన ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చింది. కానీ గత రెండేళ్లలో అమలు చేయలేదు. ఫలితంగా, భూమి లేని కౌలు రైతు కుటుంబాలకు, ఆదివాసీ పోడు రైతు  కుటుంబాలకు , వ్యవసాయ కూలీ కుటుంబాలకు మేలు జరగలేదు.  

ఈ లోపు ప్రభుత్వం 2026 బడ్జెట్ లో తాము రాష్ట్రంలో ఉన్న అన్ని పేద కుటుంబాలు కవర్ అయ్యేలా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించింది. రాష్టంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికీ ఈ పథకం అమలవుతుందని, రేషన్ కార్డులో కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి పేరుతో జీవిత బీమా ఉంటుందని కూడా ప్రకటించింది. కానీ ఆ పథకం అమలులోకి ఇప్పటి వరకూ రాలేదు. విధి విధానాలు కూడా ఫైనల్ చేయలేదు.

ఈ లోపు రైతు బీమా పథకం ఆగస్ట్ 14 నుండీ ఆగిపోయింది. కాబట్టి ఆగస్ట్ 15 నుండీ మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం క్రింద పరిహారం రాదు. ఇది ఆయా కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం.

నిజానికి  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 2023 డిసెంబర్ 7 నుండీ మరణించిన భూమి లేని కౌలు, వ్యవసాయ కూలీ కుటుంబాల సభ్యులకు  ( రేషన్ కార్డు ఆధారంగా)  రైతు భరోసా పరిహారం చెల్లించాలి.

అలాగే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని 2026 జూన్ 2 నుండీ అమలు చేస్తామని, ముఖ్యమంత్రి ప్రకటనలో,  బడ్జెట్ ప్రసంగంలో  చెప్పినందున, ఆ రోజు నుండీ రేషన్ కార్డు కలిగి ఉండి, మరణించిన అన్ని కుటుంబాలకు  ఈ పథకాన్ని అమలు చేయాలి. ఆ ప్రత్యేక సంవత్సరంలో,  కేవలం ‘రేషన్ కార్డు యజమాని’ అని కాకుండా, ఆయా కుటుంబాలలో 18 సంవత్సరాలు నిండిన ఎవరు మరణించినా, వారికి జీవిత బీమా పథకం అమలయ్యేలా నిబంధనలను  రూపొందించాలి. ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న ప్రభుత్వానికి  పేద కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టడం కనీస బాధ్యత .

రాష్ట్రంలో ఇందిరమ్మ పెన్షన్ పథకం క్రింద, అర్హులైన అందరికీ కొత్తగా ఆసరా పెన్షన్ లు ఇవ్వడానికి వీలుగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ అత్యంత ఇబ్బందులలో ఉన్న వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఇది వారికి అన్యాయం చేయడమే. అర్హులైన వృద్ధులందరికీ ( కుటుంబంలో ఎందరు ఉన్నా) ఆసరా పెన్షన్ అందించడానికి వీలుగా వృద్ధుల  నుండీ కూడా దరఖాస్తులను తీసుకోవాలి. ఇందిరమ్మ ఆసరా పెన్షన్  దరఖాస్తులు తీసుకునే గడువును 2026 సెప్టెంబర్ చివరి వరకూ పెంచాలి. పెన్షన్ కు అర్హులైన అందరికీ, జీవో, మార్గదర్శకాల ప్రకారం వారు అర్హత పొందిన తేదీ నుండీ ఆయా వ్యక్తులకు, ఇందిరమ్మ పెన్షన్ అందించాలి.

రాష్ట్ర ప్రభుత్వం, తనకు తోచినప్పుడు దరఖాస్తులు తీసుకునే పద్ధతి కాకుండా, అర్హత పొందిన వారు ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో, పట్టణాలు, నగరాల  బస్తీ స్థాయిలో   దరఖాస్తు మీ సేవా కేంద్రంలో పెట్టుకునేలా అవకాశం కల్పించాలి. దరఖాస్తు పై వేగంగా విచారణ పూర్తి చేసి, దరఖాస్తు అందుకున్న మరుసటి నెల నుండీ పెన్షన్  అందించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగా , పెన్షన్ మొత్తాన్ని 4016 రూపాయలకు పెంచి అమలు చేయాలి.

రైతు భరోసా పథకాన్ని అప్పుడప్పుడూ అయినా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడం లేదు. ఈ పథకం క్రింద కేవలం ఒక్కసారి మాత్రమే 85,000 మందికి మాత్రమే కేవలం 6,000 రూపాయల చొప్పున చెల్లించారు. నిజానికి ఈ పథకం క్రింద సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లించాలి. అలాగే ఈ పథకం క్రింద అర్హత పొందడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో 20 రోజులు పని చేసి ఉండాలనే నిబంధన పెట్టడం వల్ల, చాలా మంది  అర్థత పొందలేక పోయారు. ఈ నిబంధనను సవరించాలి. వెంటనే ఇందిరమ్మ ఆత్మీయ  భరోసా పథకాన్ని కూడా ఎకరం లోపు రైతులకు కూడా కనీసం 12,000 చెల్లించాలి.

కార్పొరేట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే ప్రాజెక్టులకు కాకుండా, పేదలకు లబ్ధి చేకూరే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం  బడ్జెట్లో  నిధులు కేటాయించడం, వాటిని వేగంగా విడుదల చేయడం జరగాలి. అప్పుడే పేద కుటుంబాలకు భరోసా అందుతుంది.



Kanneganti. Ravi

Writer, 9912928422

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment