about - భారత్‌ E20 విధానాన్ని దాటి ఏముంది?

అమెరికా ఇరాన్‌పై ఏకపక్షంగా చేపట్టిన దాడి కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, దానికి ప్రతిస్పందనగా హోర్ముజ్‌ జలసంధి మూసివేయబడటం వల్ల ఈ ఏడాది E20 వినియోగాన్ని మరింత విస్తరించారు.

 · 4 min read

ఒక లీటర్‌ E 20 పెట్రోల్‌ లో 80 % మోటార్‌ గ్యాసోలిన్‌, 20 % నీరులేని (anhydrous) ఇథనాల్‌ ఉంటుంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం, భారత్‌లో E 20 పెట్రోల్‌ను తొలిసారిగా 2023 ఫిబ్రవరి 6న ప్రవేశపెట్టారు. ఆ రోజు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్‌ బంకుల్లో దీనిని విక్రయించడం ప్రారంభించాయి.

E 20 హామీ

అమెరికా ఇరాన్‌పై ఏకపక్షంగా చేపట్టిన దాడి కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, దానికి ప్రతిస్పందనగా హోర్ముజ్‌ జలసంధి మూసివేయబడటం వల్ల ఈ ఏడాది E20 వినియోగాన్ని మరింత విస్తరించారు.

E20 మిశ్రమానికి అనుకూలంగా ప్రభుత్వం ప్రధానంగా మూడు వాదనలు చేస్తోంది:

  1. వినియోగదారులకు ఖర్చు తగ్గుతుంది;
  2. కార్బన్‌ ఉద్గారాలు తగ్గుతాయి;
  3. విదేశీ మారకద్రవ్యం  ఆదా అవుతుంది.

అయితే E 20 మిశ్రమం వల్ల వాహనాల మైలేజీ తగ్గితే, ఈ వాదనలన్నీ నిలబడకపోవచ్చు.

మైలేజీ తగ్గుదల వాస్తవమేనని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో అంగీకరించారు. వాహనం రకం, తయారీ సంవత్సరం (vintage) ఆధారంగా E 20 వల్ల ఇంధన సామర్థ్యం 2% నుంచి 6% వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. దీనికి ARAI–SIAM–IOCL సంయుక్త అధ్యయనాన్ని ఆధారంగా చూపించారు.

ముఖ్యంగా 2022 లేదా అంతకంటే ముందు తయారైన కార్లను ఉపయోగించే అనేక మంది వినియోగదారుల నుంచి E 20 వల్ల మైలేజీ తగ్గిందని, కొన్ని సందర్భాల్లో అది 6 % కంటే కూడా చాలా ఎక్కువగా ఉండవచ్చని, అలాగే ఇంజిన్లు, ఇంధన ట్యాంకులకు నష్టం కలిగిందని అనేక అనుభవాధారిత సమాచారం (anecdotal evidence) ఉంది.

ఈ మిశ్రమం వల్ల సంభవించే ఇంజిన్‌ నష్టాన్ని ఎంతమేరకు అనేది ఖచ్చితంగా లెక్కించడం కష్టం. అయితే ఈ మూడు వాదనలను అనుభవపూర్వకంగా పరిశీలించి నిర్ధారించవచ్చు.


భారతీయులకు నిజంగా కొంత డబ్బు ఆదా అయిందా?


మొదటి వాదన ఏమిటంటే, E 20 మిశ్రమంలో ఖరీదైన ముడి చమురు తక్కువగా, తక్కువ ధర గల ఇథనాల్‌ ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి, ఇథనాల్‌ వాటా పెరిగితే భారతీయులకు ఇంధన ఖర్చు తగ్గుతుందని. దీంతో ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది.

కానీ ఈ వాదనలో ఒక ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అధిక ఇథనాల్‌ మిశ్రమం వల్ల వాహనాల మైలేజీ (కిలోమీటర్లు/లీటర్‌) తగ్గుతుంది.

స్వచ్ఛమైన గ్యాసోలిన్‌తో పోలిస్తే ఒక లీటర్‌ ఇథనాల్‌ దహనం ద్వారా విడుదలయ్యే శక్తి తక్కువ. అందువల్ల ఒక లీటర్‌ ఇంధనంతో ప్రయాణించగల దూరం తగ్గుతుంది. ముఖ్యంగా E 20కు అనుకూలంగా రూపొందించని ఇంజిన్లలో ఈ మైలేజీ నష్టం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు, E10 మిశ్రమం కలిగిన పెట్రోల్‌ ధర లీటరుకు ₹100 అని అనుకుందాం. E20 ప్రవేశపెట్టినప్పటికీ ధరను అదే స్థాయిలో ఉంచారని భావిద్దాం. వాస్తవంగా కూడా ఇదే జరిగింది.

E10పై ఒక సాధారణ కారు సగటున 15 కి.మీ/లీటర్‌ మైలేజీ ఇస్తుందని అనుకుందాం. E20 వల్ల మైలేజీ 6% తగ్గితే, అదే 15 కి.మీ. ప్రయాణించడానికి ఇప్పుడు కారు 1.06 లీటర్ల పెట్రోల్‌ వినియోగించాల్సి ఉంటుంది. అంటే అదే దూరం ప్రయాణించడానికి గతంలో ₹100 ఖర్చు కాగా, ఇప్పుడు ₹106 ఖర్చవుతుంది.

ఇదే విషయాన్ని లక్షలాది మంది వినియోగదారులు, కోట్లాది కిలోమీటర్ల ప్రయాణానికి వర్తింపజేస్తే, ఆ అదనపు భారాన్ని కుటుంబాలే భరించాల్సి వస్తుంది. మైలేజీ ఎంత ఎక్కువగా తగ్గితే, కుటుంబాలపై పడే అదనపు ఖర్చు అంత ఎక్కువగా ఉంటుంది.

The Reporters Collective రూపొందించిన విస్తృత నివేదికలో, ఆయుషి కర్‌ రచించిన విశ్లేషణ ప్రకారం, పొదుపు జరగడానికి బదులుగా మైలేజీ తగ్గడం వల్ల కుటుంబాలు అదనపు ఖర్చు చేయాల్సి వచ్చింది.

చార్ట్‌ 1 ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో భారతీయ వినియోగదారులు అదనంగా ₹88,234 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ భారం ప్రతి సంవత్సరం పెరుగుతోంది.

E10 కొనసాగి ఉంటే పెట్రోల్‌ ధర ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రభుత్వం సమర్థించు కోవచ్చు. అయితే కనీసం స్వల్పకాలంలోనైనా పెట్రోల్‌ ధరలను నియంత్రించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.


ఉద్గారాల ప్రశ్న


మొదటి చూపులో E20 తప్పకుండా శుభ్రమైన ఇంధనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక లీటర్‌ ఇథనాల్‌లో నిక్షిప్తమైన కార్బన్‌ పరిమాణం తక్కువగా ఉంటుంది (బాక్స్‌ 1). కానీ పైన చూసినట్లుగా మైలేజీ తగ్గితే, అదే 15 కి.మీ. ప్రయాణించడానికి ఇప్పుడు 1.06 లీటర్ల పెట్రోల్‌ అవసరం అవుతుంది. దీని అర్థం ఏమిటంటే, అదే దూరం ప్రయాణించడానికి మొత్తం ఉద్గారాలు పెరిగే అవకాశం ఉంది.

మైలేజీ తగ్గుదల వల్ల ఉద్గారాల్లో వచ్చే మార్పును బాక్స్‌ 1 వివరిస్తుంది.

మంత్రిగారు పేర్కొన్న 2 % నుంచి 6 % వరకు మైలేజీ తగ్గుదల పరిధిని తీసుకుని, ఈ లెక్కల ఆధారంగా మొత్తం ఉద్గారాల్లో పెరుగుదల లేదా తగ్గుదలను చార్ట్‌ 2లో చూపించారు.

ఈ లెక్కల ప్రకారం, మైలేజీ తగ్గుదల 4 % నుంచి 6 % మధ్యలో ఉంటే ఉద్గారాలు తగ్గడానికి బదులుగా పెరుగుతాయి - వీటిని చార్ట్‌లో ఎరుపు బార్లుగా చూపించారు. మైలేజీ తగ్గుదల 4% కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్గారాలు తగ్గుతాయి. అయితే భారత రహదారులపై నడిచే వివిధ తయారీ సంవత్సరాల వాహనాల మిశ్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

E20 కు అనుకూలంగా ఉన్న కొత్త వాహనాల్లో ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. మరో వైపు పాత వాహనాల్లో మైలేజీ ఎంత తగ్గుతుందనే దానిపై ఆధారపడి ఉద్గారాలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల భారత దేశంలో సగటున ఒక్క కిలోమీటర్‌కు వచ్చే ఉద్గారాలు ఎంత ఉంటాయన్నది వివిధ తయారీ సంవత్సరాల వాహనాల వాటాపై ఆధారపడి ఉంటుంది.

E 20 - విదేశీ మారకద్రవ్యం

ముడి చమురుకు బదులుగా ఇథనాల్‌ను ఉపయోగించడం వల్ల భారత్‌ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడం నిజమే. ఎందుకంటే భారతదేశ దిగుమతి బిల్లులో చమురు దిగుమతులకు గణనీయమైన వాటా ఉంది. అయితే ఈ అంశాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలించాలి.

మొదట, మైలేజీ తగ్గితే E 20 మిశ్రమం వల్ల వచ్చే విదేశీ మారక ద్రవ్య పొదుపులో కనీసం కొంత భాగం తుడిచిపెట్టుకు పోవచ్చు. రెండవది, E20 మిశ్రమానికి అవసరమైన ఇథనాల్‌ ఉత్పత్తి కోసం పంటలు, ధాన్యాలను ఇథనాల్‌ ఉత్పత్తి వైపు మళ్లించాల్సి ఉంటుంది.

ఆహార ధాన్యాలను ఇంధన ఉత్పత్తికి మళ్లించడం ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావాలను కలిగిస్తుంది. E 20 మిశ్రమం ఇకపై కొనసాగబోతున్న విధానమే కాబట్టి, పంటలు, ధాన్యాల సరఫరాలో ఇది దీర్ఘకాలిక మార్పులకు దారితీసే అంశంగా చూడాలి.


ఒక వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి డిమాండ్‌–ఉత్పత్తి మధ్య అంతరం ఏర్పడితే, దాన్ని సాధారణంగా రెండు మార్గాల్లో లేదా రెండింటి కలయికతో భర్తీ చేయాలి:

  1. ధరలను పెంచడం;
  2. సరిహద్దు వాణిజ్యాన్ని (దిగుమతులు/ఎగుమతులు) నియంత్రించడం.

దీని ఫలితంగా ఎగుమతులు తగ్గినా, దిగుమతులు పెరిగినా, లేదా రెండూ జరిగినా, అది విదేశీ మారకద్రవ్యం కోల్పోవడమే. అలా జరిగితే ఈ విధాన మార్పును ప్రారంభించడానికి చెప్పిన విదేశీ మారకద్రవ్య పొదుపు లక్ష్యానికే విఘాతం కలుగుతుంది.

ఈ విధానం విదేశీ మారక ద్రవ్య ఆదాయంపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో నిర్ధారించడానికి ఇంకా సమయం పట్టవచ్చు. అయితే ప్రాథమిక సమాచారం ద్వారా ఈ విధానం ఏ దిశలో వెళ్తుందో కొంత అంచనా వేసుకోవచ్చు.

ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రధానంగా ఉపయోగించే రెండు వనరులు:

  1. చెరకు
  2. మొక్కజొన్న

(చార్ట్‌ 3(a))

భారత్‌ క్రమంగా చెరకు నుంచి మొక్కజొన్న వైపు మళ్లుతున్నప్పటికీ, ఈ విధానం వల్ల రెండు పంటలూ ప్రభావితమయ్యాయి.

చక్కెర విషయంలో, ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకును మళ్లించడం వల్ల దేశీయ డిమాండ్‌ పెరిగింది. దాంతో ప్రభుత్వం 2023 లో, అలాగే ఈ ఏడాది కూడా చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాల్సి వచ్చింది. ఫలితంగా చక్కెర ఎగుమతుల ద్వారా భారత్‌ పొందే డాలర్‌ ఆదాయం గణనీయంగా తగ్గింది (చార్ట్‌ 3(b)).

మొక్క జొన్న విషయంలోనూ ఇథనాల్‌ ఉత్పత్తిలో దాని వాటా పెరుగుతున్నందున, గత రెండు సంవత్సరాల్లో దాని ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది (చార్ట్‌ 3(c)) గత ఏడాది భారత్‌ మొక్కజొన్నలో నికర దిగుమతిదారుగా మారింది. అందువల్ల, కేవలం విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని మెరుగుపరచాలనే పరిమిత దృష్టితో చూసినా, E20 విధానం పూర్తిగా విజయవంతమైందని చెప్పలేం.


పెట్రోల్‌ బంక్‌ వద్ద ధరకు మించిన ఖర్చు


ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వినియోగదారులపై ధరల భారాన్ని నియంత్రించడానికి చక్రీయ పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేసే పరోక్ష పన్నుల విధానం (countercyclical indirect tax policy) ను ప్రవేశపెట్టవచ్చు. దీని ద్వారా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వినియోగదారులను అధిక ధరల నుంచి రక్షించవచ్చు.


ప్రభుత్వం కూడా బెంగాల్‌ ఎన్నికలు ముగిసే వరకు ఇటువంటి విధానాన్ని అనుసరించింది. ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) స్వయంగా సూచించినట్లుగా, కనీసం E10,  E20 మధ్య వినియోగదారులకు ఎంపిక ఉండాలి. E 20 కు సిద్ధంగా లేని కార్లు, మోటార్‌సైకిళ్లతో కూడిన మొత్తం వాహన సముదాయాన్ని E20 ఉపయోగించడానికి బలవంతం చేయకూడదు.

ప్రభుత్వం విశ్వసనీయమైన, సబ్సిడీతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. అందులో ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన చివరి మైలు అనుసంధానం (last-mile connectivity) కూడా ఉండాలి.

అదే సమయంలో సైక్లింగ్‌, నడకకు అనుకూలమైన సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలి.ఇలాంటి అన్ని చర్యలు కార్లు, మోటార్‌సైకిళ్లపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి. తద్వారా ఇంధన వినియోగం, ఉద్గారాలు, కాలుష్యం కూడా తగ్గుతాయి.


ఈ అంశం పై పరిశోధనా రచయితలు DevMac (Development Macroeconomics) నెట్‌వర్క్‌లో భాగస్వాములు. ఈ నెట్‌వర్క్‌ ఆర్థికశాస్త్రంలో బహుళ దృక్కోణాలను (pluralism) ప్రోత్సహిస్తుంది. అదనంగా, శౌవిక్‌ చక్రవర్తి అమెరికాలోని అమ్హెర్స్ట్‌లో ఉన్న Political Economy Research Instituteలో Research Associate Professorగా పనిచేస్తున్నారు.

గమనిక: ఇందులో E20 వల్ల మైలేజీ తగ్గుదల, ₹88,234 కోట్ల అదనపు వినియోగదారుల వ్యయం, ఉద్గారాలు 4–6 % మైలేజీ నష్టంలో పెరిగే అవకాశం, చెరకు/మొక్కజొన్నను ఇథనాల్‌కు మళ్లించడం వల్ల ఆహార భద్రత–ఎగుమతులపై ప్రభావం వంటి అంశాలు ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగినవి.






RA
Rohith Azad

Rohith Azad, JNU

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment