about - కిసాన్ మిత్ర చొరవతో రైతు పొలానికి దారి సమస్య పరిష్కారం

కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ సహాయంతో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, హెల్ప్‌లైన్‌కు కూడా సమాచారం అందించారు. పంట చేతికి వచ్చే సమయంలో నీటి సమస్యతో పాటు పొలానికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో

 · 1 min read

అనంతపురం జిల్లా గార్ల దిన్నె మండలం, ఎర్రగుంట్ల గ్రామానికి  వై. అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూమికి వెళ్లే దారి విషయంలో కొంత కాలంగా సమస్య ఎదురవుతోంది. సర్వే నంబర్ 394/2 లోని భూమిని కుటుంబ సభ్యుల మధ్య విభజించుకున్నారు. తన వాటాగా వచ్చిన భూమిలో రైతు పంట సాగు చేస్తున్నప్పటికీ, పొలానికి వెళ్లే దారి విషయంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవడంతో పంటను సంరక్షించుకోవడం కష్టంగా మారింది.

ఈ సమస్యపై గతంలో కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ సహాయంతో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, హెల్ప్‌లైన్‌కు కూడా సమాచారం అందించారు. పంట చేతికి వచ్చే సమయంలో నీటి సమస్యతో పాటు పొలానికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో రైతు పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గార్ల దిన్నె తహసీల్దార్‌ వద్ద కూడా గ్రీవెన్స్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం లభించలేదు.

సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కిసాన్ మిత్ర టీం జిల్లా సర్వే అధికారుల సహకారంతో శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూమి కొలతలు చేయించారు. అనంతరం గార్ల దిన్నె తహసీల్దార్ కార్యాలయానికి ఎండార్స్‌మెంట్ లేఖ కోసం పంపించగా, రైతు పొలంలోనే దారికి స్థలం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తూ లేఖ జారీ చేశారు. దీంతో రైతుకు కొంత ఊరట లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో దారి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

తాజాగా దారి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో రైతుతో పాటుగా వేచి ఉన్నప్పటికీ సంబంధిత అధికారి నుంచి స్పందన రాలేదు.

ఈ విషయాన్ని కిసాన్‌మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ నరసింహ నాయక్ గుర్తించి, జిల్లా ఎస్పీ కార్యాలయంతో మాట్లాడి, రైతు ఎదుర్కొంటున్న దారి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా సమన్వయం చేశారు.

అనంతరం అధికారుల సూచనల మేరకు హెడ్ కానిస్టేబుల్ గ్రామ సచివాలయ సర్వేయర్‌ను వెంట తీసుకుని క్షేత్రస్థాయికి వెళ్లి భూమిని పరిశీలించి, దారి సమస్యను పరిష్కరించారు. దీంతో రైతు తన పొలానికి వెళ్లేందుకు ఉన్న దారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.



NN
Narsimhulu Naik

Narsimhulu Naik Mob: 7013065538 Field Coordinator, Anantapuram

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment