about - రైతు ఆత్మహత్య ప్రభావిత కుటుంబాలకు RDSS జీవనోపాధి సహకారం

రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల వాటా ఎంత అధికంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. రాష్ట్రంలో సుమారు 36 శాతం వ్యవసాయం కౌలు ఆధారంగానే కొనసాగుతున్నప్పటికీ, కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం సమస్యను మరింత తీ

 · 2 min read

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఇంకా ఆగని విషాదంగా కొనసాగుతున్నాయి. పంట నష్టం, పెరిగిన కౌలు ధరలు, బోర్లు విఫలం కావడం, పంటలకు సరైన ధరలు రాకపోవడం వంటి అనేక కారణాల వల్ల రైతులు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. ఈ సంక్షోభంలో ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయ నీయంగా ఉంది. చట్టబద్ధ గుర్తింపు లేకపోవడం వల్ల వారు ప్రభుత్వ పథకాలు కూడా అందక  సమస్యల బారిన పడుతున్నారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS),  రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో  2026 మార్చ్ 25 న న ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 20  రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షులు కోదండ రెడ్డి గారు, కమిషన్ సభ్యులు హాజరై బాధిత కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా వినడం ఒక సానుకూల పరిణామంగా నిలిచింది.

ఈ సమావేశంలో ప్రముఖ రైతు నాయకులు విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ నాయకురాలు రుక్మిణి రావు, RDSS ప్రతినిధి గుండె పద్మ, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రతినిధులు  పాల్గొని బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న 20 కుటుంబాలలో 19 కుటుంబాలు కౌలు రైతులవే కావడం గమనార్హం. ఇది రైతు ఆత్మహత్యలలో కౌలు రైతుల వాటా ఎంత అధికంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. రాష్ట్రంలో సుమారు 36 శాతం వ్యవసాయం కౌలు ఆధారంగానే కొనసాగుతున్నప్పటికీ, కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.

పంట నష్టాలు, పెరిగిన కౌలు రేట్లు, బోర్లు విఫలం కావడం, అప్పులు, ప్రైవేట్ రుణదాతల వేధింపులు, బ్యాంకుల ఒత్తిళ్లు— అన్నీ కలిపి రైతులను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన జీవో 421/2004 మరియు 173/2015 ప్రకారం ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా కూడా అనేక కుటుంబాలకు ఇంకా అందకపోవడం బాధాకరం.

రైతు మరణాలపై విచారణ చేయాల్సిన త్రిసభ్య కమిటీలు కూడా సమయానికి స్పందించకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. భర్తలను కోల్పోయిన మహిళలకు పెన్షన్లు మంజూరు కాకపోవడం, పిల్లల చదువులు ఆగిపోవడం వంటి సమస్యలు ఈ కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో RDSS ఆధ్వర్యంలో బాధిత 20 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.50,000 చొప్పున జీవనోపాధి సహకారం అందించబడింది. ఈ సహకారం ద్వారా కుటుంబాలు మళ్లీ నిలబడేందుకు ఒక అవకాశాన్ని పొందాయి. ఈ సహాయంతో వారు ఆవులు, గేదెలు, మేకల పెంపకం చేపట్టడం, పిండి గిర్ని, టిఫిన్ సెంటర్, లేడీస్ కార్నర్, టైలరింగ్, బట్టల దుకాణాలు వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు “ఈ సహకారంతో మేము మళ్లీ నిలబడతాం… మా పిల్లలను చదివించుకుంటాం…” అని భావోద్వేగంగా చెప్పడం ఈ సహకారం ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాలకు నూతన ఆశను అందించిన ప్రయత్నంగా నిలిచింది.

ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకుని, జీవో 421 మరియు 173 లను పూర్తిగా అమలు చేసి అర్హులైన కుటుంబాలకు తక్షణ ఎక్స్‌గ్రేషియా అందించాలి. కౌలు రైతులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాలి. రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీలు సమయానికి స్పందించేలా చర్యలు తీసుకోవాలి. భర్తలను కోల్పోయిన మహిళలకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయడం, పిల్లల చదువు ఆగకుండా పూర్తి సహాయం అందించడం, వారికి వారసత్వంగా రావలసిన భూమిపై పట్టా హక్కులు కల్పించడం  అత్యవసరం. అలాగే బాధిత కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు, గృహ వసతులు కల్పించడం కూడా అవసరం.

మొత్తంగా RDSS చేపట్టిన ఈ జీవనోపాధి సహకారం కార్యక్రమం సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలకు ఒక నూతన దిశను చూపించింది. ప్రభుత్వం, సమాజం కలిసి ఇలాంటి చర్యలను విస్తృతంగా అమలు చేస్తే మాత్రమే రైతు ఆత్మహత్యల సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది.


Kondal Reddy

+91 99488 97734

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment