about - గ్రామీణుల గొంతుగా కిసాన్ మిత్ర 8 ఏళ్ల ప్రయాణం....
“రైతుల, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు నిజంగా బాధాకరం. ఆయా బాధిత కుటుంబాలకు జీవో ప్రకారం పరిహారం అందడం ముఖ్యమే కానీ, ఈ ఆత్మహత్యలు మరిన్ని జరగకుండా మనం ప్రయత్నం చేయడం మరింత ముఖ్యం కదా”
“రైతుల, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు నిజంగా బాధాకరం. కుటుంబ పెద్ద మరణం తరువాత ఆ కుటుంబం పడే బాధలు కూడా వర్ణనాతీతం. ఆయా బాధిత కుటుంబాలకు జీవో ప్రకారం పరిహారం అందడం ముఖ్యమే కానీ, ఈ ఆత్మహత్యలు మరిన్ని జరగకుండా మనం ప్రయత్నం చేయడం మరింత ముఖ్యం కదా”
2017 ప్రారంభంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ గారికీ, రైతు స్వరాజ్య వేదిక బృందానికీ మధ్య ఈ చర్చ జరిగింది. ఈ చర్చల ఫలితంగా ముందుకు వచ్చిందే గ్రామీణ ప్రజల కోసం ఒక హెల్ప్ లైన్ ఉండాలనే ఆలోచన. కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్, వికారాబాద్ జిల్లాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, 2017 ఏప్రిల్ 14న ప్రారంభమైంది. 2017 నుండీ 2020 వరకూ సుస్థిర వ్యవసాయ కేంద్రం (CSA) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాతో పాటు వివిధ జిల్లాలలో తన సేవలను అందిస్తోంది. 2021 నుండీ ఈ హెల్ప్ లైన్ ను రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) నిర్వహిస్తున్నది. 
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం అందించే ఉద్దేశ్యంతో 2017 నాటికే ఉన్న ప్రభుత్వ జీవో లలో (G.O. M.S. 421/2004, G.O. M.S. 194/2015, G.O. M.S. 173/2015) కూడా రైతులకు సహాయం చేయడానికి, రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఒక హెల్ప్‌లైన్‌ను నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది.
“గ్రామీణ వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకుని, దాన్ని తగ్గించే దిశగా రైతుల , ఇతర గ్రామీణ ప్రజల సమస్యలను విని, వాటిని వివిధ స్థాయిలలో ఉండే అధికారులకు చేర్చి, వాటి పరిష్కారం కోసం నిరంతరం ఫాలో అప్ చేస్తూ, ఈ హెల్ప్ లైన్ పని చేయాలి. రైతులు, ఇతర గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వ అధికారులకూ మధ్య వారధి లాగా కిసాన్ మిత్ర పనిచేయాలి” అనే ఉద్దేశంతో ఈ హెల్ప్ లైన్ ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి, తగ్గించడానికి వివిధ సంస్థలు చేస్తూ వచ్చిన అనేక ప్రయత్నాలలో ఈ హెల్ప్ లైన్ ను కూడా ఒక భాగం గా చూడాలి.
ప్రస్తుతం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ తెలంగాణా రాష్ట్రం వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం, సత్యసాయి, అనకాపల్లి జిల్లాలలో పని చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో రైతులతో, ఇతర గ్రామీణ ప్రజలతో కలసి వారి సమస్యలపై పని చేయాలనుకున్నప్పుడు, చాలా ప్రాంతాలలో రైతులు, ఇతర గ్రామీణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి ఒక వేదికంటూ లేదని అర్థమైంది. రైతుల, గ్రామీణ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నట్లు కూడా కనిపించింది. ఈ నేపధ్యంలో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ అలాంటి ఒక వేదికలా పని చేయాలని మేము భావించాము.

V. Bhargavi Gupta
Kisanmitra, State Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion