about - 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యకు కిసాన్ మిత్ర కృషితో పరిష్కారం

సమస్య పరిష్కారం కోసం రైతు నాగయ్య పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, రైతు స్వయంగా రెండు విద్యుత్ స్తంభాలు, అవసరమైన వైర్‌ను కొనుగోలు చేసి శాఖ అధికారులను సంప

 · 2 min read

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం మేకవనంపల్లి గ్రామానికి చెందిన రైతు కోటపల్లి నాగయ్య తన పొలంలో ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యను సుమారు ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటున్నారు. పొలంలోని విద్యుత్ స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తీగలు కిందికి వేలాడుతూ ఉండేవి. దీంతో పొలంలో వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో రైతులు చేతులు పైకి ఎత్తడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది.ఈ సమస్య వల్ల రైతులు, వ్యవసాయ కూలీల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటమే కాకుండా, గతంలో విద్యుత్ తీగల కారణంగా ఒక మేక మృతి చెందిన ఘటన కూడా చోటుచేసుకుంది.

రైతు చేసిన ప్రయత్నాలు

సమస్య పరిష్కారం కోసం రైతు నాగయ్య పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, రైతు స్వయంగా రెండు విద్యుత్ స్తంభాలు, అవసరమైన వైర్‌ను కొనుగోలు చేసి శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

కిసాన్ మిత్ర జోక్యం, నిరంతర ఫాలోఅప్

2020లో, కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ రైతు పొలాన్ని సందర్శించి, కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల వల్ల ఉన్న ప్రమాదకర పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత AEతో సమస్యపై చర్చించి, పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.2021లో కూడా కిసాన్ మిత్ర బృందం విద్యుత్ శాఖ అధికారులతో సమస్యను ప్రస్తావించి, అదనపు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరింది. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

2025లోకిసాన్ మిత్ర బృందం ఈ సమస్యనుజిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. విద్యుత్ సమస్యల జాబితాలో రైతు సమస్యను చేర్చి తదుపరి చర్యల కోసం సమర్పించింది.2026లో కూడా కిసాన్ మిత్ర బృందం స్థానిక విద్యుత్ శాఖ అధికారులతో పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదిస్తూ, క్షేత్రస్థాయిలో రైతును కలిసి సమస్యను పరిశీలిస్తూ నిరంతరం ఫాలోఅప్ చేసింది. అనంతరం మోమిన్‌పేట్ AEకి వినతిపత్రం అందజేసి సమస్య ఎన్ని ఏళ్లుగా పెండింగ్ లో ఉందో వివరించింది. ప్రజావాణి ద్వారా ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో 22-06-2026న జిల్లా ప్రజావాణిలో కిసాన్ మిత్ర బృందం ఫిర్యాదు సమర్పించింది. కలెక్టర్ కూడా సమస్యను విని , దాని తీవ్రతను అర్ధం చేసుకొని, సమస్యకు సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ సమస్య పూర్తి వివరాలను ADE సావిత్రి గారికి అందజేసి, రైతు ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరింది.ప్రజావాణి అనంతరం కూడా కిసాన్ మిత్ర బృందం విద్యుత్ శాఖ అధికారులతో నిరంతరం ఫాలోఅప్ కొనసాగించింది.

చివరకు సమస్య పరిష్కారం

తాజాగా ADE సావిత్రి గారితో కిసాన్ మిత్ర బృందం ఫోన్ ద్వారా సంప్రదించగా, సమస్య పరిష్కరించినట్లు తెలిపారు.అనంతరం రైతు కోటపల్లి నాగయ్యతో మాట్లాడగా, విద్యుత్ శాఖ సిబ్బంది పొలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి, వేలాడుతున్న విద్యుత్ తీగలకు సరైన మద్దతు కల్పించేందుకు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, తీగలను సరిచేసినట్లు తెలిపారు.దీంతో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ప్రమాదకర విద్యుత్ తీగల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.  రైతు ఇన్ని ఏళ్లు గా అలాగే ఉన్న సమస్య పరిష్కారం అవడంతో సంతోషం వ్యక్తం చేశారు.

కిసాన్ మిత్ర కృషి ఫలితం

ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను కేవలం నమోదు చేయడం వద్ద ఆపకుండా, క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులతో సమన్వయం, నిరంతర ఫాలోఅప్, జిల్లా ప్రజావాణిద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి చర్యల ద్వారా కిసాన్ మిత్ర బృందం చివరకు పరిష్కారం సాధించింది.కిసాన్ మిత్ర రైతుల సమస్యలను కేవలం నమోదు చేయడం మాత్రమే కాదు — పరిష్కారం లభించే వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తుంది.




AU
Anthoti. Umadevi

KisanMitra, Councellor 9297001419

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment