about - తెలంగాణలో నిషేధిత భూముల సమస్యలు - పరిష్కార మార్గాలు
ప్రస్తుతం ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి అవకాశాలు కల్పించినప్పటికీ, అనేక మంది రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ప్రజాపాలన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, స
తెలంగాణ రాష్ట్రంలో పట్టా కలిగిన అనేక మంది రైతుల భూములు రెవెన్యూ రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, రికార్డుల నవీకరణలో నిర్లక్ష్యం లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల నిషేధిత భూముల జాబితాలో చేరాయి. ఈ సమస్య రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కొనసాగుతోంది. గతంలో ధరణి పోర్టల్‌లో తగిన పరిష్కార మార్గం లేకపోవడంతో పేద, సన్నకారు, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నిషేధిత జాబితాలో భూమి ఉండటం వల్ల రైతులు రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సబ్సిడీలు, పంట నష్టపరిహారం వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంటలను విక్రయించడంలో కూడా సమస్యలు వచ్చాయి. భూమి యజమాని మరణించిన తరువాత వారసుల పేర్లపై మ్యుటేషన్ చేయించుకోవడం, అవసరమైనప్పుడు భూమిని విక్రయించడం, తాకట్టు పెట్టడం లేదా కుటుంబ విభజన చేసుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి అవకాశాలు కల్పించినప్పటికీ, అనేక మంది రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ప్రజాపాలన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు తగిన పరిష్కారం లభించకపోవడం ఆందోళనకరం.
నిషేధిత భూమి అంటే ఏమిటి?
ప్రభుత్వ రికార్డుల ప్రకారం సాధారణంగా అమ్మకం, బదిలీ లేదా రిజిస్ట్రేషన్‌పై చట్టపరమైన లేదా పరిపాలనా పరిమితి ఉన్న భూమిని నిషేధిత భూమిగా పరిగణిస్తారు. ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, ఎండోమెంట్ లేదా వక్ఫ్ భూమి, కోర్టు ఉత్తర్వులు, భూసేకరణ, సీలింగ్ కేసులు, చెరువులు లేదా ఇతర రికార్డు సమస్యల కారణంగా భూమి నిషేధిత జాబితాలో ఉండవచ్చు. అయితే పట్టా భూమి తప్పుగా. నిషేధిత జాబితాలో చేరిన సందర్భాల్లో సంబంధిత రికార్డులను పరిశీలించి సవరణ కోరవచ్చు.
రైతులు తీసుకోవాల్సిన చర్యలు:
ముందుగా భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్, రిజిస్ట్రేషన్ పత్రాలు, పహాణి, మ్యుటేషన్ వివరాలు, సర్వే నంబర్, భూ భారతి/ధరణి దరఖాస్తు వివరాలు, నిషేధిత స్థితిని చూపించే ఆధారాలను సేకరించాలి. అనంతరం సంబంధిత తహసీల్దార్/MRO, RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించి పట్టా భూమిగా నమోదు చేయాలని ఆధారాలతో దరఖాస్తు చేయాలి.
అదేవిధంగా, భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన ఉత్తర్వు, తేదీ, కారణం, సంబంధిత అధికారి వివరాలు, ఆధారమైన రికార్డులు, ఇప్పటికే దాఖలు చేసిన తొలగింపు దరఖాస్తు యొక్క ఫైల్ స్థితిని అధికారికంగా కోరవచ్చు. అవసరమైన రికార్డులు లభించకపోతే సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సంబంధిత రికార్డులను కోరడం కూడా ఒక మార్గం. RTI ద్వారా నిషేధిత ఎంట్రీ స్వయంగా తొలగిపోదు; అయితే దాని వెనుక ఉన్న కారణాలు, ఉత్తర్వులు, ఫైల్ వివరాలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
రెవెన్యూ అధికారులు రైతుల దరఖాస్తులను పరిశీలించి, భూమి నిజంగా పట్టా భూమి అని రికార్డుల ద్వారా నిర్ధారణ అయితే నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి.
ప్రభుత్వానికి విజ్ఞప్తి:
గత కొన్ని సంవత్సరాలుగా నిషేధిత భూముల సమస్యతో బాధపడుతున్న రైతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రెవెన్యూ సర్వే నిర్వహించి, పట్టా భూములు పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన కేసులను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలి. రైతులు సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్పష్టమైన గడువుతో పరిష్కార విధానం ఏర్పాటు చేయాలి. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, రైతులకు వారి భూమిపై ఉన్న హక్కులను పూర్తిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Vadla. Amareshwar
7036135805, Field Coordinator, Vikarabad
No comments yet. Login to start a new discussion Start a new discussion