about - ఆగమైన కుటుంబాలకు అండగా రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS)
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సాధించుకుని దశాబ్ద కాలం దాటినా రాష్ట్రంలో ఇంకా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సాధించుకుని దశాబ్ద కాలం దాటినా రాష్ట్రంలో ఇంకా రైతులఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టినా, రుణ మాఫీ అమలు చేసినా, భూమి తమ పేరుతో ఉన్నవారికి మాత్రమే వీటి ద్వారా లబ్ధి చేకూరుతోంది.
భూమి తమ పేరు మీద లేని రైతులు, భూమి లేని కౌలు రైతులు మాత్రం ఈ పథకాలకు వెలుపలే మిగిలి పోతున్నారు. పంట నష్టమో, అప్పుల బాధో వచ్చినప్పుడు వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు.
పంట వేయడానికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు తదితర పెట్టుబడి కోసం వీరు ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వారు అధిక వడ్డీల బారిన పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో వరుసగా పంట నష్టపోతే వారిపై అప్పుల భారం పెరిగి పోతోంది. వడ్డీ కట్టలేని పరిస్థితిలో, అప్పుల భారం తట్టుకోలేక చివరికి రైతులు నిరాశ, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
దీన స్థితిలో ఆ కుటుంబాలు
ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోతున్నాయి. సంపాదించే వ్యక్తి లేకపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ వైపు పూట గడవడం కష్టమై, పిల్లలను పోషించలేక మరో వైపు అప్పుల వాళ్ల వేధింపులను తట్టు కోలేక ఆ కుటుంబాలు తీవ్ర మనో వేదనలో జీవిస్తున్నాయి. అయినా వారు తమ పిల్లల కోసం జీవించాలనే ఆరాటంతో ముందుకుసాగుతున్నారు.
అండగా నిలవని చట్టాలు
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు మద్దతు అందించడానికి జీవోలు ఉన్నాయి. అయినా అవి సక్రమంగా అమలు కావడం లేదు. ఈ అంశంపై రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) నిరంతరం కృషి చేస్తూ, ప్రభుత్వంతో చర్చలు జరిపి లబ్ధిదారులకు పథకాలు చేరేలా ప్రయత్నిస్తోంది.
RDSS సహాయం
రైతు ఆత్మహత్య జరిగిన బాధిత కుటుంబాలకు అండగా దశాబ్ద కాలంగా RDSS సంస్థ నిలబడి, ఆయా కుటుంబాల
జీవనోపాధి కోసం సహాయం అందిస్తోంది. డబ్బు రూపంలోనే కాకుండా వారికి వివిధ రూపాలలో నిరంతర ఆదాయం చేకూరేలా ప్రయత్నిస్తోంది.
పాడి పశువులను కొనివ్వడం, వ్యాపారాలు పెట్టించడం, పిల్లలను హాస్టల్లో చేర్పించడం లేదా పిల్లల చదువులకు అవసరమైన సహాయం చేయడం లాంటి కృషి చేస్తోంది. ఆయా కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు, “వీళ్ళు మనకు తోడుగా ఉన్నారు” అనే ధైర్యాన్ని ఆ కుటుంబాలకు కల్పించడం కూడా సంస్థ ప్రధాన ఉద్దేశ్యం.

కుటుంబాలకు జీవనోపాధికి మార్గం
RDSS సంస్థ ద్వారా ఇప్పటి వరకూ కొన్ని వందల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందాయి. ఈ కుటుంబాలకు ఇతర సంస్థలు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చేలా RDSS ప్రోత్సహిస్తోంది. ఇలా సహాయం పొందిన కొన్ని కుటుంబాలను RDSS సభ్యులు ఇటీవల ప్రత్యక్షంగా కలుసుకున్నారు. మరికొన్ని కుటుంబాలను ఫోన్ ద్వారా సంప్రదించారు. వారి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఆ దుర్ఘటన (ఆత్మహత్య) తర్వాత మేము పూర్తిగా నిరాశలో కూరుకుపోయాం. కానీ మీరు అందించిన చేయూత వల్ల
ఇప్పుడు కొంత మెరుగైన జీవితం గడుపుతున్నాం. మాకు తోడుగా ఒకరున్నారనే ధైర్యం కలిగింది” అని ప్రతి ఒక్కరూ చెప్పారు.
జీవనోపాధి సహాయం పొందిన శ్రీమతి గోని పుష్పమ్మ
వికారబాద్ జిల్లా పూడూరు మండలం కంకాల్ గ్రామానికి చెందిన గోని పుష్పమ్మ మహిళా రైతు.
అధిక అప్పులు, వరుస పంట వైఫల్యాల కారణంగా ఆమె భర్త గోని వీరన్న 2013 జూన్ 13 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఆ బాధ నుండి తేరుకోక ముందే వారి కుమారుడు పవన్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.కొడుకు పవన్ మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. పుష్మమ్మ కూతురుకు పెళ్లిచేసింది.
కుటుంబానికి 1 ఎకరం స్వంత భూమి ఉంది. నాలుగెకరాల కౌలు చేసేవారు. వ్యవసాయంలో నష్టాల వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల అప్పు అయింది. కుటుంబంలో సంభవించిన వరుస మరణాలు పుష్పమ్మను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినప్పటికీ ఆమె తనను తాను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో జీవనోపాధి కోసం కూలీ పని చేసింది.
మా టీం గతంలో ఆమెని కలిసినపుడు “ఒక ఆవు కొనుగోలు చేసి పాల అమ్మకం ద్వారా స్థిరమైన జీవనోపాధి ఏర్పరచుకోవాలని” తన కోరికను వ్యక్తం చేసింది.
ఆమె పరిస్థితి దృష్టిలో ఉంచుకుని, 2025 మార్చి 27 న పుష్పమ్మకు RDSS సంస్థ 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఈ డబ్బులతో ఆమె ఒక ఆవును కొనుగోలు చేసుకుంది.
ఆమె కేవలం కూలి పనిపై మాత్రమే ఆధారపడకుండా, ఇప్పుడు పశువుల పోషణ ప్రారంభించింది.
పాల విక్రయం ద్వారా ఆమెకు నెలకు 2000 నుండి 3000 రూపాయల వరకు స్థిర ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడంతో పాటు, జీవితం పట్ల కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగగలమనే ధైర్యాన్ని ఇచ్చింది.
కొత్త జీవనోపాధితో ముందుకు సాగుతున్న సెడ్మాకి కవిత
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం, మంద బొగుడ గ్రామానికి చెందిన సెడ్మాకి కవిత భర్త మారుతి 2018 ఏప్రిల్ 8 న ఆత్మహత్య చేసుకున్నారు.
దీంతో ముగ్గురు చిన్నపిల్లలతో ఆమె ఒంటరిగా మిగిలారు.
సొంతంగా 3 ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ వ్యవసాయం, కూలి పనుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోక కుటుంబం కష్టాల్లో పడింది. ప్రభుత్వ సహాయం అందకపోవడంతో జీవనం మరింత భారమైంది.
ఈ నేపధ్యంలో RDSS సంస్థ 2022 లో కవిత కుటుంబానికి 40,000 రూపాయల విలువైన మేకలు అందించింది. ఈ మేకలు ఆమె కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఆధారంగా మారాయి.
ఆమె కుటుంబం మేకలను జాగ్రత్తగా పెంచడంతో, రెండేళ్లలో వాటి సంఖ్య పెరిగింది. 5 మేకలు అమ్మి సుమారు ₹50,000 సంపాదించింది. వచ్చిన డబ్బును పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు, వైద్యానికి వినియోగించుకున్నారు. ఈ క్రమంలో 2 మేకలు రోగాలతో చనిపోయినప్పటికీ, ప్రస్తుతం 3 పెద్ద మేకలు, 1 పిల్ల మిగిలి ఉన్నాయి.
కవిత కుటుంబానికి మేకల పెంపకం వల్ల కుటుంబానికి మంచి ఆదాయం లభించింది. రోజువారీ కూలి (వ్యవసాయం, MGNREGA) ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి జీవనోపాధి కొంత స్థిరపడే అవకాశం లభించింది. పిల్లల చదువులు ఆగకుండా కొనసాగుతున్నాయి. కవితకు ఇప్పుడు ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై ఆశ పెరిగింది.
కవిత ఇలా అంటోంది :
" సంస్థ అందించిన మేకల వల్ల పిల్లల చదువులు కొనసాగించడానికి, వైద్యం చేయడానికి, ఇంటి ఖర్చులను తీర్చడానికి నాకు పెద్ద సహాయం అయింది. నాకు భవిష్యత్తులో మరింత ఎదగగలననే నమ్మకం కలిగింది."
Kasani Harini
9950619722
No comments yet. Login to start a new discussion Start a new discussion