about - కిసాన్ మిత్ర కృషితో రెవెన్యూ భూమి సమస్య పరిష్కారం

రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం, పంట రుణాలు వంటి ప్రయోజనాలు తీసుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్కసారిగా అతని జీవితం అస్తవ్యస్తమైంది.

 · 2 min read

తెలంగాణ రాష్ట్రం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిరిపూర్ (యు) మండలంలోని ధనోర గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు ఆత్రం మారు తాత ముత్తాతల కాలం నుండి స్వయంగా సాగు చేసుకుంటూ వస్తున్న భూమిలోనే జీవనం సాగిస్తున్నారు. (వారి భూమి వివరాలు - సర్వే నంబర్ 10/2/2/1, విస్తీర్ణం 2-13 ఎకరాలు) ఈ భూమిని తమ తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. 2018 లో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పాస్‌బుక్ ద్వారా భూమిపై హక్కు కూడా వచ్చింది .

ఆత్రం మారు ప్రతి సంవత్సరం ఈ భూమిలో పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. రైతుబంధు ద్వారా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం, పంట రుణాలు వంటి ప్రయోజనాలు తీసుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కానీ,   అధికారుల నిర్లక్ష్యం  వల్ల  ఒక్కసారిగా అతని జీవితం అస్తవ్యస్తమైంది.

రైతు‌కు తెలియకుండానే తహసిల్దార్ కార్యాలయం వారు  భూమి రికార్డులపై “చెరువు శిఖం” ఉందన్న తప్పుడు సమాచారం నమోదు చేయడంతో సర్వే నంబర్‌కు డిజిటల్ సంతకం చేయకుండా ఆపేశారు. అప్పటినుండి  దీని ప్రభావం రైతుపై తీవ్రంగా పడింది. ఆయనకు రైతుబంధు నిధులు రాకుండా పోయాయి, బ్యాంక్ రుణాలపై సమస్యలు తలెత్తాయి. మిగతా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కనిపించలేదు. బాధితుడు పరిష్కారం కోసం మార్గాలు వెతుకుతూ, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ కు ఫోన్ చేశారు.

దశల వారీగా చేసిన ప్రయత్నాలు:

హెల్ప్‌లైన్ స్పందనతో, కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ ఆయనను కలిశారు. వ్యవహారాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తహసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రైతు వివరిస్తూ, తాను సాగు చేస్తున్న భూమిలో ఎటువంటి కాలువలూ లేవని తెలిపాడు. మొదట అధికారులు ‘వస్తామని’ చెప్పి రాలేదు. అలా  వరుసగా మూడు సార్లు రాకుండా కాలయాపన చేశారు. చివరికి అధికారి స్థల పరిశీలనకు వచ్చి  రైతు చెప్పింది నిజమని   నిర్దారించుకున్నారు. అనంతరం రైతు ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేయడంతో, తహసిల్దార్ గారి డిజిటల్ సంతకం పూర్తయ్యింది.

     19-08-2024 న రైతుకు నూతనంగా పట్టా పాస్‌బుక్ మంజూరయ్యింది. జూన్ 2025 లో రైతు ఖాతాలో రైతుబంధు నిధులు రూ.12,780/- జమయ్యాయి. ఆయన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం కూడా పొందగలిగాడు.

     రైతు ఆత్రం మారు, అతని కుమారుడు పాండురంగ్, కిసాన్ మిత్ర ఫీల్డ్ వర్కర్ చేసిన సహాయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన వ్యవస్థ లోపాలను బహిర్గతం చేస్తూనే, ఒక రైతు నిబద్ధత, పట్టుదలతో చేసిన పోరాటం, కిసాన్ మిత్ర వంటి సేవా భావంతో నడిచే వ్యవస్థల ప్రాముఖ్యతను చాటిచెప్పింది. రైతుల సమస్యల పట్ల సకాలంలో  స్పందన అవసరమని, అలాగే ఆదివాసీ  హక్కులను కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా  వ్యవహరించాల్సిన  అవసరం ఉందని ఈ ఘటన రుజువు  చేస్తుంది.


Kanaka. AnandaRao

Kisanmitra, Asifabad field coordiantor 9493752633

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment