about - 80 ఏళ్ల స్వాతంత్ర్యంలో పేదవాడికి న్యాయం ఎక్కడ ?
దవాడికి భూమి సమస్య వస్తే అధికారుల చుట్టూ తిరగాల్సిందే. రేషన్, పెన్షన్, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల గడపలు తొక్కాల్సిన పరిస్థితి.
1947 ఆగస్టు 15 న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి పౌరుడికి అందాలనే లక్ష్యంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. చట్టం ముందు అందరూ సమానమేనని రాజ్యాంగం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆచరణలో పేదవాడి పరిస్థితి పూర్తిగా మారిందా? అనే ప్రశ్న ఇప్పటికీ మన ముందుంది.
పేదవాడికి భూమి సమస్య వస్తే అధికారుల చుట్టూ తిరగాల్సిందే. రేషన్, పెన్షన్, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాల గడపలు తొక్కాల్సిన పరిస్థితి.
డబ్బు, పలుకుబడి ఉన్నవారి పని త్వరగా పూర్తవుతుందనే ఆరోపణలు వినిపిస్తుంటే.. సామాన్యుడి పని మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలనా వ్యవస్థపై ఉంది.
రాజ్యాంగం చెప్పింది ఒకటి.. ఆచరణలో మరొకటా?
భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ న్యాయం పొందడానికి కూడా డబ్బు, సమయం, పరిచయాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.
పేదవాడికి న్యాయం ఆలస్యం అయితే అతని కుటుంబం మొత్తం నష్టపోతుంది. ఒక రోజు కూలీ పని మానుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం కూడా అతనికి/ఆమెకు ఆర్థిక భారమే. అతని సమస్యను అధికారులు సున్నితంగా అర్థం చేసుకోవాలి.
అభివృద్ధి అంటే ఎవరి కోసం?
దేశం ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. భారీ ప్రాజెక్టులు రావాలి. నగరాలు అభివృద్ధి చెందాలి. సాంకేతిక రంగంలో భారత్ మరింత ముందుకు వెళ్లాలి. కానీ అదే సమయంలో గ్రామంలోని పేద కుటుంబానికి తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, భద్రత అందుతున్నాయా? అనేది కూడా అభివృద్ధికి కొలమానం కావాలి. చంద్రుడిపై అడుగుపెట్టిన దేశం, ఒక పేదవాడి ఇంటి సమస్యను పరిష్కరించలేకపోతే ఆ అభివృద్ధి ఇంకా అసంపూర్ణమే.

పేదవాడికి కావాల్సింది దానం కాదు.. హక్కు
పేదవాడిని ఓటు సమయంలో మాత్రమే గుర్తు చేసుకునే రాజకీయ సంస్కృతి మారాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కాకుండా, ఎన్నికల తర్వాత కూడా అతని సమస్యలను పరిష్కరించే వ్యవస్థ ఉండాలి.
పేదవాడికి ఎవరి దయ అవసరం లేదు. అతనికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు కావాలి. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను నేరుగా వినాలి. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరాలి. అవినీతి, మధ్యవర్తిత్వం, నిర్లక్ష్యానికి అడ్డుకట్ట పడాలి.
స్వాతంత్ర్యం అంటే కేవలం జాతీయ జెండా ఎగరవేయడం కాదు. ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించడం.పేదవాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు అతని మాట వినాలి. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు గౌరవంగా స్పందించాలి. ఆసుపత్రికి వెళ్లినప్పుడు డబ్బు లేక చికిత్సకు దూరం కాకూడదు. పిల్లలకు నాణ్యమైన విద్య అందాలి. కష్టపడి పనిచేసే ప్రతి మనిషికి జీవన భద్రత ఉండాలి.
స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న భారతదేశం అంటే ధనవంతుల కోసం మాత్రమే ఉన్న దేశం కాదు. చివరి వరుసలో నిలబడిన పేదవాడికీ న్యాయం, గౌరవం, సమాన అవకాశాలు లభించే భారతదేశం.పేదవాడి కన్నీరు తుడిచిన రోజే ప్రజాస్వామ్యం నిజమైన విజయాన్ని సాధించిన రోజు.
Vadla. Amareshwar
7036135805, Field Coordinator, Vikarabad
No comments yet. Login to start a new discussion Start a new discussion