about - ఫలించిన న్యాయ పోరాటం.. రైతు ఆత్మహత్య కుటుంబాలకు అందిన పరిహారం
అప్పుల భారంతో, పంటల వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆర్థిక సాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాయి. కానీ వారికి రావలసిన గుర్తింపు గానీ, పరిహారం గానీ దక్కలేదు.
దశాబ్ద కాలంగా తెలంగాణలో రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలు అగాధంలో మునిగిపోయాయి. అప్పుల భారంతో, పంటల వైఫల్యంతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆర్థిక సాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాయి. కానీ వారికి రావలసిన గుర్తింపు గానీ, పరిహారం గానీ దక్కలేదు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. 173 ప్రకారం బాధిత కుటుంబాలకు ఎగ్జ్‌గ్రేషియా ఇవ్వాల్సింది. కానీ వాస్తవంలో ఈ జీవో అమలు పూర్తిగా నిర్లక్ష్యంగా, అసమర్థంగా జరిగింది. నిజమైన వేలాది రైతు ఆత్మహత్య కేసులు సరిగా విచారణ లేకుండానే పరిహారానికి తిరస్కరించబడ్డాయి.
“కూతురి పెళ్లి కోసం అప్పు చేశాడు”, “కొడుకు చదువుల కోసం అప్పు చేశాడు”, “తన పేరుపై భూమి లేదు”, “కుటుంబ గొడవ కారణంగా ఆత్మహత్య” వంటి కారణాలు చూపుతూ అధికారులు ఈ దరఖాస్తులను తిరస్కరించారు. అనేక కుటుంబాలు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల వద్ద తిరుగుతూ చివరికి నిరాశ లోనే గిలిపోయాయి.
రైతు స్వరాజ్య వేదిక చొరవతో న్యాయ పోరాటం
ఈ అన్యాయం గమనించిన రైతు స్వరాజ్య వేదిక (RSV) బాధిత కుటుంబాల పక్షాన న్యాయపోరాటానికి సిద్ధమయ్యింది. రైతు స్వరాజ్య వేదిక బృందం యాదాద్రి, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాల్లోని రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని FIRలు, పోలీసు నివేదికలు, అప్పు రికార్డులను సేకరించింది. కొన్ని కేసులలో రికార్డులు పది సంవత్సరాల క్రితం నాటివి కూడా ఉన్నాయి. ఇలా నెలల తరబడి కష్టపడి సాక్ష్యాలను సేకరించి,
2022 నవంబర్‌లో రైతు స్వరాజ్య వేదిక తెలంగాణా రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేసింది (PIL No.101/2022).
హైకోర్టు స్పందన :
రాష్ట్ర హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించింది. 2023 లో మధ్యంతర ఆదేశమిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రైతు ఆత్మహత్యలపై తిరిగి విచారణ చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో జిల్లాల్లో రీ-ఎంక్వయిరీ:
హైకోర్టు కేసులో ఉన్న రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను రీ ఎంక్వయిరీ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, మొదట్లో జిల్లా అధికారులు తీవ్ర జాప్యం చేశారు. ఆ సమయంలో స్థానిక కార్యకర్తలు మరియు హైదరాబాద్ నుండి రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకత్వం నిరంతరం ఫాలోఅప్ చేశారు.
రీ ఎంక్వయిరీ సరిగా జరగడం లేదని రాష్ట్ర ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారి దృష్టికి తీసుకెళ్లగా అత్యంత సంక్షోభంలో ఉన్న కుటుంబాలకు హైకోర్టు ఉత్తర్వుల ద్వారా అయినా లాభం జరిగేలా వెంటనే విచారణ చేయమని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అనంతరం కలెక్టర్లు ఆర్డీవోలు, తాసిల్దార్లతో సమన్వయం చేస్తూ రీ ఎంక్వయిరీలు జరిగేలా చూశారు.
స్థానిక కార్యకర్తలు కూడా కుటుంబాల వద్దకు వెళ్లి వారిని అధికారుల దగ్గరికి తీసుకెళ్లి రీ ఎంక్వయిరీలు జరిగేటట్లు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో: స్థానిక కార్యకర్తల ఒత్తిడి మేరకు దాదాపు 9 -10 సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకుని ఇక తమ కుటుంబాలకు ఎంత మాత్రం పరిహారం అందదేమో అని అనుకున్న కుటుంబాలకు కూడా రీ-ఎంక్వయిరీ జరిగి రైతు ఆత్మహత్యలుగా గుర్తించి నివేదికలు పంపారు .
ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆదివాసి కుటుంబానికి నాలుగు సార్లు ఎంక్వయిరీ జరిగినా కానీ అధికారులు రిజెక్ట్ చేశారు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ పూర్తిగా రైతు ఆత్మహత్య అని ఉన్నాయి. చివరకు కిసాన్ మిత్ర టీం పట్టుదలతో ఐదోసారి రీ ఎంక్వయిరీ చేయించడంతోఆ కుటుంబానికి న్యాయం జరిగింది.
నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం వంటి జిల్లాలలో కూడా చాలా కాలం క్రితం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు రీ ఎంక్వయిరీలో న్యాయం పొందాయి.
కోర్టు ధిక్కారణ కేసు:
జిల్లాల నుండి రీ ఎంక్వయిరీ లో రైతు ఆత్మహత్యలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినప్పటికీ..వారి పరిహారం కోసం బడ్జెట్ కేటాయించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలసత్వంగా వ్యవహరించడంతో సంవత్సరం గడిచినాఈ ఆదేశం అమలు కాలేదు. అనివార్యమైన పరిస్థితులలో రైతు స్వరాజ్య వేదిక 2024 నవంబర్‌లో రాష్ట్ర హైకోర్టును మళ్లీ ఆశ్రయించి కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసింది.

దీనితో రాష్ట్ర హైకోర్టు జిల్లా కలెక్టర్లకు మళ్ళీ నోటీసులు జారీ చేసింది. చివరికి కేసు దాఖలు చేసిన జిల్లాల్లో అధికారులు మళ్ళీ విచారణ నిర్వహించి నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాపితంగా పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చివరికి బాధితులకు పరిహారం అందించింది. 2025 జనవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ₹9.98 కోట్లు విడుదల చేసి, 141 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చింది.
అంతటితో ఆగిపోకుండా రైతు స్వరాజ్య వేదిక ఈ కేసును నిరంతరం అధికారులతోఫాలో-అప్ చేస్తూ, అన్ని కుటుంబాలకు ఎటువంటి ఆలస్యం లేకుండా డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా కృషి చేసింది. తహసీల్దార్లతో కలిసి జాయింట్ అకౌంట్లు తెరిపించడం, ఆర్డీవో కార్యాలయాలను నిరంతరం ఫాలో-అప్ చేయడం జరిగింది. దీంతో, కాగితాలపై మాత్రమే కాకుండా, వాస్తవంగా ప్రతి కుటుంబానికి పరిహారం చేరింది.
రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రజా హక్కుల న్యాయవాది వసుధ నాగరాజు గారు వాదించారు. వివిధ జిల్లాల రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ టీం సభ్యులు, స్వచ్చంద సంస్థల(గ్రామ్య , పిలుపు) సభ్యులు బాధిత కుటుంబాలకు పరిహారం అందే వరకూ శ్రమించారు, వారందరికీ అభినందనలు .
కొనసాగుతున్న నిరంతర న్యాయ పోరాటంPIL No.29/2025
ముందుగా వేసిన పిల్ క్రమం లోనే మరికొన్నికేసులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సేకరించడం ప్రారంభించాము. 2024 చివరి నాటికి, 200 కుటుంబాల పోలీస్ ఫైనల్ రిపోర్టులు , పోస్ట్‌మార్టం నివేదికలు, అప్పుల పత్రాలు సేకరించి,
2025 ఫిబ్రవరిలో హైకోర్టులో రెండవ PIL No.29/2025 దాఖలైంది. ఈ పిటిషన్‌లో ముఖ్య కార్యదర్శి (రెవెన్యూ), 23 జిల్లాల కలెక్టర్లు ప్రతివాదులుగా ఉన్నారు. 200 కుటుంబాల కేసుకు సంబంధించిన
వివరాలను హై కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. కోర్టు ఈ 200 కుటుంబాలను కూడా తిరిగి విచారణ చేయాలని ఆదేశించగా, జిల్లాల వారీగా రీ-ఎంక్వైరీ ప్రక్రియ కొనసాగుతోంది.
తెలంగాణలో రైతు ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు న్యాయం అందించేందుకు రైతు స్వరాజ్య వేదిక చేస్తున్న ఈ పోరాటం అన్నీ రైతు సంఘాలకు, గ్రామీణ కార్యకర్తలకు స్పూర్తినిచ్చి బాధిత ప్రజల పక్షాన పోరాడాలని కోరుతున్నాము.
Kondal Reddy
+91 99488 97734
No comments yet. Login to start a new discussion Start a new discussion