about - ఆగిపోయిన పెన్షన్ కిసాన్ మిత్రా సహకారంతో మళ్ళీ ప్రారంభమైంది

జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం (DRDO)లో సంబంధిత సెక్షన్ అధికారులను కలిసి సమస్యను వివరించాము. వారు వయస్సుకు సంబంధించిన ఆధారాలు అడగడంతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీతో పాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించామ

 · 2 min read

ఆత్రం బీంరావు , కొత్త గూడ గ్రామం, యశ్వంత్ గూడ గ్రామపంచాయతీ, ఆదిలాబాద్ రూరల్ మండలం/  జిల్లాకు చెందినవారు.

అదిలాబాద్ జిల్లాలో జరిగిన పైలెట్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మా కిసాన్ మిత్ర బృందం వారి గ్రామాన్ని సందర్శించినప్పుడు, ఆయన  తన సమస్యనుమాకు  వివరించారు. గతంలో తనకు రూ. 500 సామాజిక పెన్షన్ వచ్చేదని, అయితే అది అకస్మాత్తుగా నిలిచిపోయిందని చెప్పారు. అప్పటి నుండి ఎన్నిసార్లు సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా తన సమస్యకు పరిష్కారం కాలేదని వాపోయారు.

వెంటనే కిసాన్ మిత్ర హెల్ప్ లైన్‌ లో కేసు నమోదు చేసి, పైలెట్ ప్రజావాణి లో కూడా గ్రీవెన్స్ నమోదు చేశాము. పబ్లిక్ హియరింగ్ రోజున ఆత్రం బీంరావు గారిని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లాము. అక్కడ అధికారులు "మీకు వయస్సు అర్హత లేదు" అని తెలిపారు. దీనిపై ఎంపీడీఓ గారితో మాట్లాడగా, వారి లాగిన్‌లో సమగ్ర కుటుంబ సర్వే  డేటా ప్రకారం వయస్సు 65 సంవత్సరాల కంటే తక్కువగా నమోదవడంతో పెన్షన్ తిరస్కరించబడింది అని చూపించారు. "మేము ప్రస్తుతం  ఏమీ చేయలేం" అని సమాధానమిచ్చారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయం (DRDO)లో సంబంధిత సెక్షన్ అధికారులను కలిసి సమస్యను వివరించాము. వారు వయస్సుకు సంబంధించిన ఆధారాలు అడగడంతో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీతో పాటు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాము. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ముఖ్యమంత్రి ప్రజావాణి లో కూడా  మరోసారి గ్రీవెన్స్ నమోదు చేశాము. అక్కడి నుంచి ఫోన్ రావడంతో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసి, అవసరమైన ఆధారాలను కూడా అందించాము.

కొద్ది రోజుల తరువాత ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించగా, పంచాయతీ కార్యదర్శి ద్వారా ఎంక్వైరీ నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విచారణ పూర్తి చేసి నివేదికను ఎంపీడీఓ కార్యాలయానికి సమర్పించారు. అయితే ఈలోపు అప్పటి ఎంపీడీఓ బదిలీ కావడంతో ఫైల్ ముందుకు వెళ్లలేదు. తరువాత మళ్లీ ఎంపీడీఓ తరువాత మళ్లీ   ఎంపీడీఓ   కార్యాలయాన్ని సంప్రదించగా,  "ఎంక్వైరీ  రిపోర్ట్  మాకు  అందలేదు" అని  చెప్పారు.

వెంటనే పంచాయతీ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడించగా, తాను ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ రిపోర్ట్ అందుబాటులో లేదని చెప్పడంతో మరోసారి కొత్తగా ఎంక్వైరీ నిర్వహించాల్సి వచ్చింది.

రెండోసారి ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నివేదిక ఎంపీడీఓ లాగిన్ ద్వారా DRDO కార్యాలయానికి వెళ్ళి అడిగితే డాక్యుమెంట్లు కాదు వ్యక్తిని చూస్తేనే నమ్ముతాము అని చెప్పారు. అప్పుడు ఈ వ్యక్తిని DRDO ఆఫీస్ కి తీసుకెళ్ళాను. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా మళ్ళీ వెళ్ళాం. అన్ని దశలు పూర్తైన అనంతరం, 2025  డిసెంబర్ నెలలో ఆత్రం బీంరావు గారికి మళ్లీ సామాజిక పెన్షన్ మంజూరైంది.

ఒక చిన్న సమస్య పరిష్కారం కోసం నెలల తరబడి అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చినప్పటికీ, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నిరంతరం ఫాలోఅప్ చేస్తూ ప్రతి స్థాయిలో అధికారులతో సమన్వయం చేయడం వల్ల చివరకు 13 సంవత్సరాల తరువాత ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

“ప్రజల సమస్యలను నమోదు చేయడం మాత్రమే కాదు, పరిష్కారం అయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయడమే కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రత్యేకత”.



A. Rakesh

Kisan Mitra Adilabad Filed Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment