about - మహిళా రైతులు, కూలీలకు రైతులుగా గుర్తింపు- భూమి హక్కులు కావాలి

మహిళా రైతులకు, కూలీలకు రైతులుగా గుర్తింపు మరియు భూమి కావాలి

 · 3 min read

మహిళా రైతుల హక్కుల వేదిక రెండవ జాతీయ సదస్సు పూనాలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం లో మే నెల 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు ఉత్తేజకరమైన వాతావరణంలో జరిగింది.

ఈ సదస్సును పూణే విశ్వవిద్యాలయంలోని జెండర్ స్టడీస్ డిపార్ట్మెంట్ సహకారంతో  జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, అస్సాం, నాగాలాండ్ మొదలైన 14 రాష్ట్రాల నుండి 500కు పైగా మహిళలు కొద్ది మంది మగవాళ్ళు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల నుండి 50 మంది, దాదాపు 10 సంస్థలు, సంఘాల నుండి హాజరయ్యారు. వారిలో మొదటిసారి మకాం మీటింగ్ కి హాజరైన వాళ్ళు చాలా మంది వున్నారు. పూణే యూనివర్సిటీ అడిటోరియం ప్రాంగణం అంతా రంగు రంగుల బ్యానర్లు, పోస్టరు, ముగ్గులు, పెయింటింగ్ లు, నినాదాలు, వివిధ జిల్లాల మహిళలు పాడిన పాటలు, నృత్యాలతో  మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంది. యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొనటం ఒక ఆశాజనకమైన విషయం.

మహిళా రైతుల రెండవ జాతీయ సమావేశం  ప్రకటన

మూడు రోజుల పాటు ప్లీనరీలు, సమాంతర చర్చావేదికలలో జరిగిన చర్చల నుండి  వచ్చిన ముఖ్యమైన విషయాలను, డిమాండ్లను క్రోడీకరించి ముగింపులో  చేసిన ప్రకటన యొక్క సంక్షిప్త సారాంశం ఇది:

1.  వ్యవసాయంలో పనిచేస్తున్న మహిళలకు  రైతులుగా గుర్తింపు:

  1. మహిళలు భారత వ్యవసాయానికి వెన్నెముకగా ఉన్నారు - సాగుదారులు, కూలీలు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, అటవీ ఉత్పత్తుల సేకరణదారులుగా వున్నప్పటికీ విధానాలు మరియు డేటాబేస్‌లలో వారు కనిపించకుండా అదృశ్యంగా వుండిపోయారు.
  2. రైతు నిర్వచనంలో భూ యజమానులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో పనిచేసే అన్ని రకాల  మహిళలను చేర్చాలి.

2.  వ్యవస్థాగత అడ్డంకులు, జెండర్  వివక్ష:

  1. కులం, వర్గం, పితృస్వామ్యం మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మహిళలు అనేక రకాలుగా వ్యవస్థాగత వేధింపులు, హింసను ఎదుర్కొంటున్నారు.
  2. మహిళలకు భూమి, ఋణ సదుపాయం, సాంకేతికత మరియు సామాజిక భద్రత కల్పించే  లింగ-విభజిత డేటా మరియు అందుకు వీలు కల్పించే విధానం యొక్క తక్షణ అవసరం ఉంది.

3. భూమి,  వనరులపై  హక్కులు:

  1. రైతుల రిజిస్ట్రీలో వ్యవసాయ మహిళలను (భూమి పట్టాలు ఉన్నా, లేకపోయినా ) చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము.
  2. భూమి పట్టాలు, వారసత్వం మరియు పరిహార ప్రక్రియలలో మహిళలకు సమాన హక్కులు ఉండాలి.
  3. అభివృద్ధి ముసుగులో ఆదివాసీలను  అడవుల నుండి స్థానభ్రంశం చెందడాన్ని నిరోధించండి.

4. హింస మరియు చట్టపరమైన సాధికారత:

  1. మహిళా రైతులపై జరిగే అన్ని రకాల హింసలను ఆపటానికి, పరిష్కరించటానికి ప్రయత్నాలు చేపట్టాలి.
  2. మహిళలపై హింసకు సంబంధించిన భద్రతా చట్టాలను, లోకల్ కమిటీల వంటి ఫిర్యాదుల వ్యవస్థలను గ్రామ, మండల స్థాయిలో ఏర్పరచివాటి అమలును బలోపేతం చేయండి (ఉదా., లైంగిక వేధింపుల చట్టం).

5. అటవీ హక్కులు మరియు ఉమ్మడి వనరులు :

  1. ఆదివాసీ మరియు అటవీ ఆధారిత మహిళలను రక్షించడానికి పీసా, మరియు అటవీ హక్కుల  చట్టాలను పూర్తిగా అమలు చేయండి.
  2. ఏ అభివృద్ధి  ప్రాజెక్టు అయినా ఆదివాసీ  సమాజ సమ్మతిని, మహిళల హక్కులను ఉల్లంఘించకూడదు.

6. నైసర్గిక ప్రకృతి వ్యవసాయం  మరియు ఆహార సార్వభౌమాధికారం:

  1. కార్పొరేట్, రసాయన  వ్యవసాయం నుండి మహిళల నేతృత్వంలోని వ్యవసాయ పర్యావరణ అనుకూల ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లండి.
  2. మహిళల స్థానిక జ్ఞానం, సుస్థిరమైన పద్ధతులు మరియు పర్యావరణ వ్యవసాయాన్ని గుర్తించి మద్దతు ఇవ్వండి.

7. వ్యవసాయ కార్మికుల హక్కులు:

  1. ·కనీస వేతనాలు మరియు స్త్రీ పురుషులకు సమాన  వేతనాలను అమలు చేయండి.
  2. వలస కార్మికులకు భద్రత కాలపాయించి , ఉపాధి హామీ పనిలో 200 పనిదినాలు మరియు సకాలంలో వేతనాల  చెల్లింపుతో NREGSని మెరుగుపరచండి.
  3. ఉపాధి హామీ పద్ధకంలో పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ పనులను చేర్చండి.

8. విత్తన సార్వభౌమాధికారం:

  1. మహిళలు వ్యవసాయ-జీవవైవిధ్యానికి సంరక్షకులు; కమ్యూనిటీ విత్తన బ్యాంకులకు మద్దతు ఇస్తారు మరియు GM/జీనోమ్-సవరించిన విత్తనాలను వ్యతిరేకిస్తారు.
  2. విత్తనాలపై మేధో సంపత్తి హక్కులను (IPRలు) తిరస్కరించండి.

9. పశువులు, చేపలు పట్టడం మరియు అనుబంధ జీవనోపాధి:

  1. వనరులు, మౌలిక సదుపాయాలు మరియు మార్కెట్ అవకాశాలను కల్పించటంతో  పశువులు మరియు మత్స్య సంపదలో మహిళల పాత్రకు మద్దతు ఇవ్వండి.
  2. పశువుల పెంపకందారులు అడవులలో మేపుకోవతాన్ని  నేరరహితం చేయండి మరియు సాంప్రదాయ మేత మరియు చేపలు పట్టే హక్కులను నిర్ధారించండి.

10. విద్య మరియు యువత సాధికారత:

  1. గ్రామీణ యువత, ముఖ్యంగా బాలికలు, స్కాలర్‌షిప్‌లు, సహాయ వ్యవస్థలు మరియు ప్రాతినిధ్యంతో ఉన్నత విద్యను పొందేలా చూసుకోండి.

11. రైతుల ఆత్మహత్యల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు మద్దతు:

  1. అటువంటి గృహాల నుండి మహిళలకు సమగ్ర ఉపశమనం, పునరావాసం మరియు జీవనోపాధికి  మద్దతు కల్పించాలి.
  2. చట్టపరమైన హక్కులు, మానసిక ఆరోగ్య మద్దతు మరియు ఆత్మహత్య డేటాలో కౌలుదారు మరియు మహిళా రైతుల గుర్తింపు వుండాలి.

12. మేము ఈ కింది డిమాండ్లను సాధించటానికి పునరంకితమవుతున్నాము :

  1. మహిళా రైతులు, కూలీలకు రైతులుగా హక్కుదారులగా గుర్తింపు
  2. మహిళా రైతులపై అమలవుతున్న వ్యవస్థీకృత హింసను పరిష్కరించటం
  3. మహిళలకు భూమి హక్కులు, ఋణసదుపాయం, నాయమైన వేతనాలు, భద్రత కల్పించటాలి
  4. విధానాల రూపకల్పనలో, పరిశోధనలో మహిళల గొంతులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

వివిధ రంగాల మధ్య అంటే ప్రభుత్వము, పౌర సమాజము, క్షేత్ర స్థాయి మహిళా సంఘాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పి జెండర్ పరంగా భవిష్యతిలో న్యాయమైన వ్యవసాయాన్ని నెలకొల్పే విధంగా  ప్రయత్నాలు జరగాలి.



Ashalatha

Makam, మహిళా రైతుల హక్కుల వేదిక

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment