about - డిజిటల్ ఎరువుల విక్రయ విధానం రైతుకి సౌకర్యమా ? సవాలా ?

ఎరువుల సరఫరాలో పారదర్శకత పెంచడం, స్టాక్ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించడం, సబ్సిడీ ఎరువుల పంపిణీని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు, పక్కదారి పట్టడాన్ని తగ్గించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశాలుగా చెప్పారు.

 · 2 min read

డిజిటల్ సాంకేతికత వ్యవసాయ రంగంలోకి వేగంగా ప్రవేశిస్తోంది. ఎరువుల విక్రయ వ్యవస్థ కూడా అదే క్రమంలో డిజిటల్ విధానంలోకి మారుతోంది. ఫర్టిలైజర్ యాప్‌లు రాకముందు రైతులు నేరుగా PACS కేంద్రాలు లేదా ప్రైవేట్ డీలర్ల వద్దకు వెళ్లి ఆధార్ ఆధారంగా ఎరువులు కొనుగోలు చేసేవారు. మొదట తెలంగాణ ప్రభుత్వం యూరియాకు యాప్ ఆధారిత విధానాన్ని తీసుకురాగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాపితంగా ఫెర్టిలైజర్ యాప్  ద్వారా ఎరువుల విక్రయ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తోంది.

డిజిటల్ విధానం ఉద్దేశం

ఎరువుల సరఫరాలో పారదర్శకత పెంచడం, స్టాక్ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించడం, సబ్సిడీ ఎరువుల పంపిణీని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు, పక్కదారి పట్టడాన్ని తగ్గించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశాలుగా చెప్పారు.

అయితే విధాన లక్ష్యాలు ఏమైనప్పటికీ,  దాని అమలు రైతుకు ఎంత సులభంగా ఉంది? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అంశం.

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు

యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం, స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం, సర్వర్ సమస్యలు, బుకింగ్ ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో స్టాక్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలపై రైతుల నుంచి ఫిర్యాదులు నమోదయ్యాయి. కొంతమంది రైతులు యాప్ వినియోగం తెలియక ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.

అయితే యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు మీ సేవా  కేంద్రాలు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా యూరియా బుక్  చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్రత్యామ్నాయ సౌకర్యంపై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

కౌలు, Non-DS, PP Land రైతులకు ప్రత్యేక ఇబ్బందులు

భూమి తమ పేరుపై లేకపోవడంతో కౌలు రైతులు యాప్‌లో నమోదు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో భూ యజమాని సహకారం లేదా OTP అవసరం కావడం కూడా సమస్యగా మారుతోంది. అలాగే Non-DS మరియు PP Land రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ధృవీకరించిన తర్వాతే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో, ఈ ప్రక్రియపై అవగాహన లేని రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో అవసరమైన సమయంలో ఎరువులు పొందడంలో ఆలస్యం జరుగుతోంది.

“లింక్” పేరుతో అదనపు ఒత్తిడి

కొన్ని ప్రాంతాల్లో ఎరువుల దుకాణం యజమానులు “లింక్” పేరుతో రైతులపై ఒత్తిడి చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. “లింక్ వద్దు అంటే యూరియా ఇవ్వము” వంటి మాటలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

డిజిటల్ వ్యవస్థ రైతుకు అందుబాటులో ఉండాలి

ముఖ్యంగా కొన్ని ఆదివాసీ గ్రామాల్లో నెట్‌వర్క్ సౌకర్యం లేకపోవడం, రైతులకు యాప్ వినియోగంపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో డిజిటల్ విధానం చాలా మందికి సౌకర్యం కాకుండా అడ్డంకిగా మారుతోంది.


  1. యాప్ వినియోగంపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి.
  2. కౌలు, Non-DS, PP Land రైతుల వెరిఫికేషన్  ప్రక్రియను సులభతరం చేయాలి.
  3. మీ సేవ, వ్యవసాయ  శాఖ ద్వారా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ బుకింగ్  సౌకర్యంపై విస్తృతంగా ప్రచారం చేయాలి.
  4. బుకింగ్ చేసిన రైతుకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను సమన్వయం చేయాలి.
  5. ఎరువుల డీలర్లు  రైతులపై అనవసరమైన షరతులు విధించకుండా పర్యవేక్షణ ఉండాలి.
  6. నెట్‌వర్క్ లేని గ్రామాల్లో రైతులకు సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.


డిజిటల్ ఎరువుల విక్రయ విధానం పారదర్శకత, సమర్థవంతమైన సరఫరా కోసం మంచి మార్పే. అయితే డిజిటల్ వ్యవస్థ విజయవంతం కావాలంటే యాప్ అందుబాటులో ఉండటం మాత్రమే కాదు, ప్రతి రైతు దాన్ని సులభంగా ఉపయోగించగలగాలి, అవసరమైన సమయంలో ఎరువులు పొందగలగాలి. డిజిటల్ వ్యవస్థ రైతుకు అడ్డంకిగా కాదు,  వ్యవసాయానికి అండగా ఉండాలి.




M. Ramakanth

Kisan Mitra Adilabad Field Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment