about - ధైర్యానికి చిహ్నం – తుర్కపల్లి సబిత కథ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సోముల సబిత జీవితం ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సోముల సబిత జీవితం ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక. వ్యవసాయం ఆధారంగా జీవనోపాధి సాగిస్తున్న ఈ కుటుంబం ఒక భయంకరమైన సంఘటనతో జీవితంలో ఎన్నడూ ఊహించని దుఃఖాన్ని ఎదుర్కొంది.
విషాదం తీసుకొచ్చిన కరెంట్ షాక్
సబిత భర్త నరసింహులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడిపించేవారు. ఒకరోజు బోరు మోటార్ పనిచేయకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరికి వెళ్లి సరిచేసే ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి 99 శాతం కాలిపోయారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినా 2018 జనవరి 9న ఆయన మృతి చెందారు. ఆ రోజు నుంచే సబిత జీవితంలో చీకట్లు అలుముకున్నాయి.
ముగ్గురు ఆడపిల్లలతో పోరాటం
ముగ్గురు ఆడపిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరిగా మారిన సబిత, ఆర్థిక కష్టాలు మధ్య కూడా పిల్లల చదువును ఆపలేదు. పెద్ద అమ్మాయిని పదవ తరగతి వరకు చదివించి, 20 గుంటల భూమి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసింది. రెండవ అమ్మాయిని కూడా చదివించి, కరోనా సమయంలో మరో 20 గుంటల భూమి అమ్మి పెళ్లి చేసింది. మూడవ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది.
జీవితం మార్చిన ‘సరోజినీ సంగం’
తన భర్త మరణం తరువాత ఒంటరితనంలో ఉన్న సబిత 2022 లో సరోజినీ ఒంటరి మహిళా సంఘంలో చేరింది. ప్రతి నెలా వంద రూపాయలు పొదుపు చేయడం ప్రారంభించింది. ఈ సంఘంలో చేరిన తరువాత సబితకు కొత్త ధైర్యం వచ్చింది — ఇతర మహిళలతో మాట్లాడడం, తన సమస్యలను చెప్పడం, పరిష్కారం కోసం ముందడుగు వేయడం నేర్చుకుంది.

న్యాయం కోసం పట్టుదల: సంస్థ సభ్యురాలు స్వప్న సహకారంతో సబిత తన భర్త కరెంట్ షాక్ మరణానికి ఎక్స్ గ్రేషియా రావలని తెలుసుకుంది. ఏడేళ్లు గడిచిందని నిరుత్సాహపడకుండా AE కార్యాలయాన్ని, జిల్లా స్థాయి అధికారులను వరుసగా కలిసింది. అవసరమైన అన్ని ఆధారాలను (FIR, డెత్ సర్టిఫికేట్, పంచాయతీ తీర్మానం, సాక్షుల ప్రకటనలు, పత్రికా కటింగ్స్ మొదలైనవి) సమర్పించింది.
రెగ్యులర్ గా అధికారులను కలుస్తూ, పట్టుదలతో ముందుకు సాగిన ఈ పోరాటం చివరికి ఫలించింది. ఏప్రిల్ 2025 లో సబితకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్ అందింది.
ఆశలకూ, అర్హతకూ ప్రతీక
ఒకప్పుడు “ఇది ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఇప్పుడెలా వస్తుంది?” అని తిరస్కరించబడిన కేసు, చివరికి పట్టుదలతో న్యాయం పొందింది. సబితలాంటి మహిళల కథలు సమాజానికి ఒక స్ఫూర్తి. ఆడపిల్లలు, ఒంటరి మహిళలు, గ్రామీణ రైతు కుటుంబాలు తమ హక్కుల కోసం లొంగకుండా పోరాడగలరని ఇది చూపించింది.
No comments yet. Login to start a new discussion Start a new discussion