about - జొన్న మార్కెట్లో రైతు పరిస్థితి: ఎంఎస్పీ నుంచి చెల్లింపు వరకు పై క్షేత్రస్థాయి పరిశీలన
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట రబీ సీజన్ లో ఒక ముఖ్యమైన పంట. రైతు
ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట రబీ సీజన్ లో ఒక ముఖ్యమైన పంట. రైతులు తమ పంటకు కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందనే ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆధారపడతారు. అయితే MSP ప్రకటించడం మాత్రమే కాకుండా, రైతు పండించిన పంటను సకాలంలో, తగిన పరిమాణంలో ప్రభుత్వమే కొనుగోలు చేయగలగడం కూడా అంతే ముఖ్యం.
2025–26 రబీ సీజన్‌లో జొన్న మార్కెటింగ్ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చాయి.
ఖరీఫ్ అనుభవం – రబీపై పెరిగిన ఆశలు
2025 ఖరీఫ్ సీజన్‌లో పత్తి కొనుగోలు ప్రక్రియలో కొత్తగా కపాస్ కిసాన్ యాప్ ను ప్రవేశపెట్టడం వల్ల రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో సోయా, పత్తి పంటల నాణ్యతపై కఠినమైన ప్రమాణాలు అమలు చేయడంతో, నాణ్యత సరిగా లేదనే కారణంతో అనేక మంది రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేకపోయారు.
వర్షాల కారణంగా కొంతమేర పంట నాణ్యత దెబ్బతిన్నప్పటికీ, ఈ సీజన్‌లో అమలు చేసిన నాణ్యతా ప్రమాణాలు రైతులకు మరింత కఠినంగా మారాయి. ముఖ్యంగా సోయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ కొనుగోలు ద్వారా పంటను విక్రయించలేక, చేసేది లేక అనేక మంది రైతులు తమ పంటను ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించారు. అయితే, రైతులు ప్రైవేట్ మార్కెట్‌లో పంటను విక్రయించిన అనంతరం మార్కెట్ ధరలు పెరగడం రైతులకు అన్యాయమే చేసింది. దీంతో రైతులలో తాము తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వచ్చిందనే భావన మరింత స్పష్టంగా కనిపించింది. ఈ ఖరీఫ్ అనుభవం నేపథ్యంలో, ఈ రైతులందరూ రబీ సీజన్‌లో పండించే పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు.
రబీ సీజన్‌లో పరిస్థితి
2025–26 రబీ సీజన్‌లో జొన్నకు ప్రభుత్వం ప్రకటించిన MSP క్వింటాల్‌కు ₹3,699. అయితే పంట వేసే సమయంలోనే ప్రభుత్వం ఈసారి పంట కొనుగోలు చెయ్యదు అనే సోషల్ మీడియా ప్రచారం రైతులను ఆందోళనకు గురిచేసింది, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి 65 మంది రైతులు కాల్ చేసి చెప్పడమూ, అలాగే క్షేత్ర స్థాయి సిబ్బందిని అడగడమూ జరిగాయి.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కిసాన్ మిత్ర తీసుకు వెళ్ళింది. తీరా పంట కాలం పూర్తి అయ్యి రైతులకు ఆశించినంత దిగుబడి దాదాపు 15 క్వింటాల్ వచ్చాక కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ గురించి ఏమీ చెప్పలేదు. దీనితో రైతులు నిరాశకు లోనయ్యారు.
ఈ సమస్యను జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయిలలో ఫాలో అప్ చేసిన తర్వాత ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు ప్రారంభమైంది.అయితే ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు పరిమితి ఉండటంతో, అంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు తమ మిగిలిన పంటను ఇతర మార్గాల్లో విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్కెట్ ప్రారంభమైన తర్వాత రైతులందరూ ఒకేసారి పంటను మార్కెట్‌కు తీసుకురావడం కొనుగోలు ప్రక్రియలో పెద్ద సమస్యగా మారింది. అయితే దీనికి గత కొనుగోలు అనుభవమే ప్రధాన కారణంగా కనిపించింది.
జొన్న పంటకు ముందు శనగ పంటను ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కోటా పూర్తవడంతో సగం పంట కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు నిలిపివేశారు. దీంతో రైతులు చాలా రోజుల పాటు కొనుగోలు పునః ప్రారంభం కోసం ఎదురుచూశారు. చివరకు చేసేది లేక చాలామంది రైతులు తమ పంటను ప్రైవేట్ మార్కెట్‌లో విక్రయించాల్సి వచ్చింది.
ఈ అనుభవం నేపథ్యంలో, జొన్న పంట విషయంలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందనే భయంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు ప్రారంభానికి ముందే తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చి ఉంచారు. దీంతో మార్కెట్ ప్రారంభమైన సమయంలో పెద్ద మొత్తంలో పంట ఒకేసారి మార్కెట్‌కు చేరింది.
దీని వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కెట్‌లో పంటను ఎక్కువ రోజులు ఉంచాల్సి రావడంతో పంటకు కాపలా కాయాల్సిన పరిస్థితి, లారీల కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం, గోనె సంచుల కొరత, హమాలీల కొరత వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒక్కో రైతు పంట కొనుగోలు పూర్తయ్యేందుకు సుమారు 15 రోజులకు పైగా సమయం పట్టింది.
దీంతో రైతులు తమ పంటను కాపాడుకోవడంతో పాటు, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ పనులను సమయానికి ప్రారంభించడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో మార్కెట్‌లో ఉంచిన పంటపై వర్షం పడితే తడిసి నాణ్యత దెబ్బతింటుందనే ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది.
ఈ సమస్యలను కిసాన్ మిత్ర బృందం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించింది.
ఇన్ని ఇబ్బందులను అధిగమించి రైతు తన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించినప్పటికీ, చెల్లింపుల కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినా, కొంతమంది రైతులకు చెల్లింపులు ఇంకా దశలవారీగా జమ అవుతున్న పరిస్థితి కనిపించింది.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, రైతు పంటను కొనుగోలు కేంద్రంలో విక్రయించిన తేదీ ఆధారంగా కాకుండా, ఆ పంట గోదాముకు చేరిన తేదీ ఆధారంగా చెల్లింపులు చేయడం జరిగింది. దీంతో ముందుగా పంట విక్రయించిన రైతులకు కూడా, గోదాముకు పంట చేరిన క్రమాన్ని బట్టి చెల్లింపులు జరగడం వల్ల చెల్లింపుల్లో ముందు–వెనుక తేడాలు ఏర్పడి, రైతుల్లో అయోమయం, అసంతృప్తి నెలకొంది.
రైతు పంటను మార్కెట్‌కు తీసుకురావడం నుంచి కొనుగోలు పూర్తయ్యే వరకు రోజులు వేచి చూసి, చివరకు పంట అమ్ముకున్న తర్వాత కూడా తన డబ్బు కోసం ఎదురుచూడాల్సి రావడం మార్కెట్ వ్యవస్థలో రైతు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్యను చూపిస్తుంది.
రైతుకు MSP నిజమైన ప్రయోజనం అందాలంటే MSP ప్రకటించడం మాత్రమే కాకుండా, MSP వద్ద పంట కొనుగోలు జరిగేలా సమర్థవంతమైన మార్కెట్ వ్యవస్థ ఉండాలి.
- పంట మార్కెట్‌కు వచ్చే సమయానికి ముందుగానే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
- జిల్లాలో ఉత్పత్తికి అనుగుణంగా సరిపడా కొనుగోలు కోటా కేటాయించాలి.
- ఎకరాకు కొనుగోలు పరిమితిని వాస్తవ దిగుబడిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలి.
- ప్రభుత్వ కొనుగోలు సామర్థ్యం సరిపోని ప్రాంతాల్లో అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
- కొనుగోలు చేసిన పంటకు రైతులకు నిర్ణీత సమయంలో చెల్లింపులు జరిగేలా పర్యవేక్షణ ఉండాలి.
- ప్రభుత్వ కొనుగోలు నిలిచిపోయే పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ మార్కెట్‌కు తక్కువ ధరకు పంట విక్రయించాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
SRD. Anusha
Kisanmitra Coordinator 7997847555
No comments yet. Login to start a new discussion Start a new discussion