about - సమాచార హక్కు చట్టం ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు న్యాయం ఎలా సాధించాం?
సమాచార హక్కు చట్టం ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు న్యాయం ఎలా సాధించాం సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా
రైతుల ఆత్మహత్యలు దేశంలో ఒక ముఖ్యమైన సమస్యగా ఉన్న సమయంలో, రైతు స్వరాజ్య వేదిక సమాచార హక్కు చట్టం (RTI Act – 2005) ను ఆయుధంగా ఉపయోగించి అనేక కుటుంబాలకు న్యాయం సాధించిన అనుభవం ప్రజలకు, ప్రజా సంఘాలకు ఒక విలువైన పాఠం అందిస్తుంది.
గతంలో మేము రైతు ఆత్మహత్యల వివరాలు సేకరించేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌లో ఒక్కొక్క కేసును చేతితో నమోదు చేసుకునే వాళ్ళం. ఇందుకోసం ఒక్క పోలీస్ స్టేషన్ లోనే రెండు మూడు రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఒక సందర్భంలో ఈ వివరాల సేకరణ కోసం “సమాచార హక్కు చట్టం” ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
RTI చట్టం క్రింద దరఖాస్తులు పెట్టాం
మొదట స్థానిక పోలీస్ స్టేషన్లకు, తరువాత డివిజనల్ పోలీస్ కార్యాలయాలకు, జిల్లా పోలీస్ కార్యాలయాలకు, చివరకు రాష్ట్ర స్థాయిలో పోలీస్ విభాగాలకు RTI దరఖాస్తులు వేసి డేటా సేకరించడం ప్రారంభించాం.
రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ గుర్తింపు సమాచారం కోసం
పోలీస్ శాఖ నుండీ వచ్చిన సమాచారం తీసుకుని ప్రభుత్వం ఏ కేసులను రైతు ఆత్మ హత్యలుగా గుర్తించిందనే వివరాలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు మరోసారి RTI చట్టం క్రింద అభ్యర్థనలు పంపించాము.
న్యాయం జరగని కుటుంబాల పరిశీలన
ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం గుర్తించని లేదా పరిహారం అందని కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి దరఖాస్తులు పరిశీలించాము.
పరిహారం అందక పోవడానికి కారణాల కోసం బాధిత కుటుంబాలు అందించిన అన్ని పత్రాలు సరైనవే అయినప్పటికీ పరిహారం రాకపోతే దానికి గల కారణాలను కూడా RTI ద్వారా అధికారుల వద్ద నుండి తెలుసు కున్నాం.
బడ్జెట్ లేమి కారణంపై హైకోర్టు లో కేసులు చాలాసార్లు ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలకు కూడా డబ్బులు అందలేదు. RTI చట్టం క్రింద మా దరఖాస్తులకు “బడ్జెట్ లేదు” అనే సమాధానం వచ్చినప్పుడు, వాటి ఆధారంగా హైకోర్టులో వ్యాజ్యం వేసి ఆ కుటుంబాలకు నష్ట పరిహారం సాధించాం.
హైకోర్టు జోక్యం – ఫలితాలు :
2022 లో మేము సేకరించిన 100 కుటుంబాల డాక్యుమెంట్ల తో హైకోర్టులో కేసు వేసిన తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విచారణ జరిగింది. ఈ ప్రక్రియ ఫలితంగా 141 కుటుంబాలకు దాదాపు ₹10 కోట్ల నష్ట పరిహారం విడుదలైంది.
కుటుంబాల స్వయం పోరాటం :
కొంతమంది కుటుంబాలు స్వయంగా RTI దరఖాస్తులు వేసి ఆత్మహత్యకు కారణాలు ఎలా నమోదు చేశారో తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించి న్యాయం సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కొత్త కేసుల కోసం చర్యలు:
2025 లో 200 కుటుంబాల ఎఫ్‌ఐఆర్ లు, ఫైనల్ రిపోర్టులు RTI ద్వారా సేకరించి, మళ్లీ విచారణ జరపాలని హైకోర్టులో కొత్త వ్యాజ్యం దాఖలు చేశాం.
జాతీయ స్థాయిలో అవగాహన కోసం :
దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి వెనుక ఉన్న వ్యవస్థాపక కారణాలు ఏమిటన్నది RTI చట్టం ద్వారా స్పష్టంగా బయటకు వస్తోంది.
సమాచార హక్కు చట్టం ఇతర చట్టాల లాంటి ఒక చట్టం మాత్రమే కాదు. అది ప్రజల చేతిలో శక్తివంతమైన సాధనం. రైతు కుటుంబాలకు న్యాయం చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతున్నది.
Kondal Reddy
+91 99488 97734
No comments yet. Login to start a new discussion Start a new discussion