about - KisanMitra October Update
ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు కనీస మద్దతు ధరలు అందడం లేదు
2025 ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 1 నుండి పంటలు మార్కెట్ కు రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పెసర, మినుము, పత్తి పంటలు మార్కెట్ కు వస్తున్నాయి. కానీ ఈ సీజన్ లో ఈ పంటలు తెచ్చిన రైతులకు కనీస మద్దతు ధరలు అందడం లేదు. సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 3 వరకు మార్కెట్ కు వచ్చిన పంటల వివరాలు, రైతులకు అందిన కనీస మద్దతు ధరల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
సాధారణ మొక్కజొన్న అక్టోబర్ 3 నాటికి 39 వేల 177 క్వింటాళ్లు మార్కెట్ కు వచ్చింది..మొక్క జొన్నకు కనీస మద్దతు ధర 2400 రూపాయలు ఉండగా రైతులు తెచ్చిన 99 శాతం పంటకు కనీస మద్దతు ధర లభించలేదు. కనీస మద్దతు ధరలో 23 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకున్నారు.
ఈ కాలంలో 180 క్వింటాళ్ల సోయాబీన్ వచ్చింది. ఇందులో నూటికి నూరు శాతం రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకున్నారు. సోయాబీన్ కు కనీస మద్దతు ధర 5328 కాగా రైతులకు 35% తక్కువ ధర లభించింది, ఇదే సమయంలో రైతులు 5881 క్వింటాళ్ల వేరుశెనగ కాయల్ని మార్కెట్ కు తీసుకొచ్చారు. వేరుశెనగ కనీస మద్దతు ధర 7263 కాగా రైతులు తెచ్చిన వేరుశనగ పంటకు 43% తక్కువ ధర లభించింది.
ఇదే పీరియడ్ లో మార్కెట్ కు 25 వేల 151 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పత్తి కనీస మద్దతు ధర 7710 రూపాయలు కాగా, రైతులు తెచ్చిన పత్తికి కనీస మద్దతు ధర కంటే 13 % తక్కువ ధర లభించింది. అమెరికా నుండీ పత్తిని డిసెంబర్ 31 వరకూ ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ప్రస్తుతమున్న సాధారణ పరిస్థితులలో భారీ వర్షాల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. అయినా రైతులకు కనీస మద్ధతు ధర కూడా అందడం లేదు. .
మార్కెట్ కు పెసర పంట 20,539 క్వింటాళ్లు వచ్చింది. పెసర పంటకు కనీస మద్దతు ధర 8,768 కాగా, రైతులు తెచ్చిన పెసర పంటకు 42% తక్కువ ధర లభించింది. ఇదే పీరియడ్ లో మార్కెట్ కు 3082 క్వింటాళ్ల మినుములు వచ్చాయి. మినుము కు కనీస మద్దతు ధర 7,800 కాగా రైతులు తెచ్చిన మినుములకు 40 శాతం తక్కువ ధర లభించింది.
మొత్తంగా అక్టోబర్ మూడు నాటికి 41 కోట్ల విలువైన ఈ పంటలు మార్కెట్ కు రాగా, ఇందులో కనీస మద్దతు ధర కంటే 28 శాతం తక్కువగా ధరలు అంది రైతులు మొత్తం సుమారు 16 కోట్ల రూపాయలు నష్టపోయారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్ లో 16 పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించినా, వాటికి చట్టబద్ధత లేదు. వ్యాపారులు తప్పకుండా కనీస మద్దతు ధరలకే పంటలు కొనాలని నియమం లేదు.
ఈ కారణం చేతనే రైతు సంఘాలు సుదీర్ఘ కాలంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ రైతుల ఈ డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రతి సీజన్ లో రైతులు కష్టపడి పండించిన పంటలకు కేంద్రం ప్రకటించిన కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. ఒకవైపు పంటల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. మరో వైపు రైతుల పంటలకు లాభదాయక ధరలు మాత్రం అందడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు పెట్టుబడి కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. అప్పుల నుండి బయటపడలేక ఆత్మ హత్యల వైపు నడుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేవలం వరిని ప్రోత్సహించడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు లాంటి పంటలకు సరైన ధరలు అందేలా మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. ఈ పంటలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి.
No comments yet. Login to start a new discussion Start a new discussion