about - జిల్లా ప్రజావాణి పనితీరు: ప్రజల సమస్యలకు పరిష్కార దిశగా మార్పులు - ఎదురవుతున్న సవాళ్లు

2026 ఏప్రిల్ 4 న వికారాబాద్ జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రాలలో ప్రారంభమైన ప్రజావాణి ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నది. గత ప్రజావాణి లతో పోలిస్తే ఈ ప్రజావాణి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా అన

 · 4 min read

2026 ఏప్రిల్ 4 న వికారాబాద్ జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రాలలో ప్రారంభమైన ప్రజావాణి ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నది. గత ప్రజావాణి లతో పోలిస్తే ఈ ప్రజావాణి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా అనిపిస్తుంది. ఈ మధ్య ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుదారుని సమస్యను జిల్లా స్థాయి ప్రజావాణి అధికారులు పరిశీలించి దానికి సంబంధించిన అధికారులను పిలిచి, దరఖాస్తు దారునితో, ఆ సమస్య గురించి చర్చించడం జరుగుతుంది. ఆ సమస్యకు అధికారులు కూడా అక్కడే సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ సమస్య గురించి చర్చించి, ఆ దరఖాస్తు పత్రాల మీద సంబంధిత అధికారులు సంతకం చేసిన తర్వాత దరఖాస్తుదారుడు తమ సమస్యను ఆన్లైన్ లో నమోదు చేసుకొని రసీదు కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా రసీదులు తీసుకోవడం, అక్కడే అధికారులు ఆ సమస్యను గురించి కొంత చర్చించడం వలన ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి సమస్య పరిష్కారం అయినా కాకపోయినా కనీసం దరఖాస్తుదారానికి సమాధానమైనా స్పష్టంగా అధికారుల ద్వారా లభిస్తుంది. వాస్తవానికి ఈ ప్రజావాణి ప్రారంభమైన తర్వాత అధికారులు కూడా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రజలకు వారి సమస్యకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజావాణికి వచ్చిన కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కూడా అవుతున్నాయి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అధికారులు అక్కడే పరిష్కారం చేస్తున్నారు. బిల్లింగ్ విషయం కూడా అక్కడే పరిష్కారం చేస్తున్నారు. రేషన్ కార్డ్ లో పేరు చేర్చడం కానీ, పేరు సరి చేయడం కానీ వెంటనే అక్కడే పూర్తి చేస్తున్నారు. పింఛన్ సదరం సర్టిఫికెట్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే వాటిని కూడా అక్కడే పరిష్కారం చేస్తున్నారు, గృహ జ్యోతి సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ శాఖకు సంబంధించిన కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కొన్ని కరెంటు సంబంధించిన లూజ్ వైరింగ్, ట్రాన్స్ఫార్మర్ లకు సంబంధించిన సమస్యలను అధికారులు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడైనా, యిప్పుడైనా ప్రజావాణికి ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, ప్రస్తుతమైతే రెవెన్యూ సమస్యలు కూడా కొంత పరిష్కారమయ్యే దిశగా వెళుతున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ దరఖాస్తు వచ్చినా అధికారులు పట్టించుకునేవారు కాదు. సర్వే గురించి గానీ, పహానీ ల గురించి గానీ, ప్రజలు దరఖాస్తు చేసుకుంటే కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సర్వే గురించి, పహానీల గురించి ఎవరైనా రైతులు దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే పూర్తి చేయడం జరుగుతుంది.

ప్రజావాణి నిర్వహణ :


  1. మొదటగా దరఖాస్తుదారులు తమ సమస్యకు సంబంధించిన దరఖాస్తు రాసుకొని దానికి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి రిజిస్టార్ లో తమ పేరు నమోదు చేసుకోవడానికి వెళుతున్నారు.
  2. ప్రవేశం దగ్గర అధికారులు రిజిస్టర్ లో దరఖాస్తు దారుని పేరు, ఊరు, మండలం, వారి సమస్య, మొబైల్ నెంబర్ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసుకుంటున్నారు.
  3. దరఖాస్తుదారుని వివరాలు తీసుకున్న తర్వాత దరఖాస్తు మీద సీరియల్ నంబర్ వేసి ప్రజావాణి స్టాంపు వేసి అధికారుల దగ్గరికి పంపిస్తున్నారు.
  4. దరఖాస్తుదారులు తమ సీరియల్ నంబర్ ఆధారంగా ప్రజావాణి అధికారుల దగ్గరకు తమ సమస్యలను తీసుకొని వెళ్తున్నారు.
  5. అధికారులు దరఖాస్తుదారుని సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులను అక్కడికి పిలిచి వారితో మాట్లాడుతున్నారు.
  6. అధికారులు మాట్లాడిన తర్వాత దరఖాస్తు మీద సంబంధిత అధికారి సంతకం చేసి ఆన్లైన్లో నమోదు చేయడానికి దరఖాస్తుదారున్ని పంపిస్తున్నారు.
  7. ఆపరేటర్లు దరఖాస్తును తీసుకొని ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తుదారునికి రసీదు ఇస్తున్నారు.
  8. ఆపరేటర్లు ప్రజావాణి పూర్తయిన తర్వాత వారు ఎంట్రీ చేసిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు.
  9. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల దరఖాస్తులు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో గతంలో వచ్చిన దరఖాస్తులు ఎంతవరకు పరిష్కారం అయ్యాయి ? ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉన్నాయి ? ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి ? అనే విషయం పై అధికారులతో మాట్లాడుతున్నారు.
  10. అదేవిధంగా ప్రజావాణి హాల్లో ప్రజలు వారి సమస్యకు సంబంధించిన అధికారులను కలవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి అధికారి దగ్గర నేమ్ బోర్డ్, డిపార్ట్మెంట్ పేరుతో బోర్డు చేయించి వారు ముందు ఉంచారు. కొన్ని డిపార్ట్మెంట్ ల దగ్గర టేబుళ్లు , వేసుకుని ఫ్లెక్సీలు కూడా ఉంచారు. దానివల్ల ప్రజలు అధికారులను కలవడానికి ఇబ్బంది కలగడం లేదు.
  11. జిల్లా స్థాయికి వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా డిపార్ట్మెంట్ల వారిగా సంబంధిత అధికారులకు పంపిస్తున్నరు,
  12. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి పంపిన దరఖాస్తులను మండల స్థాయి అధికారులు దరఖాస్తు దారుతో చర్చిస్తున్నారు. అందువల్ల కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయి.


జిల్లా స్థాయి లో ప్రజావాణి కార్యక్రమం కొంత సక్రమంగా జరుగుతున్నప్పటికీ అందులో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి.


  1. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించినప్పటికీ ప్రాసెస్ ప్రకారం ఆ సమస్యకు సంబంధించిన అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR ) రాయడం లేదు.
  2. ప్రజావాణి కి వచ్చిన ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు, దాని పరిష్కరించే మార్గం వైపు సీరియస్ గా ప్రయత్నం చేయడం లేదు.
  3. కొందరు మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో సమస్య గురించి ఇచ్చిన దరఖాస్తు ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి వెళితే ప్రజావాణిలో ఇచ్చిన రసీదు ను చూపిస్తే ఇంకా టైం ఉంది, తర్వాత రండి అని చెప్తున్నారు.
  4. కొందరు అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను సరిగా పరిశీలించకుండా, రిజెక్ట్ అని రాస్తున్నారు.
  5. ప్రజావాణిలో రైతు ఆత్మహత్యల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా గురించి ఇచ్చిన దరఖాస్తులపై ఇప్పటివరకు మండల స్థాయి అధికారులు ఎంక్వయిరీ కూడా చేయలేదు.
  6. ప్రజావాణి కి వచ్చే దరఖాస్తుదారులు తప్పకుండా సమస్యకు సంబంధించిన దరఖాస్తు రాసుకుని రావాలని, రాసుకొని వస్తేనే రిజిస్టర్ లో ఎంటర్ చేస్తామని నిబంధన కొంతమంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే దరఖాస్తు రాయడానికి అక్కడ ఎవరు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య అవుతున్నది.
  7. కొంతమంది అధికారులు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులకు పరిశీలించి ఏటీఆర్ రాయకుండా డైరెక్ట్ గా రిజెక్ట్ అని రాస్తున్నారు.


ప్రజా వాణి కార్యక్రమంలో ఇలాంటి సమస్యలు ప్రజలకు ఎదురు కాకుండా ఉండాలంటే జిల్లా స్థాయిలో ప్రజా వాణి నిర్వహణ కోసం కొంతమంది స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే విధంగా చూడాలి. కొందరు అధికారులు ప్రజల దరఖాస్తులను రిజెక్ట్ చేయకుండా, సమస్యకు సంబంధించిన సమాచారాన్నితప్పకుండా ATR రాసే విధంగా అధికారులకు చెప్పాలి. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి జిల్లా స్థాయిలో స్పెషలాఫీసర్ ఉంటే మండల స్థాయి అధికారులు కొంత శ్రద్ధ వహించి సమయానికి పనులు పూర్తి చేస్తారని అనిపిస్తుంది. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎంతవరకు పరిష్కారమయ్యాయి అనే విషయాన్ని అధికారులతో  చర్చించే విధంగా ఉండాలి. సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనే విషయాన్ని ప్రజలకు ఖచ్చితంగా చెప్పే విధానం ఉండాలి. ఒకవేళ అయితే ఎంత సమయం పడుతుందనే విషయాన్ని వారికి ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఉండాలి. ఈ వ్యవస్థలో మధ్యవర్తులు లేకుండా నేరుగా దరఖాస్తుదారులతో అధికారులు సమస్య గురించి చర్చించి పరిష్కరించే విధంగా ఉండాలి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఉండాలి. పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మొత్తం మీద ప్రజావాణి ద్వారా కొంతమంది ప్రజలకు తమ చిన్న చిన్న సమస్యలైనా పరిష్కారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఇంకొంత మెరుగుపరిచే విధంగా చేయాలి. క్రింది స్థాయి అధికారులు సమస్యలను తొందరగా పరిష్కారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల సమస్యల గురించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం జరిగే విధంగా బాధ్యత నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


               



S. Yadaiah

Kisan Mitra Vikarabad Field Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment