about - న్యాయంకోసం 20 ఏళ్ల పోరాటం - మోత్కూర్ గ్రామరైతు కేసు స్టడీ

మోత్కూర్ గ్రామరైతు న్యాయంకోసం 20 ఏళ్ల పోరాటంలో కిసాన్ మిత్ర పాత్ర

 · 2 min read

వికారాబాద్ జిల్లా దోమ మండల్ మోత్కూరు గ్రామంలో నరసయ్య తండ్రికి  1976 సంవత్సరంలో ప్రభుత్వం నుండి అసైన్డ్ ల్యాండ్ కింద ఒక అయిదు ఎకరాలు వ్యవసాయ భూమి అందింది.  ఆయనతోపాటు ఆ గ్రామంలో ఇంకొక 11 మందికి కూడా ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మొత్తం 60 ఎకరాలు భూమి అందింది.

నరసయ్య గతండ్రి పెద్ద నరసయ్య 1996 సంవత్సరంలో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ భూమి వీరా సత్ కింద నరసయ్య  పేరు మీద పట్టా అయింది కానీ నరసయ్య పేరు మీద 1998 వరకు మాత్రమే పహానిలో ఉంది.  ఆ ఆ తర్వాత సంవత్సరం పహానీ లో  నరసయ్య  పేరు మిస్సైంది.

ఆ తరువాత ఆ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఆయనకు  రాలేదు కానీ,  పొలాన్ని  తానే  సాగు చేస్తున్నాడు.  2018లో ప్రభుత్వం నుంచి వచ్చిన పాస్ బుక్కుల్లో కూడా తన పేరు రాలేదు.  మొత్తం 12 మందిలో  11 మందికి పాస్ బుక్ లు వచ్చాయి కానీ, తనకొక్కడికి మాత్రమే పాస్ బుక్ రాలేదు.

గత 20 సంవత్సరాల నుండి ఆ భూమికి సంబంధించిన పత్రాల గురించి ప్రభుత్వ అధికారుల చుట్టూ  తిరుగుతున్నాడు కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఈ మధ్య కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో,  ఈ కేసును ఫాలోఅప్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లడం జరిగింది.

ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలను మేము పరిశీలించి దోమ మండల తాసిల్దార్ గారికి దరఖాస్తు రాసి ఇచ్చాం.  ఆ భూమినీ సర్వే చేయిస్తానని ఆయన చెప్పారు కానీ, ఆ తరువాత  ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం గురించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది,

తర్వాత ఆర్డీవో గారిని కూడా కలసి దరఖాస్తు ఇప్పించాము.  ఆర్డిఓ  సంబంధిత ఎమ్మార్వో గారితో మాట్లాడారు.  ఈ కేసు విషయమై ఎమ్మార్వో గారితో ఫాలో ఆఫ్ చేస్తూ ఆ భూమికి సంబంధించిన సర్వే  చేయించాము. ఆ సర్వే ఆధారంగా నరసయ్యకు  5 ఎకరాల భూమి ఉందని సర్వే రిపోర్ట్ కూడా  తీసుకున్నాం.

ఈ సర్వే రిపోర్ట్ తీసుకున్న తరువాత కూడా  తాసిల్దార్  మేము మీ ఫైల్ ను ఆర్డిఓ గారికి పంపిస్తాము,  మీరు ఆయనను  వెళ్లి కలవండని చెప్పారు. ఆర్డీవో  ఈ విషయంలో తాసిల్దార్ గారి నుంచి సరైన డాక్యుమెంట్స్ రాలేదు కాబట్టి సమస్య పరిష్కారం చేయడం వీలుకాదని చెప్పారు.

ఈ విషయంలో దోమ తాసిల్దార్  ఎలాంటి సహకారం అందించలేదు. చివరికి ఆర్డీవో గారు ఆర్ టి ఐ యాక్ట్ 2005 ప్రకారం సమాచారం సేకరించి తెస్తే, పరిష్కారం  చేస్తానని చెప్పారు.  సెప్టెంబర్ రెండో తారీఖున ఆర్టిఐ యాక్ట్ ప్రకారం ఆ భూమికి సంబంధించిన సమాచారం కావాలని తహసిల్దార్ కు  లెటర్ కూడా ఇచ్చాం. దీనిపై తాసిల్దార్ ను  కలిసి మాట్లాడాం. ఈ భూమికి సంబంధించిన సమాచారాన్ని ఆర్డీవోకు మొత్తం పంపించామని మీరు 09/10/2025 తరువాత ఎప్పుడైనా ఆర్డిఓ గారిని కలవండని ఆయన చెప్పారు.

ఫలితం:  ఈ కేసు విషయంలో మన కిసాన్ మిత్ర   ఫాలో ఆఫ్ చేయడం ద్వారా ఆ భూమిని సర్వే చేయించగలిగాం. సర్వే రిపోర్ట్ కూడా ఆ రైతుకు అందింది. ఆర్డీవో లెవల్లో  కూడా ఫాలో అప్  చేస్తూ ఈ సమస్యను పూర్తి గా పరిష్కారం అయ్యేలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టిఐ యాక్ట్ 2005 ప్రకారం కూడా సమాచారాన్ని సేకరించాం.



S. Yadaiah

Kisan Mitra Vikarabad Field Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment