about - రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అందించిన సహాయం వారి జీవనోపాధికి ఉపయోగపడుతుందా ? - ఒక పరిశీలన

గత 20 ఏళ్లలో తెలంగాణా రాష్ట్రంలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి అలా అనేక మంది ముందుకు వచ్చారు.

 · 2 min read

రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు సాధారణంగా సమాజం వేగంగా స్పందిస్తుంది. ఆ బాధిత  కుటుంబాలకు ఏదో రూపంలో  సహాయం అందించాలని తపిస్తుంది. గత 20 ఏళ్లలో తెలంగాణా రాష్ట్రంలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి అలా అనేక మంది ముందుకు వచ్చారు. సహాయం అందించాలని అనుకున్న వాళ్ళకు, బాధిత కుటుంబాలకు మధ్య రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ , రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు వారధిగా కృషి చేశాయి.

ఇప్పటికీ  అనేకమంది అలా సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో మా వేదికల ద్వారా , సహాయం పొందిన  కుటుంబాల తాజా పరిస్థితిపై ఒక అధ్యనం చేయాలని మేము భావించాము. అందిస్తున్న సహాయం ఆయా కుటుంబాల జీవనోపాధులకు ఉపయోగపడిందా? ఆ సహాయం  వారికి కనీస ఆదాయాలను అందించిందా ?  సహాయం పొందిన వాళ్ళు  ఒకవేళ ఎంచుకున్న జీవనోపాధిని కొనసాగించలేకపోవడానికి కారణాలేమిటి?వాళ్ళు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి ? ఈ అంశాలపై మేము గత రెండు నెలలలో కొంత పరిశీలన చేశాము. కొన్ని కీలక అంశాలు మా దృష్టికి వచ్చాయి. వాటిని సమాజానికి అందించడం ద్వారా, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు భవిష్యత్తులో మరింత మెరుగైన సహాయం అందించగలగుతామని మా ఆశ.

అనేకమంది సహృదయంతో అందించిన నగదు సహకారంతో, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు వివిధ రూపాలలో తమ జీవనోపాధులను ప్రారంభించాయి. తమ జీవనోపాధి లో బాగంగా కొందరు ఆవులు, బర్రెలు, మేకలు కొనుక్కున్నారు. కొందరు కిరాణా, బట్టల దుకాణాలు పెట్టుకున్నారు.  

మేము చేసిన పరిశీలనలో మొత్తం 22 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 14 మంది సొంత భూమి కలిగినవారు కాగా, 8 మంది అసలు భూమి లేనివారు. సొంత భూమి కలిగిన వారిలో 12 మంది ఇంకా పశువుల పోషణ  కొనసాగిస్తున్నారు, కేవలం ఇద్దరు మాత్రమే పశువులు పాలు ఇవ్వక పోవడం, లేదా పాల ధర తక్కువగా ఉండడం కారణంగా వాటిని అమ్మేశారు.  వీరిలో 7 గురు పాలను ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతుండగా, ముగ్గురు మాత్రం పాల సహకార కేంద్రానికి పోస్తున్నారు. మరో ఇద్దరు పాలను తమ స్వంత ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు.

ఈ కుటుంబాలలో  5 కుటుంబాలు పశువుల మేతను  కొనుగోలు చేస్తుండగా, 9 కుటుంబాలు మాత్రం తమ పొలాల నుండీ,  ఇతర పొలాల నుండీ  మేత తెచ్చుకుంటున్నారు. పశువులు మాత్రమే కాకుండా ఇతర ఆదాయం ఉన్నవారు (11 మంది) ప్రధానంగా పశువుల పోషణను కొనసాగించగలుగుతున్నారు. ఇతర ఆదాయం లేని వారిలో ముగ్గురిలో ఒకరు పశువులను నిలబెట్టుకోలేకపోయారు. పశువుల పోషణలో ఇతర కుటుంబ సభ్యుల సహాయం కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నది.

స్వంత భూమిలేని 8 కుటుంబాలలో కేవలం 3 కుటుంబాలు మాత్రమే పశువుల పోషణ  కొనసాగిస్తున్నాయి. మిగతా 5 కుటుంబాలు అప్పులు తీర్చాల్సిన అవసరం, కుటుంబంలో వైద్య ఖర్చులు, వ్యవసాయంలో పంట నష్టాలు వంటి కారణాల వల్ల పశువులను నిలబెట్టుకోలేక అమ్ముకున్నారు. పాల అమ్మకం ద్వారా ఆదాయం పొందిన  5 కుటుంబాలు ఉన్నప్పటికీ వారిలో కూడా రెండు కుటుంబాలు పశువుల పోషణ కొనసాగించడం లేదు.

అలాగే ఇతర ఆదాయం రాని 3 కుటుంబాలు  పశువులను పూర్తిగా అమ్మేశాయి. పశువులకు తగినంత మేత అందుబాటులో లేకపోవడం అనేది కూడా  భూమి లేని కుటుంబాలకు పెద్ద  సమస్యగా  మారింది. 3 కుటుంబాలు పశువుల మేతను కొంత కాలం  కొనుగోలు చేసినా, అందులో ఒక కుటుంబం కూడా  వారిలో దానిని కొనసాగించలేక పశువులను అమ్మేసింది. మిగిలిన ఐదు 5 కుటుంబాలలో 4 కుటుంబాలు పశువులను కొనసాగించ లేక అమ్మేశాయి.ఇతర కుటుంబ సభ్యుల సహాయం అందిన వారిలో కొంతమంది పశు పోషణ కొనసాగిస్తున్నారు.  కానీ అలాంటి సహాయం అందని కుటుంబాలు పశువును అమ్మేశాయి.   మొత్తం మీద చూస్తే, సొంత భూమి ఉన్నవారి పరిస్థితి పశు పోషణ లో కొంత స్థిరంగా ఉండగా, స్వంత భూమిలేని వారు  ఆర్థిక ఒత్తిడుల వల్ల పశు పోషణ చేయలేకపోతున్నారు.  పాలు అమ్మకం ధర తక్కువగా ఉండటం, మేత సరఫరా సమస్యలు పెద్ద అడ్డంకులు గా ఉన్నాయి.

  1. భూమి లేని కుటుంబాలకు మేత సబ్సిడీ అందించడం లేదా కలెక్టివ్ ఫాడర్ బ్యాంకులు  ఏర్పాటు చేయడం అవసరం.
  2. పశు పోషణ కొనసాగిస్తున్న కుటుంబాలకు పశు వైద్య సహకారం, మార్కెట్ లింకేజెస్ చూపించడం కూడా అవసరం.  
  3. పాల అమ్మకాల ధర పెరగడానికి పాల సహకార సంఘాల బలోపేతం కావాలి కుటుంబ సహకారం లేని లబ్ధిదారులకు స్థానిక సంఘం మద్దతు అందించాలి.




Mallesh

8688939150

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment