about - జీవామృతం – నేల ఆరోగ్యానికి సహజ పోషకం
కిసాన్ మిత్ర ఈసారి సంచికలో నేల ఆరోగ్యం, నేలలోని సూక్ష్మజీవుల పాత్ర మరియు జీవామృతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
కిసాన్ మిత్ర ఆగస్ట్ సంచికలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను పురుగు–తెగుళ్ల నుంచి రక్షించడానికి ఉపయోగించే నీమాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి ద్రావణం వంటి సహజ కషాయాలు ద్రావణాల గురించి తెలుసుకున్నాం. ఈసారి నేల ఆరోగ్యం, నేలలోని సూక్ష్మజీవుల పాత్ర మరియు జీవామృతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
మన నేల పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు విషాల వినియోగం, పంట అవశేషాలను నేలలోకి తిరిగి చేర్చకపోవడం, నేలలో సేంద్రియ పదార్థాల లోపం, నేలలో తేమ తగ్గడం వంటి కారణాలతో అనేక వ్యవసాయ భూముల్లో నేల జీవక్రియ, నేలలోని సేంద్రియ పదార్థాల స్థాయి తగ్గిపోతున్నాయి. .
నేల అనేది కేవలం మొక్కలను నిలబెట్టే మాధ్యమం మాత్రమే కాదు. అందులో అనేక రకాల సూక్ష్మజీవులు నివసిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
నేలలోని సూక్ష్మజీవులు ఎందుకు ముఖ్యమైనవి?
బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగీ), యాక్టినోమైసీట్స్ వంటి సూక్ష్మజీవులు నేలలో జరిగే అనేక సహజ ప్రక్రియల్లో పాల్గొంటాయి. ఇవి
పంట అవశేషాలు, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయే ప్రక్రియకు సహాయ పడతాయి.
- నేలలోని పోషకాలు మొక్కలకు అందుబాటులోకి రావడానికి ఇవి సహాయపడతాయి.
- నేలలో పోషకాల చక్రం కొనసాగుతుంది.
- మొక్కల వేర్ల చుట్టూ ఉండే జీవక్రియకు తోడ్పాటు లభిస్తుంది.
- నేల నిర్మాణం, నీటిని నిలుపుకునే సామర్థ్యం వంటి నేల లక్షణాలకు పరోక్షంగా సహాయం అందుతుంది.
- అందువల్ల నేలలో సూక్ష్మజీవుల ఉనికి, వాటి చురుకైన జీవక్రియ నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గితే ఏమవుతుంది?
నేలలో సేంద్రియ పదార్థం , జీవ క్రియ తగ్గినప్పుడు సూక్ష్మజీవుల కార్యకలాపాలు కూడా తగ్గవచ్చు. దీని వల్ల నేలలోని పోషకాల చక్రం నెమ్మదించడం, సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం తగ్గడం, మొక్కలకు కొన్ని పోషకాలు అందుబాటులోకి రావడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
అందుకే నేలకు కేవలం పోషకాలు అందించడం మాత్రమే కాకుండా నేలలోని జీవక్రియను కూడా కాపాడటం చాలా అవసరం.
జీవామృతం ఎందుకు ఉపయోగించాలి ?
ప్రకృతి వ్యవసాయంలో జీవామృతాన్ని నేల జీవ క్రియకు తోడ్పడే సహజ పోషకం గా ఉపయోగిస్తారు. ఆవు, ఇతర పాడి పశువుల పేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండి వంటి పదార్థాలు సూక్ష్మజీవుల కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో సహాయ పడతాయి. పుట్టమట్టి లేదా అడవి మట్టి ద్వారా స్థానిక సూక్ష్మజీవులు మిశ్రమంలోకి చేరే అవకాశం ఉంటుంది.
జీవామృతం ఉపయోగించడం:
- నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలకు తోడ్పడుతుంది.
- సేంద్రియ పదార్థాల విచ్ఛిన్న ప్రక్రియకు సహాయం చేస్తుంది.
- నేలలో పోషకాల చక్రానికి తోడ్పడుతుంది.
- మొక్కలకు కొన్ని పోషకాలు అందుబాటులోకి రావడానికి సహాయపడుతుంది.
- నేల జీవక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
- నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
జీవామృతాన్ని ప్రధానంగా ద్రవ జీవామృతం మరియు ఘన జీవామృతం రూపాల్లో ఉపయోగిస్తారు.
ద్రవ జీవామృతం
ద్రవ జీవామృతాన్ని ఆవు, ఇతర పాడి పశువుల పేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమట్టి/అడవి మట్టి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. తయారీ సమయంలో జరిగే కిణ్వ ప్రక్రియ ద్వారా ఈ మిశ్రమం పంట పొలంలో ఉపయోగించేందుకు సిద్ధమవుతుంది.
కావాల్సిన పదార్థాలు
- ఆవు/ఇతర పాడి పశువుల పేడ – 10 కిలోలు
- ఆవు/ఇతర పాడి పశువుల మూత్రం – 10 లీటర్లు
- బెల్లం – 2 కిలోలు
- పప్పు దినుసుల పిండి – 2 కిలోలు
- పుట్టమట్టి / అడవి మట్టి – ఒక గుప్పెడు
- నీరు – 100 లీటర్లు
గమనిక: వేరుశనగ పిండి, సోయా పిండి ఉపయోగించకూడదు.
తయారీ విధానం
- పెద్ద, శుభ్రమైన డ్రమ్ములో 100 లీటర్ల నీరు తీసుకోవాలి.
- ఆవు /ఇతర పశువుల పేడ, బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమట్టి/అడవి మట్టిని విడివిడిగా తగినంత నీటిలో కరిగించాలి.
- ఈ మిశ్రమాలను ఒకదాని తరువాత ఒకటి డ్రమ్ములో పోయాలి.
- చివరగా ఆవు/ ఇతర పశువుల మూత్రం పోసి, కర్రతో 5–10 నిమిషాలు సవ్యదిశలో బాగా కలియతిప్పాలి.
- డ్రమ్మును గోనె పట్టా లేదా నూలు వస్త్రంతో కట్టి, నేరుగా ఎండ తగలని నీడలో ఉంచాలి.
- దానిని 7 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు సవ్య దిశలో కలియ తిప్పాలి.
- మిశ్రమం బంగారు రంగులోకి మారి, పండిన పండు వాసన వచ్చినప్పుడు సిద్ధమైనట్లు గుర్తించవచ్చు.
- తయారైన ద్రవ జీవామృతాన్ని 8 నుండీ 10 రోజుల్లోపు ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
ద్రవ జీవామృతం వినియోగం
- నీరు పెట్టే సమయంలో నీటితో కలిపి పొలానికి పారించవచ్చు.
- వడపోసిన ద్రవ జీవామృతాన్ని డ్రిప్ లేదా తుంపర్ల సేద్యం ద్వారా ఉపయోగించవచ్చు.
- పంటపై పిచికారీ చేస్తే ఆకులు, రెమ్మలు, కొమ్మలు, కాండం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
ఎకరానికి పిచికారీ మోతాదు :
- పంట వయస్సు ద్రవ జీవామృతం నీరు
- 15–25 రోజులు 5 లీటర్లు 100 లీటర్లు
- 40–45 రోజులు 10 లీటర్లు 100 లీటర్లు
- 60–70 రోజులు 15 లీటర్లు 100 లీటర్లు
- 4 నెలల తరువాత 30 లీటర్లు 100 లీటర్లు
ఘన జీవామృతం
ఘన జీవామృతం ఆవు,ఇతర పాడి పశువుల పేడ, మూత్రం, బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమట్టి/అడవి మట్టితో తయారు చేసే ఘన రూపంలోని సహజ ఎరువు. తయారు చేసిన మిశ్రమాన్ని ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టి ఉపయోగిస్తారు.
కావాల్సిన పదార్థాలు
- ఆవు, ఇతర పాడి పశువుల పేడ – 100 కిలోలు
- ఆవు,ఇతర పాడి పశువుల మూత్రం – 5–10 లీటర్లు
- బెల్లం – 2 కిలోలు
- పప్పు దినుసుల పిండి – 2 కిలోలు
- పుట్టమట్టి / అడవి మట్టి – ఒక గుప్పెడు
గమనిక: వేరుశనగ పిండి, సోయా పిండి ఉపయోగించకూడదు.
తయారీ విధానం
100 కిలోల ఆవు,ఇతర పాడి పశువుల పేడను శుభ్రమైన ప్రదేశంలో పరచి, రాళ్లు, చెత్త వంటి మలినాలను తొలగించాలి. బెల్లం, పప్పు దినుసుల పిండి, పుట్టమట్టి/అడవి మట్టిని వేర్వేరు పాత్రల్లో తీసుకుని ఆవు,ఇతర పాడి పశువుల మూత్రంలో విడివిడిగా బాగా కరిగించాలి.
తయారు చేసిన మిశ్రమాలను కొద్దికొద్దిగా పేడపై చల్లుతూ అన్ని పదార్థాలు సమానంగా కలిసేలా బాగా కలపాలి. మిశ్రమం బాగా కలిసిన తర్వాత బంతుల్లా లేదా గుండ్రటి ఉండలుగా తయారు చేసుకోవాలి.
తయారు చేసిన ఉండలను వర్షం, తేమ నేరుగా తగలని నీడ ఉన్న ప్రదేశంలో సుమారు 8 రోజుల పాటు ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత గోనె సంచిలో నిల్వ చేసుకోవాలి.
ఘన జీవామృతం వినియోగం
ఎండిన ఘన జీవామృతాన్ని పొడి చేసి వ్యవసాయ పంటలకు విత్తనాలతో పాటు నేలలో వేయవచ్చు.
ఘన జీవామృతం మోతాదు
వ్యవసాయ పంటలు: అన్ని పంటలకు ఎకరానికి 400 కిలోల పొడి చేసిన ఘన జీవామృతం.
ఉద్యాన పంటలు:
- 0–5 సంవత్సరాల వయస్సు: ఒక్కో మొక్కకు 2–5 కిలోలు
- 5 సంవత్సరాల కంటే ఎక్కువ: ఒక్కో మొక్కకు 5–10 కిలోలు
నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. నేలలో జీవాన్ని కాపాడుకుందాం.
N. Mahitha
7981373159, Counselor
No comments yet. Login to start a new discussion Start a new discussion