about - బహుళ పంటల సాగు రైతుకు ఆదాయం పెంచుతోంది-కిసాన్ స్వరాజ్ సమ్మేళన్ ఫీల్డ్ విజిట్ అనుభవాలు

సమ్మేళన్‌లో భాగంగా నిర్వహించిన ఫీల్డ్ విజిట్ లు సహజ వ్యవసాయంపై నాకు ప్రత్యక్ష అవగాహన కల్పించాయి

 · 2 min read

2026 ఫిబ్రవరి 28 నుండీ మార్చ్ 2 వరకూ మైసూర్ లో జరిగిన కిసాన్ స్వరాజ్ సమ్మేళన్‌లో పాల్గొనడం నాకు ఎంతో మంచి అనుభవం . వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వందలాది మంది వివిధ సంస్థల ప్రతినిధులు ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితులు, రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగాల్సిన మార్పులపై ఒకే వేదికపై కలిసి చర్చించడం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది.

వ్యవసాయానికి సంబంధించిన విధానాలు, సమస్యలు, పరిష్కారాలపై జరిగిన ఈ చర్చలు ఎంతో ఉపయోగకరంగా అనిపించాయి. ఈ సమ్మేళన్‌లో భాగంగా నిర్వహించిన ఫీల్డ్ విజిట్ లు  సహజ వ్యవసాయంపై నాకు ప్రత్యక్ష అవగాహన కల్పించాయి.

మొదటగా వికాస్ గారి 10 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాం. రసాయన సాగు వల్ల నష్టాలు ఎదుర్కొని, ఆయన 2007 లో సహజ వ్యవసాయం వైపు మారారు. గత 10 సంవత్సరాలుగా పొలాన్ని దున్నకుండానే అగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో వక్క , కాఫీ, మిరియాలు, కొబ్బరి, కూరగాయలను కలిపి సాగు చేస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సెస్బానియా, మునగ వంటి మొక్కలు భూమిలో నత్రజని స్థిరీకరణకు, బంతి పూలు పురుగుల నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి.  చెరకు పంటలో మొదటి 4 నెలల పాటు వరుసల మధ్య ఉన్న ఖాళీల్లో కూరగాయలను సాగు చేస్తున్నారు. తరువాత వ్యర్ధాలను మల్చింగ్‌గా ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అదనపు ఆదాయం పొందుతున్నారు.

వికాస్ గారి వ్యవసాయ క్షేత్రం లో విలువ ఆధారిత ఉత్పత్తి ప్రత్యేకంగా కనిపించింది. 60,000 రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన బెల్లం యూనిట్ ద్వారా బెల్లం తయారీ చేసి, ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. జీవామృతం వినియోగం, స్ప్రింక్లర్ నీటి పద్ధతి, స్థానిక హళిక్కర్ జాతి ఆవుల వినియోగం ఆయన వ్యవసాయంలో ముఖ్యాంశాలుగా ఉన్నాయి. ఈ సమీకృత విధానాల ద్వారా మంచి ఆదాయం పొందుతూ, స్థిరమైన వ్యవసాయం కొనసాగిస్తున్నారు.


ఇదే పర్యటనలో మరో సేంద్రీయ రైతు  రాధాకృష్ణ గారి ఫార్మ్‌ను కూడా  సందర్శించాము. మూడెకరాల  పొలంలో 60 కి పైగా రకాల పంటలు ఉండటం ప్రత్యేకత. అగ్రోఫారెస్ట్రీ పద్ధతిలో ఆయా పంటలను వాటి నీడ అవసరాలను బట్టి అంతస్తులుగా అమర్చడం ద్వారా భూమిని సమర్థంగా వినియోగిస్తున్నారు. నీటి పునర్వినియోగం ద్వారా నీటి వృథాను తగ్గించడం, కృపామృతం మరియు వేస్ట్ డీకంపోజర్ వంటి సహజ ఇన్పుట్ ల వినియోగం ఈ ఫార్మ్‌లో ముఖ్యంగా కనిపించింది. పండించిన పంటలను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ, వినియోగదారులు నేరుగా వారి ఫార్మ్‌కి వచ్చి కొనుగోలు చేసే విధానాన్నిప్రోత్సహిస్తున్నారు. ఈ విధానం ద్వారా మంచి లాభదాయకత సాధిస్తున్నారు.

నా పరిశీలనలు:

రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి విభిన్న పంటలను సాగు చేస్తున్నారు.

• ఇద్దరు రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు.

• పంట పండించడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు.

• రైతుల కుటుంబ సభ్యులు వారికి మంచి సహకారం అందిస్తూ, వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ ఫీల్డ్ విజిట్ ల  ద్వారా నాకు రైతుల ఆలోచనా విధానం, వ్యవసాయంపై వారి దృష్టి కోణం స్పష్టంగా అర్థమైంది. సహజ వ్యవసాయం ద్వారా భూమిని సంరక్షించడంతో పాటు, విభిన్న పంటల సాగు, స్వయం మార్కెటింగ్ ద్వారా స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని గ్రహించాను. కుటుంబ సభ్యుల సహకారం రైతుల విజయానికి కీలకంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాను.

ఈ అనుభవం ద్వారా వ్యవసాయం అనేది కేవలం పంటల ఉత్పత్తి మాత్రమే కాకుండా, ఒక సమగ్ర జీవన విధానం అని నాకు స్పష్టమైంది. సహజ వ్యవసాయం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడం, నేల ఆరోగ్యాన్ని కాపాడడం, స్థిరమైన ఆదాయం పొందడం సాధ్యమని గ్రహించాను.


N. Mahitha

7981373159, Counselor

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment