about - ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సస్యరక్షణ

రైతులు విష రసాయనాలకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడమొక్కటే ఇందుకు పరిష్కారం. అందుకు కొన్ని పంటల సస్య రక్షణలో సేంద్రీయ పద్ధతులపై సూచనలను ఈ సంచిక నుండీ ప్రారంభిస్తున్నాం.

 · 3 min read


      వ్యవసాయంలో రసాయన విషయాల వినియోగం బాగా పెరిగిపోయిన దశలో, ఆహారం, గాలి, నీరు పూర్తి కలుషితమైపోతున్నాయి. ఈ నేపధ్యంలో వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులలో మార్పు చేసుకోవలసి ఉంది. రైతులు విష రసాయనాలకు  ప్రత్యామ్నాయంగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని కొనసాగించడమొక్కటే ఇందుకు పరిష్కారం. అందుకు కొన్ని పంటల సస్య  రక్షణలో సేంద్రీయ పద్ధతులపై సూచనలను  ఈ సంచిక నుండీ  ప్రారంభిస్తున్నాం.

వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలకు 2026 వానాకాలం సీజన్‌లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, అనియత వర్షాలతో నమోదవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంటలపై పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంది.

1. వరి – ఆగస్టు

పురుగు / తెగులు: కాండం తొలుచు పురుగు

 1. వరి పంటపై పురుగు గుడ్లను తొలగించడానికి 200 లీటర్ల నీటిలో 6 లీటర్ల అగ్ని అస్త్రం కలిపి పంటపై పిచికారీ చేయాలి.  ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు, 10–15 పసుపు   జిగురు అట్టలు పెట్టాలి.

2. వరి – సెప్టెంబర్

పురుగు / తెగులు: సుడిదోమ / దోమపోటు (BPH), ఆకుముడత పురుగు

  1. 200 లీటర్ల నీటిలో 6 లీటర్ల తూటికాడ కషాయం కలిపి వరి మొక్కల మొదళ్లపై సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.
  2. ప్రత్యామ్నాయ తడి-ఆరబెట్టడం (AWD) పద్ధతిలో వరికి నీరు అందించాలి.
  3. వరి పిలకల దశలో ఎకరానికి 4–5 లీటర్ల పంచగవ్య పిచికారీ చేయాలి.

3. పత్తి – ఆగస్టు

పురుగు / తెగులు: రసం పీల్చే పురుగులు (త్రిప్స్, పేనుపురుగులు)

  1. 200 లీటర్ల నీటిలో నీమాస్త్రం లేదా వావిలాకు కషాయం కలిపి పిచికారీ చేయాలి.
  2. ఎకరానికి 10–15 పసుపు/నీలం జిగురు అట్టలు + 1–2 సోలార్ లైట్ ట్రాప్లు పెట్టాలి.
  3. పత్తి సాగులో కంది/అలసంద అంతరపంటగా వేసి మిత్ర పురుగులను ప్రోత్సహించాలి.

4. పత్తి – సెప్టెంబర్

పురుగు / తెగులు: గులాబీరంగు పురుగు (Pink Bollworm), తెల్లదోమ (Whitefly)

  1. 200 లీటర్ల నీటిలో 6 లీటర్ల దశపర్ణి ద్రావణం లేదా నీమాస్త్రం కలిపి పిచికారీ చేయాలి.
  2. కాయ ఏర్పడే దశకు ముందే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు (గులాబీ పురుగు కోసం) పెట్టాలి.
  3. పంట చివరి దశలో ఆముదం/బంతి ఎర పంటలుగా ఉపయోగపడతాయి.

5. మొక్కజొన్న – ఆగస్టు

పురుగు / తెగులు: ఫాల్ ఆర్మీవార్మ్ (Fall Armyworm)

  1. నీమాస్త్రం లేదా అగ్నాస్త్రం సుడిలో పడేలా పిచికారీ చేయాలి.
  2. మోకాలెత్తు దశలో సున్నం + ఇసుక (1:9 నిష్పత్తి) మిశ్రమాన్ని సుడిలో వేయాలి.
  3. ఘన జీవామృతం, ద్రవ జీవామృతంతో మొక్క రోగనిరోధక శక్తిని పెంచాలి.

6. మొక్కజొన్న – సెప్టెంబర్

పురుగు / తెగులు: కంకి కుళ్ళు తెగులు (Post Flowering Stalk Rot)

  1. శిలీంద్ర నివారణకు 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగ ద్రావణం కలిపి పిచికారీ చేయాలి.
  2. ద్రవ జీవామృతం పిచికారీ ద్వారా మొక్కజొన్న వేరు వ్యవస్థను బలోపేతం చేయాలి.
  3. నీటి ఎద్దడి ఉంటే జీవామృతంతో పాటు తేలికపాటి తడి ఇవ్వాలి.

7. జొన్న – ఆగస్టు

పురుగు / తెగులు: కాండం ఈగ (Shoot Fly), కాండం తొలుచు పురుగు

  1. 200 లీటర్ల నీటికి నీమాస్త్రం లేదా దశపర్ణి ద్రావణం కలిపి పిచికారీ చేయాలి.

8. జొన్న – సెప్టెంబర్

పురుగు / తెగులు: పేనుబంక (Aphids), కంకి తెగుళ్లు

  1. పంచగవ్య లేదా వావిలాకు కషాయం పిచికారీ చేయాలి.
  2. నీటి ఎద్దడి నివారణకు జీవామృతం పిచికారీ చేయాలి.
  3. పూత/గింజ దశలో పంటను నిశితంగా పరిశీలించాలి.

సస్య రక్షణకు అవసరమైన కొన్ని కాషాయాలు, ద్రావణాల తయారీ

1. నీమాస్త్రం

అవసరమైన పదార్థాలు: వేప ఆకులు 10 కిలోలు, ఆవుపేడ 2 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, నీరు 200 లీటర్లు.

తయారీ: వేప ఆకులను దంచి అన్ని పదార్థాలను కలపాలి. 48 గంటలు ఉంచి ఉదయం, సాయంత్రం రెండుసార్లు కలియతిప్పాలి. తరువాత గుడ్డతో వడకట్టాలి.

మోతాదు: ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఉపయోగం: రసం పీల్చే పురుగుల నివారణ.

2. అగ్నాస్త్రం

అవసరమైన పదార్థాలు: వేప ఆకులు 5 కిలోలు, పొగాకు 1 కిలో, పచ్చిమిర్చి 1 కిలో, వెల్లుల్లి 500 గ్రా., నీరు 10 లీటర్లు, ఆవుమూత్రం 10 లీటర్లు.

తయారీ: వేప ఆకులు, పొగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని దంచి నీటిలో మరిగించాలి. చల్లారిన తరువాత వడకట్టి ఆవుమూత్రం కలపాలి. మరుగుతున్నప్పుడు ఆవుమూత్రం కలపకూడదు.

మోతాదు: ఎకరానికి 100 లీటర్ల నీటిలో కలిపి ఉపయోగించాలి.

ఉపయోగం: కాండం, కాయ తొలుచు పురుగుల నివారణ.

3. తూటికాడ కషాయం

అవసరమైన పదార్థాలు: తూటికాడ ఆకులు 10 కిలోలు, నీరు 15 లీటర్లు, ఆవుమూత్రం 15 లీటర్లు, కుంకుడుకాయల రసం 250 గ్రా.

తయారీ: ఆకులను దంచి 15 లీటర్ల నీటిలో ఉడికించాలి. చల్లారిన తరువాత ఆవుమూత్రం, కుంకుడుకాయల రసం కలపాలి.

మోతాదు: 6 లీటర్లు + 200 లీటర్ల నీరు. మొక్కల మొదళ్లపై సాయంత్రం పిచికారీ చేయాలి

ఉపయోగం: రసం పీల్చే పురుగుల నివారణ.

4. దశపర్ణి ద్రావణ

అవసరమైన పదార్థాలు: వివిధ స్థానిక ఆకులు (వేపకు ప్రాధాన్యత), ఆవుపేడ 2 కిలోలు, ఆవుమూత్రం 20 లీటర్లు, నీరు 150 లీటర్లు, పసుపు 500 గ్రా., అల్లం 500 గ్రా., పచ్చిమిర్చి 1 కిలో, వెల్లుల్లి 500 గ్రా., ఇంగువ 250 గ్రా.  

తయారీ: 1వ రోజు: నీరు + ఆవుమూత్రం + పేడ కలపాలి; తరువాత పసుపు, అల్లం, ఇంగువ కలపాలి. 2వ రోజు: పచ్చిమిర్చి, వెల్లుల్లి కలపాలి. 3వ రోజు: ఆకులను ముక్కలుగా చేసి కలపాలి. తరువాత 30–40 రోజులు మురగనివ్వాలి. రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పి వడకట్టాలి.

మోతాదు: ఎకరానికి 200 లీటర్ల నీటిలో 6 లీటర్ల ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి.

ఉపయోగం: వివిధ రకాల పురుగుల నివారణ. నిల్వ: 3 నెలలు.

5. పంచగవ్య

అవసరమైన పదార్థాలు: ఆవుపేడ 5 కిలోలు, ఆవుమూత్రం 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, పాలు 2 లీటర్లు, నెయ్యి ½ కిలో, కొబ్బరినీళ్లు 3 లీటర్లు, మాగిన అరటిపండ్లు 12, బెల్లం 1 కిలో, బూడిదగుమ్మడి గుజ్జు 1 కిలో, కల్లు 3 లీటర్లు (లేకపోతే 100 గ్రా. బేకరీ ఈస్ట్).

తయారీ: పేడ + నెయ్యి కలిపి 4 రోజులు రోజుకు రెండుసార్లు కలియతిప్పాలి. 5వ రోజు మిగతా పదార్థాలు, 3 లీటర్ల నీరు కలపాలి. అరటిపండ్లను మెత్తగా చేసి కలపాలి. 15 రోజులు మురగనివ్వాలి; రోజుకు రెండుసార్లు కలియతిప్పాలి. 21 రోజులకు పంచగవ్య సిద్ధమవుతుంది.

మోతాదు: వరికీ 5 లీటర్లు + 100 లీటర్ల నీరు; ఇతర పంటలకు 3 లీటర్లు + 100 లీటర్ల నీరు. పూత–పిందె దశలో పిచికారీ చేయడం మంచిది.

ఉపయోగం: మొక్కల పెరుగుదలకు. నిల్వ: 6 నెలలు.

ఆధారాలు

1 .   Contingency Plan for Vanakalam 2026 – తెలంగాణ వ్యవసాయశాఖ & PJTSAU (ఎల్ నినో ప్రభావ నివారణ యాజమాన్య పద్ధతులు – పత్తి, మొక్కజొన్న, జొన్న).

2.   ప్రకృతి వ్యవసాయ సంక్షిప్త మార్గదర్శిని – రైతు సాధికార సంస్థ (RySS) / APCNF.







N. Mahitha

7981373159, Counselor

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment