about - ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలి

జి ఓ నెంబర్ 194 ప్రకారం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం , ఆ కుటుంబం ఒకే విడత లో అప్పులు చెల్లించుకోవడానికి మరో లక్ష రూపాయలు ఇస్తారు. రైతు కుటుంబాన్ని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టక

 · 3 min read

రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో జీఓ నెంబర్ 194 ఉనికి లో ఉంది. కానీ ఈ జీవో అమలు పట్ల  రాష్ట్ర ప్రభుత్వం చాలా  నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నది. గత BRS ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించి ఆయా కుటుంబాలకు అన్యాయం చేసింది.

ఈ జీవో ప్రకారం, రాష్టంలో ఒక రైతు ఆత్మహత్య జరిగితే, బాధిత కుటుంబం వద్దకు మండల్ స్థాయి త్రిసభ్య  కమిటీ ( మండల తాసిల్దార్, మండల వ్యవసాయ అదికారి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ )  వెళ్ళి  రైతు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుని,  డివిజన్ స్థాయి  త్రిసభ్యకమిటీకి ( ఆర్ డి . ఓ ,  ఏ డి ఏ , డి యస్ పి ) నివేదిక  ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రిసభ్య కమిటీ చర్చించి, జిలా కలెక్టర్ కు తమ నివేదిక పంపుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండీ, బాధిత కుటుంబానికి పరిహారం అందించడానికి ఆమోదిస్తూ, ప్రొసీడింగ్స్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుండీ నిధులు తెప్పించి, బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తారు.

కానీ  ఈ పక్రియ రాష్ట్రంలో  ఎక్కడా అమలు కావడం లేదు. 2018 సంవత్సరంలో రైతు బీమా పథకం అమలు లోకి వచ్చిన తరువాత ఈ జీ ఓ ను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు.

జి ఓ  నెంబర్ 194ప్రకారం  రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం , ఆ కుటుంబం ఒకే విడత లో అప్పులు చెల్లించుకోవడానికి  మరో లక్ష రూపాయలు ఇస్తారు.  రైతు కుటుంబాన్ని అప్పుల వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మండల స్థాయి త్రిసభ్య కమిటీ  పర్య వేక్షించాలని జీవో చెపుతుంది.

కాని మన రాష్ట్రంలో  రైతు బీమా నే ఎక్స్ గ్రేషియా  లాగా  అధికారులు భావిస్తున్నారు. ఒక రైతుకు భూమి పట్టా పాస్ పుస్తకం ఉండి , 18 సంవత్సరముల నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బీమా వర్తిస్తుంది. భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతు ఏ కారణం చేత చనిపోయినా ఈ పథకం పరిధిలోకి వస్తే, ఆ కుటుంబానికి  బీమా వస్తుంది.  ఇది రైతులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం.

కానీ, వ్యవసాయంలో అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవడానికి  వచ్చిన ఈ జి ఓ 194 ప్రకారం తప్పకుండా ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రెండు వేరు వేరు పథకాలు.

వ్యవసాయం చేస్తున్న వారిలో అనేక  మంది రైతులకు భూమి వారి పేరున  పట్టా లేక పోవడం, వారి తండ్రి , తాతల పేర్ల మీద ఉండడం, లేదా రెవెన్యూ  సమస్యల వలన పట్టా కాకపోవడం తదితర కారణాల వలన వాళ్ళు రైతు బీమా పథకం పరిధిలోకి రావడం లేదు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిగురు స్వామి అనే రైతు  2024 ఫిబ్రవరి 26 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి స్వంత భూమి ఉంది. పట్టా పాస్ బుక్ ఉంది. ధరణి పోర్టల్ లో ఈ భూమి వివరాలు కనిపించడం లేదనే కారణంగా  రైతు బీమా రాకుండా పోయింది. రైతు ఆత్మహత్య జీవో ప్రకారం ఎక్స్ గ్రేషియా కూడా రాలేదు.

హిమ్మత్ నగర్ గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లాకు చెందిన మ్యాక శ్రీనివాస్   తనకున్న కొద్ది పాటి భూమితో పాటు కౌలు వ్యవసాయం చేశాడు. 22 డిసెంబర్ 2023 న  అప్పుల బాధతో  పురుగుల విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కున్న స్వంత భూమి తన తండ్రి పేర పట్టా ఉన్నందున ఇతనికి రైతు బీమా కూడా రాలేదు, భూమి తన పేరు మీద లేదు కాబట్టి,కౌలు రైతును గుర్తించక పోవడం వల్ల, జీవో ప్రకారం ఎక్స్ గ్రేషియా  కూడా రాలేదు.

జనగాం జిల్లా, పాలకుర్తి మండలం, వల్మీడి గ్రామానికి చెందిన రైతు పిట్టల లక్ష్మయ్య 12 జులై 2024 న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కొద్ది పాటి భూమి ఉంది కానీ  పట్టా లేక పోవడం వలన రైతు బీమా రాలేదు. జీవో 194 ప్రకారం ఎక్స్ గ్రేషియా  కోసం దరఖాస్తు స్తానిక తాసిల్దార్ కార్యాలయం లో పెట్టుకుంటే,ఈ జీవో  లేదు అని చెప్పి అధికారులు అతని కొడుకును  అవమానించి వెళ్ళగొట్టారు. 20 జనవరి 2025 న జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణకు రావడం లేదు అని పదే పదే తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. మండల రెవెన్యూ అధికారులు  మీ కాగితాలు తీసుకొని రమ్మని చెప్పి తీసుకొన్నారు.  జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామని కూడా చెప్పి పంపించారు.  ఆరు నెలల తరువాత మళ్ళీ తహశీల్దార్ కార్యాలయం వారిని అడిగితే కలెక్టర్ కు పంపాము, మా చేతుల్లో ఏమి లేదని సమాధానం చెప్పారు.

చివరికి  లక్ష్మయ్య కొడుకు సమాచార హక్కు చట్టం కింద జిల్లా కలెక్టర్ ఆఫీసు వారిని తన దరఖాస్తు స్టేటస్ గురించి అడిగాడు. లక్ష్మయ్య వ్యవసాయం చేసినప్పుడు పిండి బస్టాల రసీదులు లేవు కాబట్టి ఇది రైతు ఆత్మహత్య కిందికి రాదు అని  ఆ కుటుంబ దరఖాస్తును    రిజెక్ట్ చేశారు. ఈ రిజక్ట్ చేసిన విషయం ఆర్ టి ఐ ద్వారా మాత్రమే తెలిసింది.  జీవో  194 ప్రకారం రైతు  కుటుంబం వద్దకు వెళ్ళకుండానే మండల త్రిసభ్య కమిటీ రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని బేస్ చేసుకొని డివిజన్ స్థాయిలో త్రిసభ్య కమిటీ రిపోర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించారు. ఇది ఈ జీవో కు  పట్టిన గతి అని చెప్పవచ్చు.

ఇక కౌలు రైతుల పరిస్తితి చెప్పవలసిన అవసరం లేదు.  గత ప్రభుత్వంలో కౌలు రైతులు  గుర్తింపుకు నోచుకోలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్తితి కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం , పాలవరం గ్రామానికి చెందిన కడారి వెంకటేశ్వర్ రావు 25 మే 2017 న వ్యవసాయ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకూ అధికారులు ఆ కుటుంబం దగ్గరకు  వెళ్ళ లేదు. ఈ కుటుంబ సభ్యులు  27 అక్టోబర్ 2025 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టడానికి వెళితే ఈ జీవో నే లేదు అని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు.

చివరికి “ఈ జీవో అమలులో లేదు అని రాసి ఇవ్వండి” అంటే, అప్పుడు దరఖాస్తు తీసుకున్నారు. ఈ దరఖాస్తును ఎవరికి పంపాలి అనే అవగాహన కూడా అధికారులకు లేదు. సూర్యాపేట జిల్లాలో దాదాపు 10  రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల సభ్యులు దరఖాస్తులు  పెట్టుకున్నప్పటికీ  ఇప్పటికీజీవో లో చెప్పిన పద్దతి ప్రకారం విచారణ జరగడం లేదు. ఇప్పటి కైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులకు  శిక్షణ ఇచ్చి 2014 నుండి 2025 నవంబర్  వరకు జరిగిన అన్ని కౌలు రైతుల, రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి  జీఓ 194 ను అమలు చేయాలి .


MI
Mukka. Ilanna

9848789346

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment