about - ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరిస్థితి- కుటుంబాలకు జీవనోపాధి సహకారం అవసరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పంట నష్టాలు, పెరుగుతున్న అప్పులు, పండించిన పంటలకు సరైన ధరలు లభించక పోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి వెళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పంట నష్టాలు, పెరుగుతున్న అప్పులు, పండించిన పంటలకు సరైన ధరలు లభించక పోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి వెళుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నీటి సమస్య మరింత తీవ్రమై, వందల అడుగుల లోతులోకి బోర్లు తవ్వించినప్పటికీ నీరు పడకపోవడం రైతుల పరిస్థితిని మరింత దయనీయంగా మారుస్తోంది.
ఇటీవలి కాలంలో టమోటా, ఉల్లి వంటి పంటల ధరలు కిలోకు రూపాయి, రెండు రూపాయలకే పడిపోవడం రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులే ఎక్కువ దెబ్బతింటున్నారు. భూమి స్వంతం కాకపోవడం, ప్రభుత్వ పథకాలలో గుర్తింపు లేకపోవడం వల్ల వారు మరింత వెనకబడుతున్నారు.
ఈ నేపథ్యంలో 2026 మార్చ్ నెలలో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) ఆధ్వర్యంలో అత్యంత సంక్షోభం లో ఉన్న 17 రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.50,000 చొప్పున జీవనోపాధి సహకారం అందించారు. ఈ సహాయంతో బాధిత కుటుంబాలు ఆవులు, గేదెలు, మేకల పెంపకం చేపట్టడం, బార్బర్ షాప్, టైలరింగ్, శారీ వ్యాపారం వంటి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు.
“ఈ సహకారంతో మేము మా జీవనోపాధిని మెరుగుపరుచుకుంటాం, మా పిల్లల చదువులు కొనసాగిస్తాం” అని పలువురు మహిళలు తెలిపారు. అదే సమయంలో, 35 సంవత్సరాల లోపు భర్తలను కోల్పోయిన మహిళలు “మేము జీవితాంతం ఎలా బతకాలి… మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి” అనివేడుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖా మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, జాతీయ స్థాయి రైతు నాయకులు విస్సా కిరణ్ కుమార్, సిపిఐ రైతు సంఘం నాయకులు జమలయ్య, రైతు సంఘం నాయకులు కేశవరావు, మాగంటి హరిబాబు, RDSS ప్రతినిధి గాడి శ్రీను పాల్గొని బాధిత కుటుంబాల సమస్యలను తెలుసుకున్నారు.
అయితే రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకూ దుర్భరంగా మారుతోంది. జీ ఓ 43 సరిగా అమలు జరగడం లేదు. , కౌలు రైతులకు CCRC కార్డులు ఇవ్వడం లేదు. కౌలు రైతుల ఆత్మహత్యలను అధికారికంగా గుర్తించడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వ సహాయం అందుకోలేక పోతున్నాయి.
నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కూడా రాష్ట్రంలో అసలుఅమలు కావడం లేదు. ఈ కారణంగా అర్హులైన కుటుంబాలకు అందాల్సిన అత్యవసర ఆర్థిక సహాయం కూడా అందడం లేదు. భర్తలు మరణించిన మహిళలకు ఆసరా పెన్షన్లు కూడా సరిగా అందడం లేదు. దీంతో రైతు కుటుంబాలు పూర్తిగా ఆధార రహితంగా మారుతున్నాయి. రాష్ట్రంలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా సమర్థ వంతంగా అందడం లేదు.
బాధిత కుటుంబాల , రైతు సంఘాల డిమాండ్లు :
- జీఓ 43 ను పూర్తిగా అమలు చేసి అర్హులైన కుటుంబాలకు సహాయం అందించాలి.
- కౌలు రైతులకు వెంటనే CCRC కార్డులు ఇవ్వాలి.
- NFBS పథకాన్ని తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలి.
- భర్తలు మరణించిన మహిళలకు వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి.
- బాధిత కుటుంబాల పిల్లల చదువులకు పూర్తి సహాయం అందించాలి.
- జీవనోపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలను ఆదుకోవాలి.
రైతు ఆత్మహత్యలు వ్యక్తిగత వైఫల్యాలు కావు. అవి వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులకు గుర్తింపు, వ్యవసాయానికి స్థిరత్వం, సరైన ధరలు, సామాజిక భద్రత కల్పించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది.
రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS), రైతు స్వరాజ్య వేదిక రైతు కుటుంబాలకు అండగా నిలుస్తూ, జీవనోపాధి సహకారం అందిస్తూ, వారి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి

Kondal Reddy
+91 99488 97734
No comments yet. Login to start a new discussion Start a new discussion